గొప్ప సందేశంతో ‘డియర్ ఆస్ట్రోనాట్’.. అందరూ చూడాలి: శేఖర్ కమ్ముల
ABN , Publish Date - Oct 29 , 2026 | 07:30 PM
కథాబలం ఉన్న చిత్రాలకు తెలుగు ప్రేక్షకులు ఎల్లప్పుడూ బ్రహ్మరథం పడుతూనే ఉంటారు. ఈ కోవలోనే సరికొత్త ఆలోచనతో, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో తెరకెక్కిన వినూత్న చిత్రం ‘డియర్ ఆస్ట్రోనాట్’.
కథాబలం ఉన్న చిత్రాలకు తెలుగు ప్రేక్షకులు ఎల్లప్పుడూ బ్రహ్మరథం పడుతూనే ఉంటారు. ఈ కోవలోనే సరికొత్త ఆలోచనతో, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో తెరకెక్కిన వినూత్న చిత్రం ‘డియర్ ఆస్ట్రోనాట్’ (Dear Astronaut). యువన్కృష్ణ ఎంటర్టైన్మెంట్స్, మనస్విని భాగ్యరాజా సమర్పణలో కార్తీక్ భాగ్యరాజా (Karthik Bhagyaraja) రచన, దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఇందులో సౌమిత్ రావు (Sowmith Rao), శ్రేయసి సేన్ (Shreyasi Sen) హీరో హీరోయిన్లుగా నటించగా.. కమల్ కామరాజు, గీతా భాస్కర్, చైత్రతో పాటు ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రల్లో అలరించనున్నారు. నవంబర్ 20న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిర్వహించిన గ్రాండ్ సాంగ్ లాంచ్ ఈవెంట్కు టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) ముఖ్య అతిథిగా హాజరై.. పాటను విడుదల చేశారు.
పాటను విడుదల చేసిన అనంతరం శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ‘‘ఆస్ట్రోనాట్ (వ్యోమగామి) అవ్వాలనే బలమైన ఆకాంక్ష ఉండటం, ఆ గొప్ప లక్ష్యం చుట్టూ కథను అల్లుకుని సినిమాగా మలచడం చాలా బాగుంది. హీరోయిన్ శ్రేయసి సేన్ చాలా సహజంగా, చక్కగా నటించింది. ఇదొక అద్భుతమైన ప్రయోగం. మనుషులు ఎంత పెద్ద కలలైనా కనవచ్చు, సంకల్పం ఉంటే వాటిని నిజం చేసుకోవచ్చనే ఒక గొప్ప సందేశాన్ని ఈ చిత్రంలో చూపించారు. సాంకేతికంగా సినిమా విజువల్స్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఇది టాలీవుడ్లో ఒక గొప్ప చిత్రంగా నిలుస్తుంది. నవంబర్ 20న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలి’’ అని చిత్ర బృందాన్ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో నటుడు కమల్ కామరాజు మాట్లాడుతూ.. ఇలాంటి విభిన్నమైన కథాంశంతో సినిమా తీయడమే ఒక పెద్ద సాహసం. ఇది పూర్తిగా కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ. ఓ అమ్మాయి అంతరంగం, ఆమె భావోద్వేగాలు, ఆశయాలను ప్రతిబింబించే చిత్రమిది. అందరినీ ఆలోచింపజేసేలా, స్ఫూర్తినిచ్చేలా ఉంటుందని తెలిపారు. సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ మాట్లాడుతూ.. శేఖర్ కమ్ముల, మోహనకృష్ణ ఇంద్రగంటి సినిమాల తరహాలో ఎంతో ఆహ్లాదకరంగా, సహజసిద్ధంగా ఈ సినిమా సాగుతుంది. కథ నచ్చే నేను ఈ ప్రాజెక్ట్ను ఎడిట్ చేశానని చెప్పారు. నటీమణులు శరణ్య ప్రదీప్, గీతా భాస్కర్ మాట్లాడుతూ.. తమకు సినీ జీవితాన్నిచ్చిన శేఖర్ కమ్ముల ఈ వేడుకకు రావడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇంకా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.
ఇవి కూడా చదవండి:
నాగబాబు విడుదల చేసిన ‘మైలురాయి’ టైటిల్ లుక్
కథలు వినడం మానేసిన అనుపమ.. కారణం ఏంటి?
‘వారణాసి’ వాయిదా వార్తలకు విజయేంద్ర ప్రసాద్ చెక్