పెద్ద సినిమాలు ఉన్నప్పుడు చిన్న సినిమాలు వస్తే.. జరిగేది ఇదే
ABN , Publish Date - Oct 21 , 2026 | 06:27 PM
బాక్సాఫీస్ బరిలో భారీ బడ్జెట్ చిత్రాలు, అగ్ర హీరోల సినిమాలు ఉన్నప్పుడు చిన్న, మీడియం రేంజ్ సినిమాలు థియేటర్లలోకి రావడం ఎంత పెద్ద రిస్కో తాజా బాక్సాఫీస్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
బాక్సాఫీస్ బరిలో భారీ బడ్జెట్ చిత్రాలు, అగ్ర హీరోల సినిమాలు ఉన్నప్పుడు చిన్న, మీడియం రేంజ్ సినిమాలు థియేటర్లలోకి రావడం ఎంత పెద్ద రిస్కో తాజా బాక్సాఫీస్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. థియేటర్లు దొరికాయి కదా అని పోటీకి దిగడం కంటే విడుదల తేదీని కాస్త వాయిదా వేసుకోవడమే శ్రేయస్కరమనే చర్చ టాలీవుడ్‌లో బలంగా వినిపిస్తోంది. ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) మాస్ సునామీ ‘జైలర్ 2’ (Jailer 2), విజయ్ దేవరకొండ ‘రణబాలి’ (Vijay Deverakonda Ranabaali)ల మధ్యలో విడుదలైన ‘క్రేజీ కళ్యాణం’ (Crazy Kalyanam) చిత్రం ఆశించిన రీతిలో ప్రభావం చూపలేకపోయింది. సినిమాలో మంచి వినోదం ఉన్నప్పటికీ.. ఆ రెండు భారీ చిత్రాల ఊపు ముందు ప్రేక్షకులకు ఈ చిత్రం పెద్దగా కనిపించకుండా పోయింది.
మరోవైపు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వంటి అగ్ర నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన ‘గరివిడి లక్ష్మి’ (Garividi Lakshmi) సినిమాకు కూడా దాదాపు ఇదే పరిస్థితి ఎదురైంది. మంచి కంటెంట్ ఉండటంతో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులందరూ ఈ సినిమాకు మద్దతుగా ట్వీట్స్ వేశారు. అయితే, ఈ చిత్రానికి ఉత్తరాంధ్ర ప్రాంతంలో మంచి ఆదరణ దక్కినప్పటికీ.. అన్ని ప్రాంతాల్లో ఇంకా గొప్ప విజయాన్ని అందుకోగలిగే పూర్తి అర్హత ఉన్న సినిమా అయినప్పటికీ భారీ పోటీ వల్ల ఆశించిన స్థాయికి రీచ్ కాలేకపోయింది. పండుగ సీజన్, సెలవుల కలిసివస్తాయనే ఉద్దేశంతో బరిలోకి దిగినప్పటికీ.. ఆ హాలిడేస్ అడ్వాంటేజ్ మొత్తం రజనీకాంత్ చిత్రానికే అత్యధికంగా కలిసిరాగా, ‘రణబాలి’ కూడా డీసెంట్ వసూళ్లను రాబట్టుకోగలిగింది.
రాబోయే రోజుల్లో సంక్రాంతి సీజన్ వరకు పెద్ద సినిమాల హవా బాక్సాఫీస్ వద్ద ఇలాగే కొనసాగేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిన్న, మీడియం బడ్జెట్ చిత్రాల మేకర్స్ కాస్త వెనుకా ముందు ఆలోచించి, సరైన రిలీజ్ డేట్లను ఎంచుకుంటేనే మంచిదని సినీ ట్రేడ్ విశ్లేషకులు సూచిస్తున్నారు. కంటెంట్ ఎంత బలంగా ఉన్నా సరే.. ఒక భారీ సినిమా థియేటర్లలో పాతుకుపోతే చిన్న చిత్రాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో ఇలాంటి తీవ్ర ఇబ్బందులు తప్పవనేది వాస్తవం.
ఇవి కూడా చదవండి:
హద్దుల్లో ఉండండి: బాడీ షేమింగ్ ట్రోలర్స్‌పై పాయల్ రాజ్‌పుత్ ఫైర్
‘రౌడీ అల్లుడు’కు 35 ఏళ్ళు.. గీతా ఆర్ట్స్‌లో సంబరాలు
టాలీవుడ్ మేకర్స్‌పై రాహుల్ రామకృష్ణ సెటైరికల్ పోస్ట్