Cm Revanth Reddy: బస్సులో వెళ్లి.. సినిమా చూసిన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు
ABN , Publish Date - Jan 06 , 2026 | 07:13 AM
ఫూలే సినిమా ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క్, పలువురు మంత్రులు.
ప్రముఖ హిందీ, గుజరాతీ నటుడు, స్కామ్ 92 (Scam 1992) సిరీస్‌తో దేశ వ్యాప్తంగా విశేష గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రతీక్ గాంధీ (Pratik Gandhi ). ఆ సిరీస్ తర్వాత ఓవర్‌నైట్ స్టార్ స్టేటస్ ఆయన సొంతం అయింది. ఆ క్రమంలో అచితూచి మాత్రమే చిత్రాలు చేస్తూ వస్తున్న ఆయన గత సంవత్సరం హీరోగా వచ్చిన బయోపిక్ చిత్రం ఫూలే. ప్రముఖ సంఘసంస్కర్త మహాత్మ జ్యోతీరావు ఫూలే జీవిత గాధ ఆధారంగా రూపొందిన ఈ మూవీ 2025 ఏప్రిల్‌లో ప్రేక్షకుల ఎదుటకు వచ్చింది.
కాగా ఈ సినిమాను ఇప్పుడు తెలుగులోకి అనువదింపజేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క (Mallu Bhatti Vikramarka), మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేకంగా వీక్షించడం విశేషం. అసెంబ్లీ సమావేశం సమయం ముగియగానే సీఎం సహా మంత్రలు అంతా ఆర్టీసీ బస్సులో కలిసి ప్రసాద్ ల్యాబ్స్ (Prasad Labs) కు వెళ్లి మరి తిలకించారు. ఈ నేపథ్యంలో ల్యాబ్స్ వద్ద పటిష్ట భద్రత కట్టుదిట్టం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి.
సినిమా ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కుల నిర్మూలన కోసం జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే దంపతులు గొప్ప పోరాటం చేశారని, మహిళా విద్య కోసం వారు ఎదుర్కొన్న సవాళ్లను సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారని, పూలే దంపతుల సామాజిక సేవా గుణం, వారి జీవితాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఇలాంటి సినిమాలు ప్రతి ఒక్కరూ తప్పక చూడాలని తెలిపారు. సినిమా రూపొందించిన వారిని, నటులను ప్రశంసించారు.
“ఫూలే" సినిమా భారతీయ సమాజానికి అద్భుతమైన సందేశాన్నిస్తుందని, మహిళా అభ్యున్నతి కోసం, ఆనాటి సమాజంలో ఉన్న కులవివక్ష ఇతర ఇబ్బందులను తట్టుకుని సమ సమాజం కోసం పూలే దంపతులు పునాదులు వేశారని, ఆ ఫలాలను, ఫలితాలనే ఈ రోజు మన స్వంతత్ర భారతదేశంలో అనుభవిస్తున్నామని, వారు వేసిన పునాదుల మీద సాగుతూ వారి ఆశయాలను, లక్ష్యాలను సాధించడంలో మా ప్రభుత్వం, సీఎం సారథ్యంలో కృషి చేస్తామని డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.