ఎట్టకేలకు ‘హనుమాన్ అంశ్’ ఓటీటీకి.. ఎప్పుడంటే
ABN , Publish Date - Nov 07 , 2026 | 11:03 AM
కేవలం రెండు కోట్ల రూపాయల స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.450 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి భారతీయ సినీ పరిశ్రమను విస్మయానికి గురిచేసిన సంచలన చిత్రం ‘హనుమాన్ అంశ్’. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.
కేవలం రెండు కోట్ల రూపాయల స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.450 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి భారతీయ సినీ పరిశ్రమను విస్మయానికి గురిచేసిన సంచలన చిత్రం ‘హనుమాన్ అంశ్’ (Hanuman Ansh). ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా (Neem Karoli Baba) జీవితం ఆధారంగా దర్శకుడు విశాల్ చతుర్వేది (Vishal Chaturvedi) రూపొందించిన ఈ డివైన్ బ్లాక్‌బస్టర్ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించి సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 9న ప్రఖ్యాత హోంబలే ఫిల్మ్స్ సంస్థ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై అలరించేందుకు అధికారికంగా సిద్ధమైంది.
ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్ (SonyLIV) ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. నవంబర్ 27 నుంచి ఈ చిత్రాన్ని తమ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సదరు సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘డివైన్ డిటోర్: దట్ ఛేంజ్డ్ మై లైఫ్’ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం, థియేటర్లలో రికార్డు కలెక్షన్లు రాబట్టిన నేపథ్యంలో ఓటీటీ ఆడియన్స్ నుంచి కూడా భారీ స్థాయిలో ఆదరణ దక్కించుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ చిత్ర కథాంశం విషయానికి వస్తే.. 1900 సంవత్సరంలో లక్ష్మణ్ నారాయణ శర్మగా జన్మించి, తర్వాతి కాలంలో ఆధ్యాత్మిక మార్గంలో నడిచి విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు మార్గదర్శిగా మారిన ‘నీమ్ కరోలీ బాబా’ దివ్య జీవిత ప్రయాణాన్ని ఇందులో ఆవిష్కరించారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన లక్ష్మీనారాయణ, ఆమెను చేరుకోవాలనే తపనతో సీతారాముల భక్తిలో మునిగిపోతాడు. హనుమంతుడిని ఆరాధిస్తే తన లక్ష్యం నెరవేరుతుందని నమ్మి, 11 ఏళ్ల పిన్న వయసులోనే ఇల్లు వదిలి దేశ సంచారానికి బయలుదేరతాడు. సాధుసంతుల సాంగత్యంలో ఆధ్యాత్మిక శిక్షణ పొందుతూ ముందుకు సాగుతాడు.
అయితే బాల్య వివాహం కారణంగా భవబంధాలు పిలిచినా, భార్యకు తన మనసులోని త్యాగనిరతిని వివరించి, ఆమె అనుమతితో తిరిగి సన్యాస మార్గంలో ప్రయాణిస్తాడు. అనంతరం నీమ్ కరోలి ప్రాంతానికి చేరుకుని ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, అక్కడి స్థానిక వివాదాల నేపథ్యంలో ఆ ఊరిని కూడా విడిచిపెట్టి దేశాటన కొనసాగించడం వంటి కీలక ఘట్టాలను చిత్రంలో ఎంతో భావోద్వేగభరితంగా చూపించారు. ఈ ప్రయాణంలో బాబా స్పర్శతో, ఆయన బోధనలతో పలువురి జీవితాల్లో చోటుచేసుకున్న అద్భుతాలు, ఆధ్యాత్మిక మహిమలను దర్శకుడు తెరపై కళ్లకు కట్టినట్లుగా తీర్చిదిద్దారు. భక్తిరసంతో పాటు ఆత్మజ్ఞానాన్ని పంచే ఈ చిత్రం నవంబర్ 27 నుంచి సోనీ లివ్‌లో వీక్షకులను అలరించనుంది.
ఇవి కూడా చదవండి:
నన్ను ఎంత తక్కువగా అంచనా వేస్తే.. అంతగా గెలిచి చూపిస్తా: ధనుష్
మూస పాత్రలు నా వల్ల కాదు.. నా లక్ష్యమిదే: రెజీనా
నాన్నను కోల్పోయినంత బాధగా ఉంది: వివి వినాయక్