Madharaasi Movie Review: మదరాసి మూవీ రివ్యూ

ABN , Publish Date - Sep 05 , 2025 | 05:20 PM

శుక్రవారం తెలుగువారి ముందుకు శివ కార్తికేయన్ నటించిన 'మదరాసి' సినిమా వచ్చింది. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం...

Madharaasi movie review

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) తో ఐదేళ్ళ క్రితం 'దర్బార్' తీసిన ఎ.ఆర్. మురుగదాస్ (Murugadoos) తెరకెక్కించిన తాజా తమిళ చిత్రం 'మదరాసి' (Madharaasi). అయితే ఇదే ఏడాది మురుగదాస్ హిందీలో సల్మాన్ ఖాన్ (Salmankhan) తో 'సికిందర్' మూవీనీ తీశాడు. అప్పటి రజనీకాంత్ సినిమానే కాదు... నిన్నటి సల్మాన్ ఖాన్ మూవీ సైతం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో అందరూ మురుగదాస్ మీద కంటే కూడా 'మదరాసి'లో హీరోగా నటించిన శివ కార్తికేయన్ మీదే హోప్స్ పెట్టుకున్నారు. గత దీపావళికి వచ్చిన శివకార్తికేయన్ 'అమరన్' సినిమా మూడు వందల కోట్ల గ్రాస్ ను వసూలు చేయడమే అందుకు కారణం. సో... 'మదరాసి' మురుగదాస్ మూవీగా కంటే శివ కార్తికేయన్ సినిమాగానే గుర్తింపు తెచ్చుకుంది. శుక్రవారం జనం ముందుకొచ్చిన ఈ సినిమాకు ఏ మాత్రమైనా ఓపెనింగ్స్ వచ్చాయంటే అవి శివ కార్తికేయన్ కారణంగానే!


'మదరాసి' కథ విషయానికి వస్తే చాలా సింపుల్. ప్రశాంతంగా ఉండే తమిళనాడు రాష్ట్రంలో దేవుడు, మతం పేరుతో చిచ్చుపెట్టలేమని గ్రహించిన కొందరు అక్కడ గన్ కల్చర్ తేవడం ద్వారా ప్రయత్నిస్తారు. తద్వారా రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని భావిస్తారు. ఆ కుట్రలో భాగంగా ఆరు ట్రక్కుల్లో తమిళనాడులోకి పవర్ ఫుల్ వెపన్స్ ను పంపుతారు. వాటి రవాణాను అడ్డుకోవడానికి ఎన్.ఐ.ఎ. అధికారులు తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. వారిని దాటుకుని విరాట్ (విద్యుత్ జమ్వాల్), చిరాగ్ (షబీర్ కలరక్కల్) తమ సిండికేట్ అండతో తమిళనాడులోకి అడుగుపెడతారు. మానసిక అనారోగ్యంతో పదహారేళ్ళ పాటు మెంటల్ హాస్పిటల్ లో ఉన్న రఘురామ్ (శివ కార్తికేయన్) అనుకోకుండా ఈ ఆపరేషన్ లో భాగమవుతాడు. అతని ప్రియురాలు మాలతి (రుక్మిణీ వసంత్) కూడా ఈ ఆటలో పావుగా మారిపోతుంది. అక్రమ ఆయుధాలు తమిళనాడులో సరఫరా కాకుండా ఎన్.ఐ.ఎ. అధికారులు నిలువరింప గలిగారా? రఘు కు ఉన్న మానసిక సమస్య ఏమిటీ? దాని ద్వారా ఎన్.ఐ.ఎ. అధికారులు ఎలా లబ్దిపొందారు? విలన్స్ ఉచ్చులో చిక్కుకున్న మాలతి అందులోంచి ప్రాణాలతో బయటపడిందా? అనేది మిగతా కథ.


తమిళనాడులో గన్ కల్చర్ ఇప్పటి వరకూ లేదని చాలా ఘంటాపథంగా దర్శకుడు మురుగదాస్ ఈ సినిమాలో చెప్పాడు. భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలతో పోల్చదగ్గ స్థాయిలో గన్ కల్చర్ లేని మాట వాస్తవమే కానీ స్టార్ హీరో ఎం. జి. రామచంద్రన్ ను తోటి నటుడు ఎం.ఆర్. రాధ (నటి రాధిక తండ్రి) కాల్చింది గన్ తోనే కదా! సినిమా రంగంలోనే గన్ కల్చర్ ఉన్నప్పుడు అది లేదని ఈ సినిమాలో చెప్పడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఆ విషయాన్ని పక్కన పెడితే, అసలు మురుగదాస్ ఎంచుకున్న పాయింటే చాలా పేలవంగా ఉంది. ఆరు ట్రక్కుల్లో అక్రమ ఆయుధాలు స్టేట్ లోకి వచ్చిన తర్వాత అవి డిస్ట్రిబ్యూట్ కాకుండా ఆపడం కోసం ముక్కూ ముఖం తెలియని వ్యక్తిని ఈ ఆపరేషన్ కోసం ఎంచుకోవడం, అతని మానసిక పరిస్థితిని అడ్వాంటేజ్ గా తీసుకోవడం ఏ రకంగానూ కన్వెన్సింగ్ గా అనిపించదు. సినిమా ప్రారంభం మొదలు, ముగింపు వరకూ ప్రతి సన్నివేశం కృత్రిమంగా ఉంది. కొత్తదనం ఉన్న సీన్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. రెండు గంటల యాభై నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో హై పాయింట్ ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించదు. దాంతో ఇదసలు మురుగదాస్ డైరెక్ట్ చేసిన మూవీనేనా అనిపిస్తుంది.


ఈ సినిమాను శివ కార్తికేయన్, రుక్మిణీ వసంత్ తమ నటనతో కాస్తంత నిలబెట్టే ప్రయత్నం చేశారు. విద్యుత్ జమ్వాల్, షబీర్ తెరపై స్టైలిష్ గా కనిపించారు. క్లయిమాక్స్ ఫైట్ లో విద్యుత్ జమ్వాల్ తన విశ్వరూపం చూపించాడు. ఆ యాక్షన్ ఎపిసోడ్ లెంగ్త్ కాస్తంత తగ్గించి ఉంటే బాగుంది. ఎన్.ఐ.ఎ. అధికారిగా బిజూ మీనన్ బాగా చేశాడు. నేపథ్యంలో వచ్చే రెండు పాటల సాహిత్యం అర్థవంతంగా ఉంది. అనిరుథ్ ఆర్.ఆర్. బాగుంది. గన్ కల్చర్ కు ప్రజలను దూరంగా ఉంచాలని చెప్పిన మురుగదాస్ స్టార్టింగ్ టు ఎడింగ్ దాన్నే హైలైట్ చేశారు. శివ కార్తికేయన్ అభిమానులకు ఈ సినిమా కొంత నచ్చవచ్చేమో కానీ మిగిలిన వారికి కష్టమే.

రేటింగ్: 2.25/ 5

ట్యాగ్ లైన్: హే మురుగా!

Also Read: Ghaati Review: అనుష్క నటించిన యాక్షన్ డ్రామా 'ఘాటీ' మెప్పించిందా!?

Also Read: Little Hearts Review: 'లిటిల్ హార్ట్స్' మూవీ ఎలాదంటే... 

Updated Date - Sep 05 , 2025 | 05:36 PM

Ghaati Review: అనుష్క ఘాటీ.. ట్విట్ట‌ర్ రివ్యూ! ఇలా అంటున్నారేంటి

Little Hearts Review: 'లిటిల్ హార్ట్స్' మెప్పించిందా 

Madharaasi Trailer: ఇది నా ఊరు సార్.. నేను వదలను

Madharaasi: బ‌క్కోడు.. మ‌రో పాట‌తో వ‌చ్చాడు! వ‌ర‌...వ‌ర వ‌ర‌ద‌ల్లే వీడియో సాంగ్‌

Madharasi: గజినీ పోలికతో.. 'మ‌ద‌రాసి'