Chiranjeevi: 'ప్రాణం ఖరీదు' రోజునే వందో చిత్రం 'త్రినేత్రుడు'
ABN , Publish Date - Sep 22 , 2025 | 12:58 PM
చిరంజీవి నటించగా విడుదలైన తొలి చిత్రం 'ప్రాణం ఖరీదు' 47 సంవత్సరాల క్రితం ఇదే రోజున విడుదలైంది. విశేషం ఏమంటే... ఇదే తారీఖున ఆ తర్వాత పదేళ్ళకు ఆయన వందో సినిమా 'త్రినేత్రుడు' వచ్చింది. 'ప్రాణం ఖరీదు' విడుదల తేదీని పురస్కరించుకుని చిరంజీవి తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన తొలి చిత్రం 'పునాది రాళ్ళు' (Punaadirallu) అయినా... విడుదలైన సినిమా మాత్రం 'ప్రాణం ఖరీదు' (Pranam Kharidu). కె. వాసు (K Vasu) దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత క్రాంతికుమార్ (Kranthi Kumar) నిర్మించిన ఈ సినిమా కు మూలం సి. ఎస్. రావు రాసిన నాటకం. ఆయనే ఈ సినిమాకు సంభాషణలూ సమకూర్చారు. చిరంజీవి సరసన రేష్మా రాయ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా 1978 సెప్టెంబర్ 22న విడుదలైంది. అంటే ఇవాళ్టికి ఆ సినిమా రిలీజ్ అయ్యి 47 సంవత్సరాలు. ఈ సినిమాలోనే ఇటీవల కన్నుమూసిన కోట శ్రీనివాసరావు (Kota Srinivasarao) కూడా నటించారు. చంద్రమోహన్ (Chandramohan), జయసుధ (Jayasudha), నూతన్ ప్రసాద్ (Nutanprasad), రావు గోపాలరావు (Rao Gopalrao) ఇందులో కీలక పాత్రలు పోషించారు. చిత్రం ఏమంటే... చిరంజీవి నటించిన మొదటి సినిమా 'పునాదిరాళ్ళు' ఆ తర్వాత సంవత్సరం జూన్ 21న విడుదలైంది.
'ప్రాణంఖరీదు' సినిమా తర్వాత చిరంజీవికి వరుసగా అవకాశాలు వచ్చాయి. కేవలం హీరోగా నటించాలనే పట్టుదలకు పోకుండా... వచ్చిన ప్రతి అవకాశాన్ని చిరంజీవి సద్వినియోగం చేసుకున్నారు. అలా అప్పటికే అగ్ర కథానాయకులైన ఎన్టీఆర్ (NTR), కృష్ణ (Krishna), శోభన్ బాబు (Sobhanbabu) తదితరుల చిత్రాలలో కీలక పాత్రలు పోషించారు. కెరీర్ తొలి నాళ్ళలో ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలు చేయడానికి కూడా వెనుకాడని చిరంజీవి ఆ తర్వాత సోలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం పది సంవత్సరాలలో అలా వంద చిత్రాలను పూర్తి చేశారు చిరంజీవి. 'ప్రాణం ఖరీదు' సినిమా విడుదలై 47 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ రోజుల్ని తలుచుకుంటూ తనను ఇన్నేళ్ళుగా ఆదరిస్తున్న అభిమానులకు చిరంజీవి ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. వారి ప్రోత్సహంతోనే ఇప్పటి వరకూ 155 చిత్రాలను పూర్తి చేయగలిగానని అన్నారు.
విశేషం ఏమంటే... చిరంజీవి తొలి చిత్రం 'ప్రాణంఖరీదు' విడుదలైన పదేళ్ళకు... అదే రోజున అంటే సెప్టెంబర్ 22న చిరంజీవి వందో సినిమా 'త్రినేత్రుడు' జనం ముందుకు వచ్చింది. అంటే ఆ సినిమా విడుదలై నేటికి 37 సంవత్సరాలు పూర్తయ్యింది. దీన్ని ఎ. కోదండరామి రెడ్డి (A. Kodandarami Reddy) దర్శకత్వంలో నాగబాబు (Nagababu) నిర్మించారు. భానుప్రియ (Bhanupriaya) హీరోయిన్ గా నటించిన 'త్రినేత్రుడు'కు రాజ్-కోటి (Raj - Koti) స్వరాలు అందించారు. ఆంగ్ల చిత్రం 'బెవర్లీ హిల్స్ కాప్' ఈ సినిమాకు ప్రేరణ. చిరంజీవి తొలి చిత్రం 'ప్రాణం ఖరీదు'లో నటించిన చంద్రమోహన్, నూతన్ ప్రసాద్ ఇందులోనూ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలోని పాటలు శ్రోతలను ఆకట్టుకున్నా... 'త్రినేత్రుడు' కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. నటుడిగా తొలి దశాబ్దంలో శరవేగంగా సినిమాలు చేసిన చిరంజీవి ఆ తర్వాత స్టార్ డమ్ ను కాపాడుకోవడానికి ఆచితూచి అడుగులు వేశారు. మధ్యలో 'ప్రజారాజ్యం' పార్టీ పెట్టినందువల్ల కూడా కొన్నేళ్ళ పాటు చిరంజీవి నటనకు దూరంగా ఉన్నారు. అందుకే ఆ తర్వాత 55 చిత్రాలు పూర్తి చేయడానికి ఇంతకాలం పట్టింది.
Also Read: Anupama Parameswaran: అతడితో.. మాట్లాడడం మానేశా