టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ సీనియర్ నిర్మాత కన్నుమూత
ABN , Publish Date - Oct 28 , 2026 | 08:30 PM
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నిర్మాత చలసాని వెంకటేశ్వరరావు బుధవారం రాత్రి వయోధిక సమస్యలతో కన్నుమూశారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నిర్మాత చలసాని వెంకటేశ్వరరావు (Chalasani Venkateswara Rao) బుధవారం రాత్రి వయోధిక సమస్యలతో కన్నుమూశారు. ఆయనను జేవీఆర్ అని, జగపతి వెంకటేశ్వరరావు అని కూడా పిలుస్తారు. ఆయన మరణవార్త తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చలసాని వెంకటేశ్వరరావు జగపతి మూవీ క్రియేషన్స్ పతాకంపై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. 1990లో వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రం ‘నేటి దౌర్జన్యం’ ఆయన నిర్మించిందే. తమ్మారెడ్డి భరద్వాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో వినోద్ కుమార్ హీరోగా నటించారు. 1992లో బి.విఠలాచార్య దర్శకత్వంలో ‘కరుణించిన కనకదుర్గ’ (Karuninchina Kanakadurga) అనే భక్తిరస చిత్రాన్ని నిర్మించారు. ఇందులో యమున కథానాయిక.
అంతేకాకుండా, 2015లో నందమూరి జానకి రామ్ తనయుడు మాస్టర్ ఎన్టీఆర్.. శ్రీకృష్ణుడిగా నటించిన పౌరాణిక చిత్రం ‘దాన వీర శూర కర్ణ’ను బాలరాజుతో కలిసి నిర్మించారు. ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం కూడా వహించారు. పౌరాణిక ఇతివృత్తాన్ని చిన్న పిల్లలతో అత్యంత అద్భుతంగా తెరకెక్కించి, విడుదల చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. నిర్మాతగా పరిశ్రమకు సేవలందించిన చలసాని వెంకటేశ్వరరావు మృతికి పలువురు సినీ పెద్దలు నివాళులర్పిస్తున్నారు.
అంచెలంచెలుగా..
సినిమా హాలు బుకింగ్ క్లర్క్‌గా జీవితాన్ని ప్రారంభించిన జేవీఆర్.. తదనంతరకాలంలో ఒక సినిమా హాలుకు ఓనరు అయ్యారు. సినిమా పంపిణీ రంగంలో మంచి పేరు సంపాదించారు. విజయవాడ గాంధీనగర్ వ్యాపార కేంద్రంగా జగపతి పేరుతో హోటల్ బిజినెస్ నడిపారు. జగపతి ఆర్ట్స్ సంస్థలో చిన్న ఉద్యోగిగా చేరి డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, సినీ నిర్మాతగా ఎదిగారు. సినిమా అంటే నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన అనే మూడు విభాగాల సమన్వయ సమ్మిళిత కృషి అని నమ్మిన వ్యక్తి. ఫిల్మ్ డిస్ట్రిబ్యూటరుగా బాగా సంపాదించిన ఆయన.. నిర్మాతగా క్రమేణ నష్టపోయి చివరి రోజుల్లో విజయవాడలో వృద్ధాశ్రమం నడిపారు.
ఇవి కూడా చదవండి:
‘ఆదర్శకుటుంబం’లో టెన్షన్.. అసలు విషయం ఏంటంటే
‘కిల్లర్’ సినిమా ట్విస్ట్ చెబితే రూ. కోటి.. కాంటెస్ట్ రూల్స్ ఇవే
‘దొంగ నా కొడుకు’ నుంచి ‘ఓ మై గాడ్’ పాటొచ్చింది