‘కాకా’ వర్సెస్ ‘విశ్వంభర’.. కోన వెంకట్, బాబీ పోస్టులతో ఫుల్ క్లారిటీ
ABN, Publish Date - Nov 27 , 2026 | 09:50 PM
2027 సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో మెగాస్టార్ చిరంజీవి సినిమాల రిలీజ్‌పై సోషల్ మీడియాలో గందరగోళం నెలకొంది. ‘విశ్వంభర’, ‘కాకా’ రెండు సినిమాలు రాబోతున్నాయంటూ.. వార్తలు వైరల్ అవుతోన్న నేపథ్యంలో కోన, బాబీ క్లారిటీ ఇచ్చారు.
2027 సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సినిమాల రిలీజ్‌పై సోషల్ మీడియాలో గందరగోళం నెలకొంది. ఒకవైపు దర్శకుడు బాబీ కొల్లి (KS Ravindra) తెరకెక్కిస్తోన్న ‘కాకా’ (Kaaka) చిత్రం సంక్రాంతి బరిలో దిగడం పక్కా అని మేకర్స్ పదేపదే స్పష్టం చేస్తుంటే, మరోవైపు ఎటువంటి అధికారిక అప్డేట్ లేని ‘విశ్వంభర’ (Vishwambhara) కూడా సంక్రాంతికే రాబోతోందంటూ కొందరు కావాలనే ప్రచారం చేస్తుండటం మెగా అభిమానులను అయోమయానికి గురిచేస్తోంది. అయితే, తాజాగా రచయిత కోన వెంకట్, దర్శకుడు బాబీ చేసిన ట్వీట్లు ఈ రూమర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాయి.
కోన వెంకట్, బాబీ ఏం ట్వీట్ చేశారంటే.. ‘కాకా’ షూటింగ్ లొకేషన్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీలతో కలిసి ఉన్న ఒక వర్కింగ్ స్టిల్‌ను షేర్ చేస్తూ కోన వెంకట్ (Kona Venkat) స్పష్టమైన ప్రకటన చేశారు. ‘‘మా లక్ష్యం, మా దృష్టి, మా టార్గెట్ చాలా క్లియర్‌గా ఉన్నాయి. జనవరి 13న ‘కాకా’ వస్తోంది.. ఇది కచ్చితంగా మెగా పొంగల్ కాబోతోంది’’ అంటూ తమన్, కేవీఎన్ ప్రొడక్షన్స్, డీఓపీ విజయ్ కార్తీక్ కన్నన్‌లను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. కోన వెంకట్ ట్వీట్‌ను రీ-పోస్ట్ చేస్తూ దర్శకుడు బాబీ సైతం కౌంట్‌డౌన్ మొదలుపెట్టారు. ‘‘ ‘కాకా’ రాకకు ఇంకా 47 రోజులు మాత్రమే ఉంది.. ఈ 2027 సంక్రాంతికి జనవరి 13న కలుద్దాం (#KaakaOnJan13)’’ అంటూ బాబీ సైతం కౌంట్‌డౌన్‌తో క్లారిటీ ఇచ్చారు.
అసలు ‘విశ్వంభర’ పేరు ఎందుకు తెరపైకి వస్తోంది?
వాస్తవానికి ‘కాకా’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 13న విడుదల చేసేందుకు టీమ్ అంతా ఫుల్ స్వింగ్‌లో పనిచేస్తోంది. కానీ, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ‘విశ్వంభర’ విషయంలో మాత్రం చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి చడీచప్పుడు లేదు. రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి ఒక్క అధికారిక ప్రకటన కూడా రాలేదు. అయినప్పటికీ, ‘విశ్వంభర’ కూడా సంక్రాంతికే వస్తుందంటూ సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు.
కావాలని సృష్టిస్తున్న కన్ఫ్యూజనా?
ఒకే పండగ సీజన్లో, అదీ ఒకే రోజు గ్యాప్‌లో మెగాస్టార్ చిరంజీవి నటించిన రెండు భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడటం అనేది ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం అసాధ్యమైన విషయం. అలాంటిది ఎలాంటి అప్డేట్స్ లేని ‘విశ్వంభర’ను సంక్రాంతి రేసులోకి లాగడం వెనుక ‘కాకా’ సినిమాపై నెలకొన్న హైప్‌ను, అభిమానుల అటెన్షన్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశం ఏమైనా ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరు ఎన్ని రూమర్స్ క్రియేట్ చేసినా, తమ టార్గెట్ మాత్రం 2027 జనవరి 13 మాత్రమేనని కోన వెంకట్, బాబీ తమ పోస్టులతో కుండబద్దలు కొట్టారు. చూద్దాం మరి.. ‘విశ్వంభర’ మేకర్స్‌లో ఏమైనా చలనం వస్తుందేమో..
ఇవి కూడా చదవండి:
హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ సీజన్ 2.. డిటైల్స్ ఇవే
మోక్షజ్ఞ ఎంట్రీకి మెగా బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
‘సమ్మర్ హాలీడేస్’కు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది