Mayasabha Review: దేవ కట్టా.. మయసభ వెబ్ సీరిస్ రివ్యూ

ABN , Publish Date - Aug 06 , 2025 | 07:54 PM

దర్శకుడు దేవ కట్టా 'మయసభ' పేరుతో వెబ్ సీరిస్ తీయబోతున్నట్టు ప్రకటించగానే అందరిలో ఆసక్తి మొదలైంది. తెలుగు రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పిన ఇద్దరు ప్రముఖుల పాత్రలను దేవ కట్టా తీసుకోవడంతో అది చర్చనీయాంశంగా మారింది. ఇంతకూ దేవ కట్టా 'మయసభ' ద్వారా ఏం చెప్పాలనుకున్నారో... ఏం చెప్పారో చూద్దాం.

Mayasabha Web series

ప్రముఖ దర్శకుడు దేవ కట్టా (Deva Katta) తెరకెక్కించిన సినిమాలు చాలా తక్కువ. తొలి చిత్రం 'వెన్నెల'ను పక్కన పెడితే ఆ తర్వాత వచ్చిన 'ప్రస్థానం' నుండి మొన్నటి 'రిపబ్లిక్' వరకూ ఆయన సినిమాల్లో పాలిటిక్స్ మెయిన్ ఎలిమెంట్ గా ఉంటూ వచ్చింది. అటువంటి దర్శకుడు 'మయసభ' పేరుతో వెబ్ సీరిస్ తీయబోతున్నట్టు ప్రకటించగానే అందరిలో ఆసక్తి మొదలైంది. తెలుగు రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పిన ఇద్దరు ప్రముఖుల పాత్రలను దేవ కట్టా తీసుకోవడంతో అది చర్చనీయాంశంగా మారింది. ఇంతకూ దేవ కట్టా 'మయసభ' ద్వారా ఏం చెప్పాలనుకున్నారో... ఏం చెప్పారో చూద్దాం. ఈ వెబ్ సీరిస్ ప్రస్తుతం సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దీన్ని దేవ కట్టా, కిరణ్ జయకుమార్ డైరెక్ట్ చేయగా, కృష్ణ లింగమనేని, శ్రీహర్ష నిర్మించారు.


కథ ఏమిటంటే...

'మయసభ' వెబ్ సీరిస్ కథ ఏమిటంటే... ఎం.ఎస్.ఆర్ (చైతన్యరావ్ Chaitanya Rao), కె.కె.ఎన్. (ఆది పినిశెట్టి Aadhi Pinisetty) రాయలసీమలోని వివిధ పట్టణాలకు చెందిన వాళ్ళు. అనుకోకుండా కాలేజీ రోజుల్లో కలుసుకుని స్నేహితులుగా మారిపోతారు. ఎం.ఎస్.ఆర్. ఫ్యాక్షన్ కుటుంబం నుండి వచ్చి డాక్టర్ అయితే, కె.కె.ఎన్. రైతు కుటుంబం నుండి వచ్చి విద్యాధికుడవుతాడు. వీరిద్దరికీ రాజకీయాల్లోకి వెళ్ళి ప్రజలకు సేవ చేయాలని, రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చాలనే కోరిక ఉంటుంది. కేంద్రంలో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ ఎత్తివేసి ఎన్నికలు పెట్టిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన వీరిద్దరూ ఊహించని విధంగా తొలిసారి శాసన సభ ఎన్నికల్లోనే వేర్వేరు పార్టీల తరఫున పోటీ చేసి గెలుస్తారు. ఆ తర్వాత కె.కె.ఎన్. తన మామ, ప్రముఖ నటుడు ఆర్.సి.ఆర్. (సాయికుమార్) పెట్టిన కొత్త పార్టీలో చేరతాడు. అప్పటి వరకూ స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ అప్పటి నుండి ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారిగా మారిపోతారు. జాతీయ పార్టీలో ఉన్న ఎం.ఎస్.ఆర్., ప్రాంతీయ పార్టీలో చేరిన కె.కె.ఎన్. జీవితాలు అక్కడ నుండి ఎలాంటి మలుపులు తిరిగాయన్నది సెకండ్ సీజన్ కథ. నిజానికి ఈ వెబ్ సీరిస్ ట్రైలర్ లో చూపించిన 'మామా అల్లుళ్ళ సవాల్' కథంతా సెకండ్ సీజన్ లో ఉండబోతోందన్నమాట. దానికి 'మయసభ: క్లాష్ ఆఫ్ టైటాన్స్' అనే పేరు పెట్టారు.


ఎలా ఉందంటే...

ముసుగులో గుద్దులాట లేకుండా చెప్పుకోవాలంటే... దేవ కట్టా ఈ వెబ్ సీరిస్ ను వై. యస్. రాజశేఖర్ రెడ్డి (Y. Rajasekhar Reddy), చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పాత్రలను బేస్ చేసుకుని తీశాడు. ఆ సమయంలో రాష్ట్రంలో ఉన్న కుల పోరాటాలు, ఫ్యాక్షన్ తగాదాలు, నక్సలైట్ల హింసాకాండ వాటికీ ప్రాధాన్యమిచ్చాడు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ, ఆమె తనయుడు సంజయ్ గాంధీ ఎమర్జెన్సీ సమయంలో, తదనంతరం రాష్ట్ర నాయకులను ఎలా కీలుబొమ్మలుగా ఆడించారో చూపించారు. అయితే జాగ్రత్తగా గమనిస్తే... చంద్రబాబు నాయుడు ప్రతి విజయం వెనుక ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నట్టుగా చూపించే ప్రయత్నాన్ని దర్శకుడు దేవ కట్టా చేశారు.

ఇందులో వాస్తవం 10 శాతం ఉంటే... కల్పితం 90 శాతం ఉందని అనుకోవాలి. సంఘటనలు అవే అయినా... వాటిని చూపించిన విధానం, వాటిని హైలైట్ చేసిన పద్థతి, వీక్షకులను ప్రభావితం చేయడానికి పడే తాపత్రయం అంతా వన్ సైడ్ గా ఉన్నట్టు స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ రాష్ట్ర రాజకీయాల గురించి ఎలాంటి అవగాహన లేని వారు ఈ వెబ్ సీరిస్ చూసి ఇంప్రస్ కావొచ్చేమో కానీ... వీటన్నింటినీ ప్రత్యక్షంగా చూసిన వారు, వీటి లోతుపాతుల గురించి అవగాహన ఉన్నవారికి ఇది ఏమాత్రం రుచించదు. ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ వారు ఈ సీరిస్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడానికే ఎక్కువ ఆస్కారం ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీవారు సైతం ఇందిరమ్మ ఆటలను చూపించిన వైనాన్ని ప్రశ్నించకపోరు.

వీటిని పక్కన పెట్టి చూస్తే... మొదటి ఎపిసోడ్ నుండి తొమ్మిదో ఎపిసోడ్ వరకూ ఆసక్తికరంగానే సాగింది. ఎక్కడా బోర్ అనేది కొట్టదు. రాజకీయాల గురించి అవగాహన లేని వారు నిజంగానే వీరిద్దరి జీవితం ఇలానే సాగిందేమోనని భ్రమపడే అవకాశం లేకపోలేదు. అదే సమయంలో ఇలా జరిగి ఉంటే ఎంత బాగుండేదో కదా అనే భావనా కలిగే ఆస్కారం ఉంది. ఆ విషయంలో దేవ కట్టా సఫలీకృతుడయ్యాడు.


నటీనటుల విషయానికి వస్తే... వైయస్ఆర్ ను తలపించే పాత్రలో చైతన్యరావ్, చంద్రబాబును తరహా పాత్రను ఆది పినిశెట్టి చేశారు. ఎన్టీఆర్ ను తలపించే పాత్రను సాయికుమార్ చేశారు. అయితే ఆయన ఎంట్రీ ఆలస్యంగా జరిగింది. ఇందులో వంగవీటి రాధా, రంగ తో పాటు పరిటాల రవి పాత్రలను పోలినవీ ఉన్నాయి. ఇక అప్పటి ఓ స్టార్ హీరోయిన్ పాత్రనూ దర్శకుడు తన బుద్ధికి పని చెప్పి... ఈ వెబ్ సీరిస్ లో కీలక పాత్రధారిని చేసేశాడు. ఆ పాత్రను తాన్య రవిచంద్రన్ పోషించింది. ఇతర ప్రధాన పాత్రలను శత్రు, రవీంద్ర విజయ్, శ్రీకాంత్ భరత్, దివ్యాదత్తా, రఘుబాబు, భావన వళపండల్, చరిత వర్మ, మేకా రామకృష్ణ, సురభి ప్రభావతి, రూపలక్ష్మీ తదితరులు పోషించారు.

'మయసభ' వెబ్ సీరిస్ ప్రమోషన్స్ లో దర్శకుడు దేవ కట్టా ఓ మాట చెప్పారు. 'ఇది వాస్తవ కథ కాదు. పూర్తిగా కల్పితం. తెలుగు రాష్ట్రాన్ని శాసించిన ఇద్దరు ప్రముఖ నాయకులు స్నేహితులుగా జీవితాన్ని మొదలు పెట్టి శత్రువులుగా మారితే ఎలా ఉంటుందనే ఆలోచనకు ఇది రూపం' అని అన్నారు. కాబట్టి ఈ 'మయసభ'లోని సంఘటనలు అన్నీ కల్పితం అనే దానికి మానసికంగా సిద్థపడి దీనిని చూడాల్సి ఉంటుంది. అయితే... దేశ, రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పిన కొన్ని సంఘటనలు ఈ వెబ్ సీరిస్ లో కనిపించినప్పుడు 'ఇది జరిగింది ఇలా కాదు కదా... క్రియేటివ్ ఫ్రీడమ్ పేరుతో తిమ్మిని బమ్మిని చేశారే అనే భావన కలుగుతుంది. కొన్ని సంఘటనలను, సన్నివేశాలను చూసినప్పుడు ఇంత డ్రమటైజేషన్ అవసరమా!? అని కూడా అనిపిస్తుంది. ఈ వెబ్ సీరిస్ కు స్క్రీన్ ప్లే మెయిన్ హైలైట్. ఆ విషయంలో దేవ కట్టా, కిరణ్ జయకుమార్ సక్సెస్ అయ్యారు. అయితే ఇది ఎంత కల్పిత కథ అని చెప్పినా... కళ్ళముందు జరిగిన సంఘటనలు కావడంతో ఆ రకంగా ఊహించుకోవడం మెజారిటీ వర్గాలకు కష్టంగా అనిపించక మానదు. అలా చూస్తే దీనిని మెచ్చుకునే వారికంటే విమర్శించే వారి సంఖ్యే ఎక్కువగా ఉండే ఆస్కారం ఉంది. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్…

రేటింగ్: 3/5

ట్యాగ్ లైన్: 'మాయ'సభ!

Updated Date - Aug 06 , 2025 | 08:41 PM