Bollywood: కాంట్రవర్సీగా మారిన వరుణ్ ధావన్ వ్యాఖ్యలు
ABN, Publish Date - Sep 22 , 2025 | 01:58 PM
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ ను నెటిజన్స్ ఓ ఆట ఆడుకుంటున్నారు. హాలీవుడ్ నటి సిడ్నీ స్వినీ కు సంబంధించిన ఓ బోల్డ్ స్టిల్ కు వరుణ్ ధావన్ పెట్టిన వ్యాఖ్యపై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. అతని తాజా చిత్రం 'సన్నీ సంస్కారీకి తులసీ కుమారి' సినిమా విడుదలకు ముందు ఇలా జరగడం చర్చనీయాంశంగా మారింది.
బాలీవుడ్ స్టార్స్ కు, ఫిల్మ్ మేకర్స్ కు తమ చిత్రాలకు ఫ్రీ పబ్లిసిటీ ఎలా చేసుకోవాలో తెలుసు. ఈ విషయంలో వాళ్లంతా మేవరిక్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ను ఫాలో అవుతారనిపిస్తుంటుంది. ఎందుకంటే వర్మ కూడా తన కొత్త సినిమా ఏదైనా జనం ముందుకు వస్తున్న సమయంలోనే కాంట్రవర్సీలకు తెర లేపుతుంటాడు. దాంతో సహజంగానే మీడియాలో నానతాడు. పనిలో పనిగా అతని తాజా చిత్రం కూడా వార్తల్లో నిలుస్తుంది.
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ థావన్ (Varun Dhawan) కూడా అదే పాలసీని ఫాలో అవుతున్నట్టుగా ఉందని కొందరు అంటున్నారు. ఇటీవల తగదునమ్మా అంటూ అతను చేసిన ఓ సింగిల్ వర్డ్ కామెంట్... ఇప్పుడు వరుణ్ ధావన్ పైనా, అతని తాజా చిత్రంపైనా అందరూ ఫోకస్ పెట్టేలా చేసింది. ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ (David Dhawan) కొడుకైన వరుణ్ థావన్ తండ్రి బాటలో దర్శకుడు కాకుండా నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. టైమ్ బాగుండి... అతనికి అన్నీ కలిసి వచ్చాయి. హ్యాడ్సమ్ గా కనిపించే వరుణ్ ధావన్ ఇవాళ చాలామంది కుర్రకారుకు అభిమాన హీరో! అతని తాజా చిత్రం 'సన్నీ సంస్కారీ కి తులసి కుమారి' (Sunny Sanskari ki Tulsi Kumari) అక్టోబర్ 2న జనం ముందుకు రాబోతోంది. శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో ఈ మూవీని కరణ్ జోహార్ నిర్మించాడు. ఇందులో జాన్వీ కపూర్ తో పాటు సన్యా మల్హోత్రా , మనీష్ పాల్, రోహిత్ షరాఫ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గరైన టైమ్ లోనే నెటిజన్స్ దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు వరుణ్ ధావన్. ఇటీవల హాలీవుడ్ నటి సిడ్నీ స్వినీ బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతోందనే వార్త ఒకటి వచ్చింది. ఆమెకు భారీ మొత్తంలో పారితోషికం కూడా ఇవ్వబోతున్నారనే సమాచారం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అయితే ఆమె బోల్డ్ దుస్తులు ధరించి ఉన్న ఓ పోస్టర్ కు వరుణ్ ధావన్ 'పర్ ఫెక్ట్' అంటూ కామెంట్ పెట్టాడు.
వరుణ్ ధావన్ పెట్టిన ఆ కామెంట్ ను చాలామంది తప్పు పడుతున్నారు. వరుణ్ ధావన్ ఇలాంటి ఫోటోకు ఎలా 'పర్ ఫెక్ట్' అనే కామెంట్ పెడతాడని ప్రశ్నిస్తున్నారు. పెళ్లిచేసుకుని, తండ్రి కూడా అయిన వరుణ్ ధావన్ ఒక నటి గురించి ఇలాంటి వ్యాఖ్య చేయడం సబబుగా లేదని కొందరు విమర్శిస్తున్నారు. అయితే... అతని అభిమానులు మాత్రం వరుణ్ ధావన్... ఆమె భారతీయ సినిమాల్లోకి అడుగుపెట్టే విషయాన్ని ఉద్దేశించి ఆ వ్యాఖ్య పెట్టాడు తప్పితే... ఆమెను విమర్శించాలని కాదని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా... తన సినిమా మరో పది రోజుల్లో జనం ముందుకు వెళుతున్న సమయంలో అందరి దృష్టినీ ఆకట్టుకోవడానికి వరుణ్ ఇలా చేశాడని కొందరు అంటున్నారు. వరుణ్ యథాలాపంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసినా... ఒక్కోసారి అవే సినిమా ఫలితంపై ప్రభావం చూపే ఆస్కారం కూడా లేకపోలేదన్నది ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట.
Also Read: Chiranjeevi: 'ప్రాణం ఖరీదు' రోజునే వందో చిత్రం 'త్రినేత్రుడు'
Also Read: Kantara Chapter 1: కాంతార ఛాప్టర్1 .. ట్రైలర్ అదిరింది! హిట్ గ్యారంటీ