ఈ వారాంతంలో ఐదు సినిమాలు!

ABN , Publish Date - Oct 22 , 2026 | 08:19 AM

ఈ వీకెండ్‌లో రెండు అనువాద చిత్రాలతో కలిపి మొత్తం ఐదు చిత్రాలు జనం ముందుకు రాబోతున్నాయి. ప్రశాంత్‌ నీల్‌ ప్రెజెంటేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన '418' కన్నడ సినిమా, 'కోర్ట్' ఫేమ్‌ శ్రీదేవి నటించిన తమిళ చిత్రం 'హైకూ' తెలుగులో రాబోతున్నాయి.

Weekend movies

గత వారం విడుదలైన సినిమాలన్నీ దాదాపుగా పాజిటివ్‌ మౌత్‌ టాక్‌ ను తెచ్చుకున్నాయి. ఇందులో రజనీకాంత్‌ 'జైలర్ 2' ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. 'రణబాలి' సినిమాను రాయలసీమ వాసులు అక్కున చేర్చుకుంటే, 'గరివిడి లక్ష్మి' బయోపిక్ కు ఉత్తరాంధ్ర వాళ్ళు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మూడు సినిమాల మధ్యలో కాస్తంత నిరాశ పర్చిన సినిమా 'క్రేజీ కళ్యాణం'. పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోయిన ఈ మూడు సినిమాల మధ్యలో 'క్రేజీ కళ్యాణం' వెనకబడింది. ఇదేవారంలో వచ్చిన ఆంగ్ల అనువాద చిత్రం 'స్ట్రీట్‌ ఫైటర్‌'ను తెలుగు వాళ్ళు పెద్దంత పట్టించుకోలేదు.

ఇక ఈ వారానికి వస్తే... పెద్ద సినిమాలేవీ ఈ వీకెండ్‌లో థియేటర్లలో సందడి చేయడం లేదు. ప్రభాస్ పుట్టిన రోజును పురస్కరించుకుని 23న 'ఛత్రపతి, వర్షం' చిత్రాలు రీ-రిలీజ్‌ అవుతున్నాయి. శుక్రవారం రోజు రెండు స్ట్రయిట్‌ తెలుగు సినిమాలు, రెండు అనువాద చిత్రాలు జనం ముందుకు వస్తున్నాయి. గతంలో 'అటు అమెరికా ఇటు ఇండియా', 'ఆత్రేయ', 'ఇండియన్ బ్యూటీ' చిత్రాలను రూపొందించిన చిలుముల శాంతికుమార్ ఈ సారి 'లవ్‌ మ్యారేజ్‌ వర్సెస్‌ అరేంజ్డ్‌ కాన్సెప్ట్ తో '321' చిత్రాన్ని తెరకెక్కించారు. వంగపాటి రామానుజ రెడ్డి, చిలముల శాంతికుమార్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా 23వ తేదీ విడుదల కాబోతోంది. నాని 'ది ప్యారడైజ్‌' మూవీలో జూనియర్ సమ్మక్కగా నటించిన లావణ్య ఇందులో హీరోయిన్ కాగా, పలు వెబ్ సీరిస్‌లో నటించిన మోహిత్‌ పెద్దాడ హీరోగా నటిస్తున్నాడు. వివన్ సూర్య, ప్రభావతి, మాధవి, లక్ష్మీ వెన్నెల, యామిని, కుంతి శ్రీనివాస్‌, అప్పాజీ అంబరీశ్‌, విద్యాసాగర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. లవ్ మ్యారేజ్‌ బెటరా? అరేంజ్డ్ మ్యారెజ్‌ బెటరా అనే కాన్సెప్ట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు జాయ్ కాల్విన్‌ సంగీతం అందించగా, మౌనశ్రీ మల్లిక్ పాటలు రాశారు. శుక్రవారం వస్తున్న మరో స్ట్రయిట్‌ తెలుగు సినిమా 'ప్రేమ డైరీలో చివరి పేజీలు'. పి.వి. అర్జున్‌ యాదవ్‌ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాను హరికృష్ణ పామంజి దర్శకత్వంలో నరసింహ యాదవ్ నిర్మించారు. లవ్‌, ఎమోషన్స్ కు పెద్ద పీట వేసిన ఈ సినిమాలో అదితి హీరోయిన్‌ కాగా, ఆర్మాన్‌ మెరుగు సంగీతం అందించారు.


ఈ శుక్రవారం వస్తున్న రెండు అనువాద చిత్రాలలో ఒకటి కన్నడ సినిమా, మరొకటి తమిళం. 'కోర్ట్‌' ఫేమ్‌ శ్రీదేవి నటించిన తొలి తమిళ చిత్రం 'హైకూ'. ఇందులో ఏగన్‌ హీరో కాగా ఫెమినా జార్జ్ కీలక పాత్ర పోషించారు. ఈ రొమాంటిక్‌ ఎంటర్‌ టైనర్‌ ను యువరాజ్‌ చిన్నసామి దర్శకత్వంలో డా. డి అరుళానందు, మాథ్యూ అరుళానందు నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో ఇది 23న జనం ముందుకొస్తోంది. సిద్ధుకుమార్‌ ఈ సినిమాకు సంగీతం అందించారు. కథ ముందే చెప్పి, నెట్ ఫ్లిక్స్ ఆమోదంతో ఈ సినిమాను రూపొందించడం విశేషం. ఇదో సిన్సియర్‌ లవ్ స్టోరీ అని, ఆడియెన్స్ ను మళ్ళీ కాలేజీ రోజుల్లోకి తీసుకెళుతుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ నెల 23న వస్తున్న మరో అనువాద చిత్రం '418'. గత కొంతకాలంగా పలు మార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు శుక్రవారం విడుదల అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కన్నడలో తీసిన డార్కర్ జానర్ మూవీ '418'. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. కీర్తన్ నాదగౌడ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో చైత్ర ఆచార్, సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల, శశాంక్ పాటిల్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు వెంకీ జీజీ సంగీతం అందించారు.

ఈ వీకెండ్ లో రాబోతున్న మరో స్ట్రయిట్‌ తెలుగు సినిమా 'జయహో రామానుజ'. ఇది కూడా అనేకసార్లు వాయిదా పడి ఇప్పుడు విడుదలకు నోచుకుంది. లయన్ డా. సాయి వెంకట్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తూ, దర్శకత్వం వహించిన 'జయహో రామానుజ' చిత్రాన్ని సాయి ప్రసన్న, ప్రవల్లిక నిర్మించారు. ఆధ్యాత్మిక విప్లవకారుడు రామానుజాచార్యుల జీవిత కథను ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి తెరకెక్కించామని సాయి వెంకట్ చెబుతున్నారు. ఇందులో ఆయనతో పాటు జోశర్మ, సుమన్, పవల్లిక, అశ్వాపురం వేణుమాధవ్‌, అప్పం పద్మ తదితరులు కీలకపాత్రలు పోషించారు. మరి ఈ ఐదు సినిమాలలో ఏ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి:

రగ్గడ్ లుక్‌లో రామ్ చరణ్.. ‘RC17’ స్క్రిప్ట్ రీడింగ్‌లో.. పిక్ వైరల్

నవ్వుల రాబరీ మొదలైంది.. హిలేరియస్‌గా ‘దొంగ నా కొడుకు’ టీజర్

తల లేని మొండెంతో.. ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్ అదిరింది

Updated Date - Oct 22 , 2026 | 08:22 AM

హద్దుల్లో ఉండండి: బాడీ షేమింగ్ ట్రోలర్స్‌పై పాయల్ రాజ్‌పుత్ ఫైర్

పెద్ద సినిమాలు ఉన్నప్పుడు చిన్న సినిమాలు వస్తే.. జరిగేది ఇదే

తల లేని మొండెంతో.. ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్ అదిరింది

వెంకీ సెంటిమెంట్‌కు పోటీగా 7 సినిమాలు.. అక్టోబర్ 30న 'ఆదర్శ కుటుంబం' సందడి!

Ram Gopal Varma: 'పోలీస్ కంపెనీ' రిలీజ్‌ డేట్‌ ఖరారు!