మా కష్టాలు మీకు కామెడీగా అనిపిస్తాయి
ABN, Publish Date - Oct 15 , 2026 | 05:39 PM
'నా పెళ్లి విషయంలో ఇంట్లో ఎలాంటి ఒత్తిడి లేదు.. పెళ్లంటే ఇద్దరూ కలిసి సంతోషంగా జీవించడమే కానీ, అమ్మాయిని పనిమనిషిలా చూడటం కాదు' అన్నారు అనుపమ పరమేశ్వరన్
'నా పెళ్లి విషయంలో ఇంట్లో ఎలాంటి ఒత్తిడి లేదు.. పెళ్లంటే ఇద్దరూ కలిసి సంతోషంగా జీవించడమే కానీ, అమ్మాయిని పనిమనిషిలా చూడటం కాదు' అన్నారు అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ఆమె కీలక పాత్ర పోషించిన చిత్రం ‘క్రేజీ కల్యాణం’ (crazy Kalyanam) బద్రప్ప గాజుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మించారు. నరేష్ విజయ కృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, ‘రాజ్ వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్ ప్రధాన పాత్రల్లో నటించారు. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సినిమా విశేషాలతో పాటు తన పాత్ర, పెళ్లి, కుటుంబం, నటిగా తన ఆలోచనల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ప్రతి విషయంలో క్రేజీగా అనిపించి..
‘క్రేజీ కల్యాణం’ సినిమాకు మొదట వేరే వర్కింగ్ టైటిల్ అనుకున్నాం. అయితే, ఈ సినిమా చేసే క్రమంలో ప్రతి విషయం క్రేజీగా అనిపించేది. దాంతో దర్శకుడు బద్రప్ప ఈ టైటిల్ పెట్టారు. ఇందులో ఫన్‌తో పాటు ఎమోషన్స్ కూడా ఉంటాయి. నరేష్ గారు, అఖిల్, తరుణ్ భాస్కర్ వంటి వాళ్లు మా టీమ్‌లోకి వచ్చాక ప్రాజెక్ట్ మరింత క్రేజీగా మారింది.
నా పెళ్లి గురించి ఇంట్లో ఒత్తిడి లేదు
సినిమాలో నా పాత్రకు పెళ్లి అవుతుందా? లేదా? అనేది తెరపైనే చూడాలి. నిజ జీవితంలో మాత్రం మా ఇంట్లో నా పెళ్లి గురించి ఎలాంటి ఒత్తిడి లేదు. నీకు ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకోమని మా వాళ్లు చెబుతుంటారు. అయితే, నాకు పెళ్లికి ముందే ఒక బేబీని కనాలని ఉంది. కేరళలో జరిగే మా వివాహ వేడుకల్లో పూర్తిగా శాకాహారమే వడ్డిస్తారు. తెలంగాణ పెళ్లిళ్లలోని కొత్త సంప్రదాయాలను కూడా తెలుసుకున్నాను. కేరళలో గతంలో ఎంగేజ్మెంట్, పెళ్లి అనే రెండు వేడుకలే ప్రధానంగా ఉండేవి. ఇప్పుడు హల్దీ, మెహందీ వంటి వేడుకలు కూడా కొత్తగా చేరుతున్నాయి.
మా కష్టాలు ప్రేక్షకులకు కామెడీగా కనిపిస్తాయి
‘క్రేజీ కల్యాణం’లో మా పాత్రలన్నీ ఏదో ఒక సమస్యతో ఇబ్బందిపడుతుంటాయి. కానీ మా కష్టాలు ప్రేక్షకులకు కామెడీగా అనిపిస్తాయి. పాత్రలు, వాటి మధ్య జరిగే సందర్భాల నుంచే సహజంగా హాస్యం పుడుతుంది. కథ చెప్పడానికి వచ్చినప్పుడే దర్శకుడు బద్రప్పలోని సిన్సియారిటీ, కన్విక్షన్ నాకు నచ్చాయి. ఆయన కథ చెబుతుంటే కొన్ని సందర్భాల్లో నవ్వొచ్చింది. మరికొన్ని సన్నివేశాలకు ఎమోషనల్ అయ్యాను. బాలరాజు పాత్రతో సహా పూర్తి స్క్రిప్ట్‌ను ఆయన వివరించారు. కథతో పాటు దర్శకుడిగా ఆయనకున్న జెన్యూన్ అప్రోచ్ నచ్చడంతో ఈ సినిమా అంగీకరించాను. తరుణ్ భాస్కర్ చేసిన బాలరాజు పాత్ర మన చుట్టూ కనిపించే వ్యక్తుల్లో ఒకరిగా ఉంటుంది. ఆ పాత్రలో చాలా ఫన్ ఉంది. మా దర్శకుడు, నిర్మాత కూడా కొంతవరకు బాలరాజు తరహా వ్యక్తులే అనిపిస్తుంటుంది.
పెళ్లంటే అమ్మాయిని పనిమనిషిని చేయడం కాదు
కథలో పాత్రలు పరిచయమైన తర్వాత పెళ్లికి సంబంధించిన అంశం వస్తుంది. ప్రేక్షకులు కథలోకి వెళ్లడానికి ఎక్కువ సమయం పట్టదు. పెళ్లి అనేది ఇద్దరు కలిసి సంతోషంగా జీవించడానికి చేసుకునేది. అంతేకానీ, అమ్మాయిని ఇంట్లో పనిమనిషిలా చూసేందుకు కాదు. నా పాత్ర కీర్తి ఆలోచన కూడా ఇదే. వ్యక్తిగతంగా నా అభిప్రాయం కూడా అదే. అందుకే ట్రైలర్లో ‘నేను వంట చేస్తే.. నువ్వు గిన్నెలు కడగాలి’ అనే డైలాగ్ పెట్టాం. అఖిల్ చాలా టాలెంటెడ్ యాక్టర్. ఆయన నటనలో ఎమోషనల్ హానెస్టీ ఉంటుంది. భావోద్వేగాలు కృత్రిమంగా అనిపించవు. ఆయన కళ్లలో ఒక స్పార్క్ కనిపిస్తుంది. ఉదయ్ పాత్రకు ఇలాంటి లక్షణాలు అవసరం. కీర్తి స్ట్రిక్ట్‌గా ఉండే పాత్ర అయితే, ఉదయ్ ఆమెకు సపోర్టివ్‌గా ఉంటాడు. ఈ రెండు వ్యక్తిత్వాల మధ్య వచ్చే సంఘర్షణే కథలో కీలకం. ఇన్ని పాత్రల మధ్య ఉదయ్ వ్యక్తిత్వం ప్రేక్షకులకు అర్థమయ్యేలా నటించడానికి ఎమోషనల్ హానెస్టీ అవసరం. అఖిల్ అలాంటి నటనను అందించారు.
నా అభిప్రాయాలను పంచుకునే అవకాశం దక్కింది
కొన్ని సినిమాల్లో మనకు ఇచ్చిన పాత్రను చేసుకుని వెళ్లిపోవడం తప్ప పెద్దగా చెప్పడానికి ఏమీ ఉండదు. కానీ ‘క్రేజీ కల్యాణం’ లాంటి సినిమాల్లో మన అభిప్రాయాలను పంచుకునే అవకాశం ఉంటుంది. దర్శకుడు బద్రప్పతో నా ఆలోచనలను పంచుకున్నాను. నరేష్ గారు, అఖిల్, తరుణ్ భాస్కర్‌తో కలిసి సన్నివేశాల గురించి చర్చించాం. సీన్స్ మరింత బాగా రావాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేశాం. ఈ సినిమాలో నేను తెలంగాణ యాసలో మాట్లాడాను. దానికోసం ప్రత్యేకంగా వర్క్‌షాపులు చేయలేదు. దర్శకుడు చెప్పే విధానాన్ని గమనిస్తూ డైలాగులు చెప్పాను.
డబ్బుల కోసం సినిమాలు చేయను
నటిగా ఎప్పుడూ విభిన్నంగా ఉండాలని ప్రయత్నిస్తుంటాను. నా సినిమాలన్నీ ఒకేలా ఉన్నాయని ప్రేక్షకులు అనుకోకూడదు. నా పాత్రను చూసి సినిమా ఏదో గుర్తుపట్టేంత ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటాను. ‘క్రేజీ కల్యాణం’లో కీర్తి పాత్ర కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోతుందని నమ్ముతున్నాను. డబ్బుల కోసం మాత్రమే సినిమాలు చేయాలని అనుకోను. కొత్తగా ఏదైనా ప్రయత్నించాలనే ప్యాషన్ నన్ను ముందుకు నడిపించాలి. ప్రస్తుతం తమిళం, మలయాళ భాషల్లో చేస్తున్న ప్రాజెక్టులన్నీ ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. నటిగా ప్రతి సినిమాలోనూ కొత్తదనం చూపించాలన్నదే నా ప్రయత్నం.
ALSO READ:
పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాల్లో ఏం జరిగింది? డాక్టర్ సంచలన వ్యాఖ్యలు
Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు పోలీసుల నోటీసులు.. అక్టోబర్ 28 డెడ్‌లైన్!
‘జైలర్ 2’ ప్రీ-సేల్స్ విధ్వంసం: టాప్ 10 ఆల్‌టైమ్ లిస్ట్‌లో రజనీ రికార్డ్
జైలర్ 2 రివ్యూ.. సీక్వెల్ సెంటిమెంట్‌ను చెరిపేసిన రజనీకాంత్!