చరిత్రను తెలుసుకుందాం.. ఫూలే దంపతుల పోరాటానికి తెరపై నివాళి
ABN, Publish Date - Nov 24 , 2026 | 03:46 PM
భారత సామాజిక సంస్కరణల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయులు మహాత్మా జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల జీవిత పోరాటం ఆధారంగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫూలే’. సినిమా విడుదల నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్ చాంబర్లో చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది.
భారత సామాజిక సంస్కరణల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయులు మహాత్మా జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల జీవిత పోరాటం ఆధారంగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫూలే’ (Phule). కులవివక్ష, అంటరానితనం, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతూ మహిళా విద్య, సామాజిక న్యాయం కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఆ ఆదర్శ దంపతుల ప్రయాణాన్ని ప్రముఖ దర్శకుడు అనంత్ మహదేవన్ వెండితెరపై ఆవిష్కరించారు. ఇందులో మహాత్మా జ్యోతిరావ్ ఫూలే పాత్రలో ప్రతీక్ గాంధీ, సావిత్రిబాయి ఫూలే పాత్రలో పత్రలేఖ నటించారు. సుపదా క్రియేషన్స్ బ్యానర్‌పై డా. పొన్నం రవిచంద్ర నిర్మాతగా రూపొందిన ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ వెర్షన్ నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. ఏషియన్ సినిమాస్ ద్వారా సునీల్ నారంగ్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుండగా, తెలుగు వెర్షన్‌కు చేతన్ కత్తి మాటలు అందించారు.
136వ వర్ధంతి సందర్భంగా మహనీయుడి జీవితానికి నివాళి
నవంబర్ 28, 2026న మహాత్మా జ్యోతిరావ్ ఫూలే 136వ వర్ధంతిని పురస్కరించుకుని, ఆయన ఆశయాలు, ఫూలే దంపతులు ఎదుర్కొన్న అవమానాలు, చేసిన త్యాగాలను నేటి తరానికి చేరువ చేయాలనే సంకల్పంతో ఒక రోజు ముందుగానే నవంబర్ 27న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించారు. సినిమా చూసిన అనంతరం ఫూలే దంపతుల పోరాటం నేటి సమాజానికి అత్యంత అవసరమైన సందేశాన్ని అందిస్తుందని ఉప ముఖ్యమంత్రి కొనియాడారు.
సినిమా విడుదల నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్ చాంబర్లో చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖ రచయిత పసునూరి రవీందర్ మాట్లాడుతూ.. హిందీలో వచ్చిన ఈ అద్భుత చిత్రాన్ని తెలుగులోకి తీసుకొస్తున్న పొన్నం రవిచంద్రకు ధన్యవాదాలు. జ్యోతిరావ్ ఫూలే జీవితం అందరికీ ఆదర్శనీయం. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని అన్నారు.
సోషల్ యాక్టివిస్ట్ విమలక్క మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు ఆడపిల్లలు ఎన్నో రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారంటే అందుకు సావిత్రిబాయి ఫూలే వేసిన పునాదులే కారణం. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందుతారు. అన్ని థియేటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లు రావాలని కోరుకుంటున్నాను’’ అని ఆకాంక్షించారు. టీఎఫ్‌సీసీ చైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ఇలాంటి సందేశాత్మక చిత్రాలు మరిన్ని రావాలని, ఇకపై జ్యోతిరావ్ ఫూలే జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఈ సినిమాను రీ-రిలీజ్ చేయాలని కోరారు.
చిత్ర నిర్మాత డా. పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న సునీల్ నారంగ్‌కు, మధుర ఆడియో వారికి ధన్యవాదాలు. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు, ఒక విభిన్నమైన జానర్లో వస్తోంది. సుమారు 200 ఏళ్ల క్రితం జరిగిన ఈ చరిత్రను నేటి యువత, విద్యార్థులు, ముఖ్యంగా మహిళలు కచ్చితంగా తెలుసుకోవాలి. నవంబర్ 26న ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సినిమాలో మహాత్మా ఫూలేగా నటించిన హీరో ప్రతీక్ గాంధీ హాజరవుతారని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
‘అలియాస్ రుక్మిణి’ ట్రైలర్ లేకుండానే.. నాని రియాక్షన్ ఇదే
సూర్య ‘సీన్’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే
RC17: రామ్ చరణ్ సరసన ఆ ‘తార’ ఫిక్స్ అయినట్టేనా?