వెంకీ విక్టరీకి అనిల్ రావిపూడినే దిక్కా..?
ABN , Publish Date - Nov 07 , 2026 | 12:13 PM
కొన్ని కాంబినేషన్స్ భలేగా సందడి చేస్తుంటాయి.. వరుస విజయాలూ సాధిస్తుంటాయి. అలాంటి కాంబోగా విక్టరీ వెంకటేశ్ - హిట్ మిషన్ అనిల్ రావిపూడిని చెప్పుకోవచ్చు. అందువల్లే వెంకటేశ్ ఫ్యాన్స్ ఆశలన్నీ రాబోయే ‘జనవరి 12 విడుదల’పైనే ఉన్నాయి.
పుష్కరకాలంలో విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh) నటించిన 15 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్‌లో రూపొందిన ‘ఎఫ్-2, ఎఫ్-3, సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు మాత్రమే ఘనవిజయం సాధించాయి. అలాగే వెంకీ కేమియో రోల్ పోషించిన చిరంజీవి (Chiranjeevi) సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు’ సైతం గ్రాండ్ సక్సెస్ సొంతం చేసుకుంది. మిగిలిన చిత్రాలన్నీ ఈ రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయాయి. వాటిలో పరాజయాల శాతమే ఎక్కువ. వెంకీకి ఈ పన్నెండేళ్ళలో గ్రాండ్ సక్సెస్ చూపించిన చిత్రాలన్నీ అనిల్ రావిపూడి డైరెక్షన్ లోనే తెరకెక్కినవి కావడం గమనార్హం. వెంకటేశ్ తాజా చిత్రం ‘ఆదర్శకుటుంబం - హౌస్ నంబర్ 47’ (Aadarsha Kutumbam House No: 47) కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో అభిమానులందరి ఆశలూ రాబోయే వెంకటేశ్- అనిల్ రావిపూడి చిత్రం ‘జనవరి 12 విడుదల’పైనే ఉన్నాయి.
ప్రస్తుతం అనిల్ రావిపూడిని ‘హిట్ మిషన్’గా కీర్తిస్తున్నారు టాలీవుడ్ జనం. ఇప్పటి వరకు అనిల్ తెరకెక్కించిన 9 చిత్రాలలో వెంకటేశ్ మూడు చిత్రాల్లో హీరోగానూ, ఓ సినిమాలో అతిథి పాత్రలోనూ నటించారు. అలా అనిల్‌కు వెంకటేశ్, వెంకీకి అనిల్ కలిసొచ్చారు. ఇప్పుడు కూడా అదే తీరున ‘జనవరి 12 విడుదల’ (January 12 Vidudala) చిత్రం వీరి కాంబోలోనే వస్తోంది. అందువల్ల ఆ సినిమాపైనే వెంకీ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. వెంకటేశ్‌కు రచయితగా త్రివిక్రమ్ ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ వంటి హిట్స్‌ను అందించారు. డైరెక్టర్‌గానూ వెంకీతో త్రివిక్రమ్ అదే మ్యాజిక్ చేస్తారని ఆశించారు ఫ్యాన్స్. వారి కాంబోలో వచ్చిన ‘ఆదర్శ కుటుంబం’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తరువాత నుంచీ వెంకటేశ్‌కు అనిల్ రావిపూడి సినిమాలు తప్పితే ఇతర దర్శకుల చిత్రాలు అచ్చిరావా? అంటూ చర్చ సాగుతోంది.
అనిల్‌కు వెంకటేశ్ కలసివచ్చిన మాట వాస్తవమే.. అయితే ఇతర స్టార్స్‌తోనూ అనిల్ బంపర్ హిట్స్‌ను చూశారు. అందువల్ల కేవలం వెంకటేశ్ వల్లే అనిల్ సక్సెస్ రూటులో సాగుతున్నారనుకుంటే పొరబాటే. ప్రస్తుతం వెంకటేశ్‌కు హిట్ దక్కాలంటే అనిల్ రావిపూడి సినిమా రావలసిందే అంటున్నారు సినీ ఫ్యాన్స్. ‘జనవరి 12 విడుదల’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.. ఇందులో అనిల్‌ను దర్శకునిగా పరిచయం చేసిన నటనిర్మాత కళ్యాణ్ రామ్ కూడా నటిస్తూ ఉండడంతో సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయింది. ఇందులో వెంకీ జోడీగా కీర్తి సురేశ్, కళ్యాణ్ రామ్ జంటగా కృతి శెట్టి నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కజికిస్థాన్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. రాబోయే సంక్రాంతి చిత్రాల్లో ‘జనవరి 12 విడుదల’ పైనే సినిమా అభిమానుల చూపు సాగుతోంది. ఎందుకంటే పొంగల్ బరిలోనే అనిల్ సినిమాలు దుమ్మురేపాయి. ‘జనవరి 12 విడుదల’తో వెంకటేశ్‌కు అనిల్ ఏ రేంజ్ హిట్‌ను అందిస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి:
ఎట్టకేలకు ‘హనుమాన్ అంశ్’ ఓటీటీకి.. ఎప్పుడంటే
నన్ను ఎంత తక్కువగా అంచనా వేస్తే.. అంతగా గెలిచి చూపిస్తా: ధనుష్
మూస పాత్రలు నా వల్ల కాదు.. నా లక్ష్యమిదే: రెజీనా