నాకు లైఫ్ ఇచ్చింది తెలుగు సినిమా ఇండస్ట్రీనే..: రకుల్
ABN, Publish Date - Nov 22 , 2026 | 10:11 PM
పక్క ఇండస్ట్రీకి వెళ్లినా.. ఎంత ఎదిగినా.. తాము పుట్టిన గడ్డను, నడక నేర్పిన వేదికను గుండెల్లో పెట్టుకునే కొందరు నటీమణులు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ముందు వరుసలో నిలుస్తారు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.
తెలుగు చిత్ర పరిశ్రమ (Tollywood) ఎంతోమంది ముద్దుగుమ్మలకు లైఫ్ ఇచ్చింది. భాషతో సంబంధం లేకుండా ప్రతిభను గుర్తించి, నెత్తిన పెట్టుకుని చూసుకునే ఏకైక ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే.. అది కచ్చితంగా టాలీవుడ్ మాత్రమే. ఉత్తరాది నుంచి వచ్చిన ఎందరో బ్యూటీలు ఇక్కడే కెరీర్ మొదలుపెట్టి స్టార్ డమ్ అందుకున్నారు. అయితే, ఇక్కడ స్టార్స్ అయ్యాక బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కిన కొందరు హీరోయిన్లు వ్యవహరించిన తీరు మాత్రం ఇప్పటికీ తెలుగు సినీ ప్రియులకు తీవ్ర అసంతృప్తిని మిగులుస్తూనే ఉంది. తాప్సీ, ఇలియానా, రాధికా ఆప్టే లాంటి వాళ్లు టాలీవుడ్ ఇచ్చిన ఇమేజ్‌తోనే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ బాలీవుడ్లో కాస్త నిలదొక్కుకోగానే.. సౌత్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు అలా ఉంటాయి.. నడుము, బొడ్డు మీద సన్నివేశాలు తీస్తారు.. అంటూ తీవ్ర స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించి వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. తమకు అన్నం పెట్టి, స్టార్ హోదా ఇచ్చిన పరిశ్రమపైనే ఇలాంటి అక్కసు వెళ్లగక్కడం ఎవరికీ నచ్చలేదు.
కానీ, అందరూ ఒకేలా ఉండరు. పక్క ఇండస్ట్రీకి వెళ్లినా.. ఎంత ఎదిగినా.. తాము పుట్టిన గడ్డను, నడక నేర్పిన వేదికను గుండెల్లో పెట్టుకునే కొందరు నటీమణులు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ముందు వరుసలో నిలుస్తారు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో తెలుగు తెరపై మెరిసిన ఈ ఢిల్లీ భామ, అనతికాలంలోనే వరుస విజయాలతో టాలీవుడ్లో టాప్ గేర్‌లో దూసుకెళ్లారు. స్టార్ హీరోలందరి సరసన నటించి అగ్ర కథానాయికగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత క్రమంగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి, అక్కడ కూడా వైవిధ్యమైన పాత్రలతో తన నటనను నిరూపించుకుంటున్నారు. ప్రస్తుతం నితేశ్ తివారీ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘రామాయణ’ చిత్రంలో శూర్పణఖ లాంటి ఎంతో సవాలుతో కూడిన పాత్రను పోషించి నార్త్ సర్కిల్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. అయితే ఎంత పెద్ద ప్రాజెక్టులు చేసినా, ఎంత బిజీగా ఉన్నా రకుల్ మాత్రం టాలీవుడ్‌ను ఎప్పుడూ మర్చిపోలేదు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. టాలీవుడ్ ప్రస్తావన రాగానే ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘తెలుగు సినీ పరిశ్రమ నాకు కేవలం గుర్తింపు మాత్రమే ఇవ్వలేదు.. నా జీవితంలో నేను ఏం కోరుకున్నానో అవన్నీ అందించింది. ఒక నటిగా నన్ను నిలబెట్టింది, నూరేళ్ల జీవితాన్ని ఇచ్చింది. నేను ఎక్కడ ఉన్నా, ఏ భాషలో పని చేస్తున్నా.. నన్ను తీర్చిదిద్దిన టాలీవుడ్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అంటూ మనసులోని ప్రేమనంతా బయటపెట్టారు. సొంత మాతృభాషలా తెలుగును నేర్చుకుని మాట్లాడటమే కాకుండా.. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు కూడా గతాన్ని గుర్తుంచుకుని ఇంతటి గౌరవాన్ని చాటుకోవడం నిజంగా అభినందనీయం. పక్క ఇండస్ట్రీకి వెళ్లి విమర్శలు చేసిన కొందరు హీరోయిన్లకు రకుల్ మాటలు ఒక గట్టి సమాధానంలా మారాయని సినీ విశ్లేషకులు, అభిమానులు ప్రశంసిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
‘భోగి’ ట్రైలర్.. ఘడియలు దగ్గర పడ్డాయ్.. గంగా గాడి కోత మొదలు
ఎవరిపైనైనా క్రష్ ఉందా? అంటే.. మీనూ పాప షాకింగ్ ఆన్సర్
‘వృషకర్మ’ రిలీజ్ పై డౌట్స్ వద్దు.. ఇదిగో క్లారిటీ