సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

30 ఏళ్ల ‘పవిత్రబంధం’.. వెంకటేశ్ ‘ఆదర్శకుటుంబం’పై ఆసక్తి!

ABN, Publish Date - Oct 17 , 2026 | 03:59 PM

వెంకటేశ్, సౌందర్య జంటగా నటించిన ‘పవిత్రబంధం’ విడుదలై 30 ఏళ్లు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ఘనవిజయం సాధించిన ఈ ఫ్యామిలీ డ్రామా విశేషాలు, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శకుటుంబం’ విడుదలపై తాజా సమాచారం.

Pavitra Bandham Movie

వెంకటేశ్, సౌందర్య జంటగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో సి.వెంకట్రాజు, జి.శివరాజు నిర్మించిన చిత్రం 'పవిత్రబంధం'. 'కాంట్రాక్ట్ మ్యారేజ్' నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. 1996 అక్టోబర్ 17న ఈ చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికంటే 13 రోజుల ముందు రిలీజైన నాగార్జున 'నిన్నే పెళ్ళాడతా' ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. యన్టీఆర్ సినిమా టైటిల్ తో నాగార్జున సినిమా రూపొందితే, ఏయన్నార్ మూవీ టైటిల్ తో ఈ వెంకటేశ్ చిత్రం తెరకెక్కడం విశేషం. రెండు సినిమాలు హిట్స్ నిలవడం మరింత విశేషం. 'నిన్నే పెళ్ళాడతా' యూత్ ను కట్టిపడేసింది. మహిళా ప్రేక్షకులను 'పవిత్రబంధం' ఆకట్టుకుంది. ఈ చిత్రానికి కీరవాణి స్వరకల్పన చేశారు. ఇందులో ఓ పాటలో ప్రఖ్యాత గాయని ఆశా భోస్లే పాడుతూ కనిపించడం విశేషం.


'పవిత్రబంధం'లో హీరో మోడరన్ థాట్స్ అంటూ కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవడం, భార్యతో విడిపోవడం, తరువాత తప్పు తెలుసుకొని ఇల్లాలి ప్రేమకోసం తపించడం ప్రధానాంశాలు. ఇందులో వెంకటేశ్ తండ్రిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నటించారు. ప్రకాశ్ రాజ్, శ్రీహరి, బ్రహ్మానందం, సుధాకర్, శుభలేఖ సుధాకర్, అన్నపూర్ణ ఇతర ముఖ్యపాత్రధారులు. సీతారామశాస్త్రి, భువనచంద్ర పాటలు రాశారు. భూపతిరాజా కథకు, పోసాని కృష్ణ మురళి మాటలు పలికించారు. ఈ చిత్రం ఒరియా, కన్నడ, హిందీ, తమిళ, బంగ్లాదేశీ భాషల్లో రీమేక్ అయింది. ఈ 'పవిత్రబంధం' పేరు వినగానే ఈ నాటికీ పలువురికి ఇందులో ఏసుదాస్ గానం చేసిన 'అపురూపమైనదమ్మ ఆడజన్మ.' పాట గుర్తుకు వస్తూ ఉంటుంది. వెంకటేశ్ హిట్ మూవీస్ లో ఒకటిగా 'పవిత్రబంధం' నిలచింది.


'పవిత్రబంధం' సినిమా సమయంలో పోసాని వద్ద త్రివిక్రమ్ అసోసియేట్ గా పనిచేశారు. ఇప్పుడు ప్రముఖ దర్శకరచయితగా త్రివిక్రమ్ రాణిస్తున్నారు. గతంలో వెంకటేశ్ హీరోగా రూపొందిన 'నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి' చిత్రాలకు రచయితగానూ పనిచేశారు త్రివిక్రమ్. తొలిసారి వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'ఆదర్శకుటుంబం - హౌస్ నంబర్ 47' తెరకెక్కుతోంది. ఈ నెల 2వ తేదీనే 'ఆదర్శకుటుంబం' వస్తుందని అన్నారు. తరువాత 9వ తేదీన వస్తుందనీ వినిపించింది. ఇప్పుడు అక్టోబర్ 30న 'ఆదర్శకుటుంబం' రానుందని తెలుస్తోంది. 30 ఏళ్ళ క్రితం 'పవిత్రబంధం'లో ఫ్యామిలీ డ్రామా పండించిన వెంకటేశ్ ఇప్పుడు 'ఆదర్శకుటుంబం'లో మరింత వైవిధ్యంగా ఫ్యామిలీ ఆడియెన్సెస్ ను ఎంటర్ టైన్ చేయనున్నారు. మరి ఈ సారి 'ఆదర్శకుటుంబం'తో వెంకటేశ్ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి:

‘కల్కి 2’ షూటింగ్‌పై అప్‌డేట్.. సాయిపల్లవి ఎంట్రీపై టాక్

దీపావళి రేసులో సూర్య, నయనతార.. విజేత ఎవరు?

‘బాషా’, ‘మాస్టర్’, ‘తొలిప్రేమ’ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత

Updated Date - Oct 17 , 2026 | 04:04 PM