Srivalli - Yesubai: రశ్మికపై ఆ రెండు పాత్రల ప్రభావం
ABN , Publish Date - Aug 07 , 2025 | 10:38 AM
తన కొత్త సినిమాల గురించి రశ్మిక ఆసక్తికర విషయాలు తెలిపింది. అలానే 'పుష్ప, ఛావా' సినిమాల ప్రభావం తన కెరీర్ మీద బాగానే పడిందని ఒప్పుకుంది.
నేషనల్ క్రష్ రష్మిక మందణ్ణ (Rashmika Mandanna) తన కెరీర్ పై 'పుష్ప' (Pushpa) లోని శ్రీవల్లి, 'ఛావా' (Chaava) లోని యశో బాయ్ పాత్రల ప్రభావం ఉందని చెప్పింది. ఈ రెండు లైఫ్ ఛేజింగ్ క్యారెక్టర్స్ అని చెబుతూ, వాటి ప్రభావం నటిగా తనపై ఎంతో ఉందని, వాటి పోషణ, వాటికి లభించిన ఆదరణ కారణంగా నటిగా తనపై తనకు నమ్మకం వచ్చిందని తెలిపింది.
'పుష్ప' సినిమాతో నేషనల్ క్రష్ గా మారిన రశ్మిక మందణ్ణ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఆమె నటించిన కొన్ని హిందీ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా... 'పుష్ప, పుష్ఫ -2' తో పాటు రణబీర్ కపూర్ (Ranbir Kapoor) సరసన చేసిన హిందీ సినిమా 'యానిమల్' (Animal) ఆమెను బాక్సాఫీస్ పీఠంపై అగ్రస్థానంలో నిలబెట్టింది. అయితే 'యానిమల్' సినిమాలోని పాత్రపై వచ్చిన విమర్శలను రశ్మిక లైట్ తీసుకోమంటోంది. అసలు సినిమాలనే పెద్దగా పట్టించుకోనక్కర్లేదని, ఎవరూ బలవంతంగా వాటిని చూడమని చెప్పరని, కాబట్టి అలాంటి వాటిని పెద్దగా పట్టించుకోనక్కర్లేదని తెలిపింది. దీంతో నెటిజన్స్ ఆమెను 'హిపోక్రటిక్' అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. సినిమా విడుదల సమయంలో విశేషంగా వాటిని చూడటం కోసం, వాటి పట్ల జనాలలో ఆసక్తి కలగడం కోసం ప్రమోషన్స్ లో పాల్గొనే వారు... అవి విడుదలై, విజయం సాధించిన తర్వాత పెద్దంతగా సినిమాలను పట్టించుకోనక్కర్లేదని చెప్పడం సరి కాదని అంటున్నారు.
నటిగా ఇవాళ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రశ్మిక కు ఇటీవల విడుదలై 'కుబేర' సినిమా నిరాశకు గురిచేసింది. వైవిధ్యమైన పాత్ర అని ఆమె దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా... ఆ పాత్రను తీర్చిదిద్దిన తీరు, అందులోని ఓ సోలో సాంగ్ ను సినిమా నుండి తొలగించిన విధానం... మొత్తంగా ఆ ప్రాజెక్ట్ మీద రశ్మిక అంత సంతృప్తిగా లేదని తెలుస్తోంది. దాంతో ఇప్పుడు తన ఆశలన్నీ త్వరలో విడుదల కానున్న 'ది గర్ల్ ఫ్రెండ్' (The Girlfriend) మూవీ మీద పెట్టుకుంది. అలానే హిందీ చిత్రం 'థామ' (Thama) కూడా నటిగా తనను మరో స్థాయికి తీసుకెళుతుందని రశ్మిక నమ్ముతోంది. ఈ రెండు పాత్రలు పూర్తిగా ఒకదానితో ఒకటి భిన్నమైనవి కావడం విశేషం. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో 'థామ' చిత్రాన్ని ఆదిత్య సర్పోత్ దార్ తెరకెక్కిస్తున్నారు. మాడాక్ ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మిస్తుండటంతో దానిపైనా భారీ అంచనాలే ఉన్నాయి. ఏ పాత్రను అంగీకరించినా... నూరు శాతం న్యాయం చేకూర్చడానికి ప్రయత్నించే రశ్మికకూ పరాజయాలు తప్పలేదు. అయితే 'పుష్ప 2, యానిమల్, ఛావా' వంటి సినిమాలు ఆమెను కమర్షియల్ హీరోయిన్ గా నిలబెట్టడం ఓ వరంగా భావించాలి.
Also Read: Tamannaah Bhatia: పెద్ద హీరో అరుపులు.. తమన్నా ఏడుపు.. క్షమాపణలు
Also Read: Mayasabha Review: దేవ కట్టా.. మయసభ వెబ్ సీరిస్ రివ్యూ