Ghaati Review: అనుష్క నటించిన యాక్షన్ డ్రామా 'ఘాటీ' మెప్పించిందా
ABN , Publish Date - Sep 05 , 2025 | 03:03 PM
టాలీవుడ్‌లో మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచారు అనుష్కా శెట్టి. ఆమె సినిమా అంటే మినిమం గ్యారెంటీ అని ప్రేక్షకుల నమ్మకం. మిస్‌శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి చిత్రం తర్వాత సినిమాలకు రెండేళ్ల గ్యాప్ ఇచ్చారు స్వీటీ. తాజాగా ఆమె నటించిన చిత్రం ఘాటి.
సినిమా రివ్యూ: 'ఘాటి'
విడుదల తేది: 5–9–2025
టాలీవుడ్‌లో మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచారు అనుష్కా శెట్టి. ఆమె సినిమా అంటే మినిమం గ్యారెంటీ అని ప్రేక్షకుల నమ్మకం. మిస్‌శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి చిత్రం తర్వాత సినిమాలకు రెండేళ్ల గ్యాప్ ఇచ్చారు స్వీటీ. తాజాగా ఆమె నటించిన చిత్రం ఘాటి. క్రిష్ దర్శకుడు. విక్రమ్ ప్రభు కీలక పాత్రధారి. జగపతిబాబు, జాన్ విజయ్, చైతన్యరావు, రవీంద్ర విజయ్ ఇతర పాత్రధారులు. యువి. క్రియేషన్స్, ఫస్ట్ ప్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలపై వై రాజీవ్‌రెడ్డి, సాయి బాబా జాగర్లమూడి నిర్మించారు. ట్రైలర్, టీజర్‌లతో ఆసక్తి పెంచిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందనేది చూద్దాం.
కథ:
ఆంధ్రా, ఒడిస్సా సరిహద్దులో జరిగే కథ ఇది. తూర్పు కనుమల్లో ఉన్న ప్రాంతాల్లో జీవించే అందరికీ జీవనాధారం గంజాయి సాగును దళారుల చెంతకు చేర్పడం. కాష్టాల నాయుడు (రవీంద్ర విజయ్), కుందుల నాయుడు (చైతన్య రావు) కింద అక్కడి వారంతా పని చేయాలి. అలా పని చేసే ఘాటీల్లో బావామరదళ్లు అయిన దేశీ రాజు (విక్రమ్ ప్రభు), శీలావతి (అనుష్క) ఆ పని మానేసి వేరే మార్గం చూసుకుంటారు. కొంతకాలానికి మళ్లీ అదే వృత్తిలోకి రావాల్సి వస్తుంది. అసలు వాళ్లు ఆ వృత్తికి ఎందుకు దూరమయ్యారు? మళ్లీ ఎందుకు ఘాటీల అవతారం ఎత్తారు? ఒక బాధితురాలిగా ఉన్న శీలావతి క్రిమినల్‌గా, లెజెండ్‌గా ఎలా ఎదిగింది. దాని వెనక ఏం జరిగింది? ఆమె టార్గెట్ ఏంటి అన్నది కథ.
విశ్లేషణ
తూర్పు కనుమల్లో జరిగే గంజాయి సాగు, అక్కడ ఘాటీల జీవనాధారం, వారి కష్టాల నేపథ్యంలో సాగే కథ ఇది. సినిమా ప్రారంభం, ఆర్టిస్ట్ పరిచయం, కథలోకి తీసుకెళ్లడం అంతా బాగానే సాగింది. హీరోహీరోయిన్లు తమ దారి వదిలి మళ్లీ పాత రూట్‌లోకి రావాలనుకున్నప్పటి నుంచి కథ ముందుకు కథల్లేదు. ఫస్టాఫ్ వరకూ, దేశిరాజు పాత్రను కిల్ చేసే దాకా బాగానే సాగిన అక్కడి నుంచి కథలో వేగం తగ్గింది. ఇంటర్వెల్ ట్విస్ట్, జగపతిబాబు, రాజు సుందరం పాత్రల నడక ప్రేక్షకుల ఊహకు అందేలా ఉన్నాయి. క్రిష్ రాసుకున్న అంశాలు బావున్నాయి. ఆ పాత్రలు బలమైనవిగా తెరపై కనిపించలేదు. కనుమల్నే తమ కనుసైగల్లో పెట్టుకున్న నియంతలపై పోరాటం అంటే, అదీ ఓ సామాన్య మహిళ చేసే పోరాటం అంటే ఎంతో ఎమోషన్ పండాలి, గూస్ బంప్స్ వచ్చేలా సీన్స్ ఉండాలి. ఇందులో అదెక్కడా కనిపించలేదు. అనుష్క చేసిన యాక్షన్ సీన్స్ మెప్పించాయి. గంజాయికి వ్యతిరేకంగా, దానిని నిర్మూలించాలనే సందేశంతో చింతకింది శ్రీనివాసరావు ఈ కథను రాశారు. దానిని రస్టిక్ అండ్ రా స్టైల్లో చూపించాలనుకున్నారు క్రిష్. ఫైనల్‌గా రెగ్యులర్ రివేంజ్ డ్రామాకు సమాజంలో ఓ సమస్య, సందేశం జోడించి చూపించారు. హృద్యంగా చెప్పడంలో ఫెయిల్ అయ్యారు. అప్పటిదాకా ఒక మార్గంలో ఉన్న ముఖ్య పాత్రధారులు ఒక్కసారిగా మారడం అనేది ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసే విషయం కాదు. విలన్ పాత్రల ఎండింగ్ కూడా సోసోగా ఉంది.
నటీనటులు, సాంకేతిక నిపుణులు పనితరు..
అనుష్క నటన గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తనదైన స్టైల్‌లో ఆమె చేసుకుంటూ వెళ్లిపోయారు. శీలావతి పాత్రకు తగ్గట్టు ఆమె మారిపోయారు. యాక్షన్ సన్నివేశాలకు ఆమె పడిన కష్టం తెరపై కనిపించింది. సినిమాను తన భుజాలపై మోసిందనేది అర్థమవుతుంది. కానీ అరుంధతీ, బాహుబలి చిత్రాల్లో అనుష్క పాత్రలో ఓ రాజసం ఉంటుంది. తెరపై ఆమె కటౌట్ చూస్తేనే హై మోమెంట్ వస్తుంది. ఈ సినిమాలో ఆమెకు యాక్షన్ ఎపిసోడ్ ఉన్నా, అవి అద్భుతంగా ఉన్నప్పటికీ ఎక్కడో అనుష్క తాలుక రాజసం, ఈజ్ మిస్ అయిన భావన కలిగింది. నటన, భావోద్వేగాలు పంచడంలో ఎక్కడా తేడా లేదు. అప్పీయరెన్స్‌లో ఏదో మిసింగ్. అనుష్కకు బావగా, దేశిరాజు పాత్రలో తమిళ నటుడు విక్రమ్ ప్రభు మెచూర్డ్‌గా నటించాడు. ఆయన పాత్రకు పేరు పెట్టలేం. కుందల నాయుడుగా చైతన్య రావు పాత్ర ఓకే. అయితే ఓ మాదిరి పాత్రలు చేసే అతనికి విలన్‌గా బలమైన పాత్ర ఇవ్వడం అతని శక్తిని మించిన పాత్రలా అనిపించింది. నటనకు పెద్ద స్కోప్ లేకపోయినా రవీంద్ర విజయ్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంది. అతని మాటలు, ఎక్స్‌ప్రెషన్స్‌తో క్రూరమైన విలన్ అనిపించాడు. జగపతి బాబు, జాన్ విజయ్, రవీంద్ర విజయ్, రాజు సుందరం తదితరులు పరిధి మేర నటించారు. లారిస్సా, జిష్ణు సేన్ గుప్తా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్ బాగలేదు. సాయిమాధవ్ బుర్రా మాటలు అక్కడక్కడా పేలాయి. సంగీత దర్శకుడు సాగర్ నాగవెల్లి పాటలు, నేపథ్య సంగీతం బావున్నాయి. తూర్పు కనుమల అందాలను సినిమాటోగ్రఫర్ మనోజ్ రెడ్డి కాటసాని అద్భుతంగా చిత్రీకరించారు. వీఎఫ్‌ఎక్స్ మాత్రం వీక్‌గా అనిపించాయి. తోట తరణి ఆర్ట్ వర్క్ సినిమాకు ఎసెట్. నిర్మాతల ఖర్చు తెరపై కనిపించింది.
క్రిష్ అన్నా, ఆయన తీసిన సినిమాలన్నా ప్రేక్షకులు ఒక రకమైన రెస్పెక్ట్ ఉంటుంది. ఆయన సినిమాల్లో భావోద్వేగాలు, సామాజిక స్పృహ కనిపిస్తాయి. మనసుకు హత్తుకునే కథల్నే ఆయన టచ్ చేస్తారు. రొటీన్‌గా కాకుండా ఏదో కొత్త అంశాన్నిచూపిస్తారు. ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’, ‘కంచె’ ఇలా ఆయన తీసిన సినిమాలన్నీ డిఫరెంట్ జానర్ చిత్రాలే. మన మధ్య జరుగుతున్న కథనే కొత్తగా ఆవిష్కరిస్తారు. అలాంటి అన్ని అంశాలను మేళవించి తీసిన సినిమా ఘాటీ. ఇక్కడ ఆయన ఓ కొత్త విషయాన్ని చెప్పారు. కానీ ప్రేక్షకుల మనసును తాకేలా చెప్పలేకపోయారు. ఘాటీల జీవనాధారం వారి కష్టాలను మాత్రం కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆ సన్నివేశాలు మనసుకు హత్తుకుంటాయి. సందేశం, అనుష్క నటన కోసం సినిమా చూడొచ్చు.
రేటింగ్: అనుష్క యాక్షన్ షో
రేటింగ్: 2.5/5