సీన్ రివర్స్.. భారీగా తగ్గిన ఓటీటీ వీక్షకులు! కొంపముంచుతున్న.. వరుస యాడ్స్
ABN , Publish Date - Oct 28 , 2026 | 11:20 AM
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో పెరుగుతున్న సబ్స్క్రిప్షన్ ధరలు, వరుస ప్రకటనలతో ప్రేక్షకులు అసంతృప్తికి గురవుతున్నారా? నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ సహా ఓటీటీ సంస్థలకు ఎదురవుతున్న సవాళ్లపై ప్రత్యేక కథనం.
ఓటీటీ ప్లాట్ ఫామ్స్ తోనే వేలాది కోట్ల రూపాయల బిజినెస్ సాగుతోంది. ప్యాండమిక్ లో ఆడియెన్స్ పల్స్ పట్టేసిన ఓటీటీలు తరువాత వారి మనసుల్లో తిష్టవేసుకున్నాయి. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయిందని టాక్.. ఎందుకలాగా?.
ఓటీటీల్లో జెయింట్స్ అంటే నెట్ ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video)అనే చెప్పాలి. ఈ రెండు ప్లాట్ ఫామ్స్ కు మునుపటిలా సబ్ స్క్రైబర్స్ వైభవం లేదని లెక్కలు చెబుతున్నాయి. ఈ రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ మధ్య పోటీ సాగుతోన్నా, ఇతర ఓటీటీలు కూడా తమ సత్తా చాటుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా వెలుగు చూసిన గణాంకాల ప్రకారం నెట్ ఫ్లిక్స్ లో వ్యూయింగ్ టైమ్ భారీ పెరిగింది. అయితే ఇండివిడ్యువల్ యూజర్స్ రేట్ గణనీయంగా తగ్గటం విశేషం. వ్యూయింగ్ టైమ్ పెరగడానికి కొత్తగా సబ్ స్క్రైబ్ తీసుకున్నవారు అదేపనిగా నెట్ ఫ్లిక్స్ లోని కొన్ని సూపర్ హిట్ మూవీస్, వెబ్ సిరీస్ వీక్షించడం వల్ల స్ట్రీమింగ్ టైమ్ పెరిగింది. అయితే మునుపటితో పోల్చుకుంటే ఇప్పుడు సబ్ స్క్రైబర్స్ సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టిందట. ఇది నెట్ ఫ్లిక్స్ ఒక్క ఓటీటీ ప్లాట్ ఫామ్‌కే కాదు ఇతర ప్రముఖ 'ఓవర్ ద టాప్' సంస్థలూ తగ్గిన సబ్ స్కైబర్స్ తో పరేషాన్లో ఉన్నట్లు తెలియవస్తోంది.
తరుగుదలకు కారణం...
అన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ (OTT Platforms) లో ఇండివిడ్యుయల్ యూజర్ ఎంగేజ్ మెంట్ సమయం తగ్గడానికి కారణాల్లో మొదటిది- పెరిగిన సబ్ స్క్రిప్షన్ చార్జెస్ అనే చెప్పాలి. ప్యాండమిక్ సమయంలో అన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ జనాన్ని ఆకర్షించడానికి రీజనబుల్ రేటుకే సబ్ స్క్రిప్షన్ అందించాయి. దాంతో సినిమా థియేటర్స్ కు వెళ్ళి సినిమా చూసే ఖర్చుతోనే రెండు, మూడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సబ్ స్కైబ్ (OTT Subscription) చేసుకున్నారు. అలా అప్పట్లో థియేటర్స్ కు జనం రావడం తగ్గి ఓటీటీ స్ట్రీమింగ్ పెరిగింది. ప్రేక్షకులు తమవైపే ఉన్నారని తెలియగానే ఓటీటీ సంస్థలు భారీగా సబ్ స్క్రిప్షన్ రేట్స్ పెంచేశాయి.
అయినప్పటికీ హిట్ సినిమాలు చూడాలనే కుతూహలంతో కొందరు సినీ ఫ్యాన్స్ వాటితోనే జర్నీ చేశారు. ఇక ఈ మధ్య ప్రఖ్యాత ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్జ జీ5 (ZEE5) లాంటివి యాడ్స్ మధ్య మాత్రమే తమ కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేస్తూ వీక్షకుల సహానానికి పరీక్ష పెడుతూ వారి విలువైన సమయాన్ని వృధా చేస్తున్నాయి. ఈ యాడ్స్ కు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసే ఆప్షన్ కూడా లేకపోవడంతో ప్రేక్షకులు విసిగిపోయారు. ఆ కారణంగానూ పలువురు సబ్ స్క్రిప్షన్స్ ను రద్దు చేసేసుకున్నారు. అలా స్వతంత్ర వీక్షకుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.

ఫలించని ప్రయత్నాలు..
మధ్య మధ్యన వచ్చే చేజారిపోతున్న వీక్షకులను కాపాడుకునేందుకు ఓటీటీ సంస్థలు ఒరిజినల్స్ పై దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి. పలు వెబ్ సిరీస్, వెబ్ మూవీస్, షార్ట్స్, ఇంటర్నేషనల్ ఇంటర్వ్యూస్, స్పోర్ట్స్ వంటి వాటిలోనూ వెచ్చిస్తున్నాయి. వ్యయం పెరిగింది- కొత్త సబ్ స్క్రైబర్స్ మాత్రమే వస్తున్నారు. హిట్ మూవీస్ కారణంగా స్ట్రీమింగ్ రేట్ బాగుండటంతో ఎలాగోలా నెట్టుకు వస్తున్నాయి. అయితే జనాన్ని కట్టిపడేసేందుకు ఓటీటీలు చేస్తున్న ప్రయత్నాలేవీ అంతగా ఫలించడం లేదనే చెప్పాలి. తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఆహా (Aha), 'జీ ఫైవ్' వంటివి సబ్ స్క్రిప్షన్ లో రాయితీలు ప్రకటించి ఆడియెన్స్ ను ఆకట్టుకోవాలని చూస్తున్నాయి. ఈ క్రమంలో తమ సబ్స్ట్రైబర్లకు గంటకోసారి కాల్స్, మెసేజ్‌లు చేస్తూ చిరెత్తిస్తున్నాయి కూడా.
ఇక ఇతర ప్రాంతీయ భాషల ఓటీటీలూ ఇదే బాటన సాగుతున్నాయి. తగ్గేదే లేదంటూ అమెజాన్ ప్రైమ్, జియో హాట్ స్టార్ యాడ్స్ పెంచేస్తూనే పోతున్నాయి. దాంతో రోజు రోజుకూ వీటి సబ్ స్క్రైబర్స్ సంఖ్య తగ్గుతోంది. 'యాడ్ - ఫ్రీ' కావాలంటే రెగ్యులర్ సబ్ స్క్రిప్షన్ తో పాటు అదనంగా చెల్లించాలనీ డిమాండ్ చేస్తున్నాయి. దీంతో వీటి స్థానంలో థర్డ్ పార్టీ యాప్స్ అనేకం పుట్టుకొచ్చి ఎలాంటి ప్రకటనలు లేకుండానే కంటెంట్‌ను నిరంతరాయంగా అందిస్తుండడంతో జనమంతా అటువైపే మొగ్గు చూపుతున్నారు. ఇదిలాఉంటే నవతరంలో అత్యధికులు 'బిగ్ స్క్రీన్' ఎక్స్ పీరియన్స్ కు తహతహలాడుతున్నారు.. దాంతో యంగ్ జనరేషన్ ఓటీటీలకు దూరంగా జరిగి మళ్ళీ థియేటర్స్ బాట పడుతున్నారు. ఇదే ఒరవడి పెరుగుతూ పోతే ఓటీటీలకు పెద్ద దెబ్బ పడే అవకాశం ఉందని పరిశీలకుల మాట.. మరి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఏ తరహాలో మళ్ళీ జనాన్ని ఆకర్షిస్తాయో చూడాలి.