బాలయ్యకు పోటీగా యంగ్ హీరో.. ఆ సూపర్ స్టారే ఆదర్శమా..
ABN , Publish Date - Oct 23 , 2026 | 08:01 PM
సినిమా తారలకు మూవీ స్టార్సే అభిమానులుగా ఉండడం కొత్తేమీ కాదు. తన ప్రతి చిత్రంలో ఏదో ఒక సందర్భంలో తన అభిమాన హీరోని చూపిస్తూ వచ్చే ఓ యంగ్ హీరో.. ఇప్పుడు తన ఫేవరెట్ హీరో మూవీపైనే పోటీకి దిగుతున్నారు.
సినిమా తారలకు మూవీ స్టార్సే అభిమానులుగా ఉండడం కొత్తేమీ కాదు. తన ప్రతి చిత్రంలో ఏదో ఒక సందర్భంలో తన అభిమాన హీరోని చూపిస్తూ వచ్చే ఓ యంగ్ హీరో.. ఇప్పుడు తన ఫేవరెట్ హీరో మూవీపైనే పోటీకి దిగుతున్నారు. ఈ విషయంలో ఆ యంగ్ హీరోకు నటశేఖర కృష్ణ (Super Star Krishna) ఆదర్శమనీ తెలుస్తోంది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. రాయలసీమకు చెందిన ఈ హీరో సినిమాల్లో నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కు సంబంధించిన ఏదో ఒక అంశం చోటు చేసుకుంటూ ఉంటుంది. చివరకు బాలయ్య పోస్టర్ అయినా కిరణ్ సినిమాల్లో ఏదో ఒక సందర్భంలో దర్శనమిస్తూ ఉంటుంది. బాలయ్యను అంతలా అభిమానించే కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు తన ఫేవరెట్ హీరో 111వ చిత్రంగా వస్తోన్న ‘దాదా’తో పోటీపడుతున్నారు. డిసెంబర్ 24వ తేదీన ‘దాదా’ వస్తుందని ప్రకటించారు. కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన ‘రియాలిటీ’ మూవీని మరుసటి రోజు అంటే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25వ తేదీకి రిలీజ్ చేస్తున్నారు. అలా తన అభిమాన హీరోతోనే పోటీకి ఎందుకు సై అంటున్నారు కిరణ్ అన్న చర్చ సాగుతోంది.
అభిమాన హీరోతో పోటీపడ్డప్పుడే ఎవరికైనా తగిన గుర్తింపు వస్తుందని సినీ స్టార్స్ భావిస్తూ ఉంటారు. అలా గతంలో కొందరు స్టార్స్ సాగారు- సక్సెస్ సాధించారు. నటరత్న యన్టీఆర్ (NT Ramarao)కు నటశేఖర కృష్ణ వీరాభిమాని అందరికీ తెలుసు. తాను చిత్రసీమలో అడుగు పెట్టిన దగ్గర నుంచీ కృష్ణ ఈ విషయాన్ని పదే పదే చెప్పుకున్నారు. అలాంటి కృష్ణ పలుమార్లు తన అభిమాన నటుడు యన్టీఆర్ సినిమాలతో పోటీకి దిగారు. కొన్నిసార్లు సక్సెస్ కూడా సాధించారు. 1976 సంక్రాంతి సీజన్లో యన్టీఆర్ నటించిన ‘వేములవాడ భీమకవి’ విడుదలయింది. అదే సమయంలో కృష్ణ నటించిన ‘పాడిపంటలు’ సినిమాను రిలీజ్ చేశారు. అంతకు ముందు 1974లో ‘అల్లూరి సీతారామరాజు’తో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న కృష్ణకు ఆ తరువాత వరుసగా డజన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాల్చీ తన్నాయి. దాంతో మళ్ళీ సరైన బ్రేక్ కోసం కృష్ణ ప్రయత్నిస్తున్న సమయది. ఆ టైమ్‌లోనే తన ‘పాడిపంటలు’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని నిర్ణయించారు కృష్ణ. ఇప్పటికే ఫ్లాప్స్‌తో ఉన్నావు - సంక్రాంతికి పలు చిత్రాలు వస్తున్నాయి కాస్త ఆలోచించు అని సన్నిహితులు హెచ్చరించారు. అయినా కృష్ణ తన సినిమాపై నమ్మకంతో ‘పాడిపంటలు’ను రిలీజ్ చేశారు. ఆ యేడాది సంక్రాంతి బంపర్ హిట్‌గా నిలచింది ‘పాడిపంటలు’. ఆ తరువాత నుంచీ ప్రతీ సంక్రాంతికి కృష్ణ తన సినిమాలను రిలీజ్ చేయడం ఓ సంప్రదాయంగా మారింది. ఈ నేపథ్యంలోనే 1977 జనవరి 14న యన్టీఆర్ ‘దానవీరశూర కర్ణ’తో కృష్ణ ‘కురుక్షేత్రం’ పోటీపడడంతో యన్టీఆర్ పౌరాణికంతో కృష్ణ పురాణగాథ పోటీ అట అంటూ జనాల్లో నానారు. కృష్ణ ‘కురుక్షేత్రం’ అంతగా అలరించలేదు- యన్టీఆర్ ‘దానవీరశూరకర్ణ’ బంపర్ హిట్.. అయినా కృష్ణ గురించి జనం మాట్లాడుకోవడంతో ఆయనకు భలే పబ్లిసిటీ లభించింది. ఇప్పుడు కిరణ్ అబ్బవరం కూడా అదే రూటులో సాగుతూ తన అభిమాన హీరో బాలయ్యతో పోటీకి సై అంటున్నారని తెలుస్తోంది.
కృష్ణ, కిరణ్ అబ్బవరం వంటివారే కాదు మరికొందరు టాలీవుడ్ స్టార్స్ తమ ఫేవరెట్ హీరోస్తో బాక్సాఫీస్ బరిలో పోటీకి దిగి జనం నోళ్ళలో నానారు. ఇప్పుడు కిరణ్ అబ్బవరం కేవలం బాలయ్య సినిమా ‘దాదా’ (Dada)తోనే కాదు, డిసెంబర్ 24వ తేదీనే వస్తోన్న మరో టాలీవుడ్ సీనియర్ స్టార్ నాగార్జున 100వ చిత్రం ‘కింగ్ 100’ (King100)తోనూ పోటీపడుతున్నారని చెప్పొచ్చు. తన ఫేవరెట్ హీరోతోనే కాకుండా మరో టాప్ హీరోతోనూ కిరణ్ అబ్బవరం క్రిస్మస్ సీజన్లో పోటీకి సై అంటున్నారు. ఒక వేళ 1976 సంక్రాంతి సీజన్లో కృష్ణ ‘పాడిపంటలు’ బంపర్ హిట్ సాధించినట్టు క్రిస్మస్కు కిరణ్ ‘రియాలిటీ’ (Reality) విజయం సాధిస్తే భలేగా ఉంటుందని సినీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే ఇకపై కిరణ్ కూడా ప్రతి యేటా క్రిస్మస్కు తన చిత్రాలను రిలీజ్ చేస్తారేమో చూడాలి.
ఇవి కూడా చదవండి:
‘మిస్టర్ దెయ్యం’కు మంచు మనోజ్ సపోర్ట్.. ఏం చేశారంటే
ముంబైలో మరోసారి కలకలం.. బిగ్ బి ఇంటికి బాంబు బెదిరింపు
‘ఒకే ఒక జీవితం’ డైరెక్టర్ శ్రీ కార్తిక్‌తో రుక్మిణి వసంత్ భారీ ప్రాజెక్ట్