Aadarsa Kutumbam: 'నారాయణమ్మ..' పాటకు స్ఫూర్తి అదేనా!?

ABN , Publish Date - Sep 30 , 2026 | 01:36 PM

వెంకటేశ్‌ - త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ 'నారాయణమ్మ'... చాలామందిని ఐదు దశాబ్దాల వెనక్కి తీసుకెళ్ళింది. 1970లలో దిమిలి పొడుగు మనిషి పాపులర్‌ ప్రైవేట్ సాంగ్‌ 'రంగమెల్లి పోయానే నారాయణమ్మ' పాటను ఇది గుర్తు చేసింది.

Aadarsa Kutumbam Movie

'ఆదర్శ కుటుంబం'లోని ఫస్ట్ సింగిల్‌ 'నారాయణమ్మ...' పాట విడుదల కాగానే చాలామంది దానికి గతంలో రేలంగి నటించిన ఓ సినిమాలోని పాటను బేస్ చేసుకున్నారని భావించారు. నిజానికి 1970 - 74 మధ్యలో ఉత్తరాంధ్ర కు చెందిన దిమిలి పొడుగు మనిషి పాడిన ప్రైవేట్‌ సాంగ్‌లోని పదాలివి. 'రంగమెల్లి పోయానే నారాయణమ్మ' అంటూ సాగే ఈ పాటను ఆయన ఎల్.పి. రికార్డ్ గా తీసుకొచ్చారు. దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు దిమిలి పొడుగు మనిషి పాడిన పాటలు ఉత్తరాంధ్ర అంతా వినిపించేవి. మరీ ముఖ్యంగా దసరా, వినాయక చవితి పందిళ్ళలో ఈ ప్రైవేట్ రికార్డులను ప్లే చేసేవారు. కాస్తంత డబుల్ మీనింగ్‌ డైలాగ్స్ తో సాగే ఈ పాటను చిన్నా, పెద్ద అంతా ఇష్టంగా వినేవారు.


దిమిలి గ్రామానికి చెందిన ఆ పొడుగు మనిషి అసలు పేరు సురమళ్ళ సంజీవరావు. ఆయన ఉత్తరాంధ్రతో పాటు ఒడిషా, పశ్చిమ బెంగాల్‌లోనూ పలు హాస్యప్రదర్శనలు ఇచ్చి, ప్రేక్షకులను ఉర్రూతలూగించే వారు. దిమిలి పొడుగు మనిషి పాటలకు ఎస్. రాజేశ్వరరావు స్వర రచన చేసిన ఎల్.పి. రికార్డ్ కూడా బాగా ప్రాచుర్యాన్ని పొందింది. 'మందులోడా ఓరి మాయలోడా', 'డీజిలింజన్ రైలు బండి పోతున్నాడి, సంతాకు వెళ్ళాను... సర్కాసు చూశాను' వంటి ప్రైవేట్‌ పాటలు బాగా పాపులారిటీని పొందాయి. లీలారాణితో కలిసి ఆయన పాటలు పాడటంతో పాటు హాస్య ప్రదర్శనలూ ఇచ్చారు.

విశేషం ఏమంటే... కుర్రకారును ఉత్సాహపరిచే జానపద తరహా గీతాలే కాకుండా అప్పట్లో దేశ ప్రధాని ఇందిరా గాంధీ ప్రవేశ పెట్టిన 20 సూత్రాల ఆర్థిక పథకంను కూడా తనదైన శైలిలో ప్రచారంలోకి దిమిలి పొడుగు మనిషి లీలారాణితో కలిసి తీసుకొచ్చారు. అది కూడా ఎల్.పి. రికార్డ్ గా వచ్చింది. ఆయన పాడిన 'రంగమెల్లి పోయానే నారాయణమ్మ' పాటను స్ఫూర్తిగా తీసుకునే తాజాగా 'ఆదర్శ కుటుంబం' సినిమా కోసం తమన్ బాణీ కట్టగా, దానికి తగ్గట్టుగా రామజోగయ్య శాస్త్రి రచన చేశారు. మొత్తానికి ఈ పాట పుణ్యమా అని అప్పటి దిమిలి పొడుగు మనిషి గురించి ఈ తరం కూడా తెలుసుకునే ఆస్కారం ఏర్పడింది.

ఇవి కూడా చదవండి:

జానీ మాస్టర్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ షాక్: AIFEC సమావేశంలో కీలక తీర్మానం

Raashii Khanna: షారుఖ్ ఖాన్‌లా.. ఒక వారమైనా బతకాలనుంది

బాలయ్య అభిమానులకు గూస్‌బంప్స్ న్యూస్.. ఇక ఆప‌డం క‌ష్ట‌మే!

Updated Date - Sep 30 , 2026 | 04:35 PM