దుల్కర్ ‘మిడాస్ టచ్’
ABN , Publish Date - Nov 19 , 2026 | 05:35 PM
కొందరు హీరోలది హీరోయిన్స్‌కు ‘మిడాస్ టచ్’.. మరికొందరు హీరోయిన్లది సినిమాలకే ‘గోల్డెన్ లెగ్’ అనీ చెబుతుంటారు. దుల్కర్ సల్మాన్ విషయంలో ‘మిడాస్ టచ్’ మాట ఇప్పుడు బాగా వినబడుతోంది.
కొందరు హీరోలది హీరోయిన్స్‌కు ‘మిడాస్ టచ్’ (Midas Touch).. మరికొందరు హీరోయిన్లది సినిమాలకే ‘గోల్డెన్ లెగ్’ అనీ చెబుతుంటారు. దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)ను ఇప్పుడు అలాగే అంటున్నారు. అతని సరసన నటించిన నాయికలకు ‘స్టార్‌డమ్’ పరుగులు తీస్తూ వస్తోందని టాక్. దుల్కర్ సల్మాన్ తన మాతృభాష మళయాళంలో నటిస్తూ సినిమాలు నిర్మిస్తూ సాగుతున్నారు. అయితే హీరోగా ఆయనకు గ్రాండ్ సక్సెస్‌ను తెలుగు సినిమాలే అందిస్తున్నాయి. ‘లక్కీ భాస్కర్’ తర్వాత హిట్టు ముఖం చూడని దుల్కర్‌కు రాబోయే ‘ఆకాశంలో ఒక తార’ పై బోలెడు ఆశలు ఉన్నాయి. ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అవుతున్న సాత్విక వీరవల్లికి అప్పుడే అవకాశాలు తలుపు తడుతూ ఉండడం విశేషం.. అందువల్లే దుల్కర్ ది ‘మిడాస్ టచ్’ అంటున్నారు సినీజనం. దుల్కర్ సరసన నటించిన నాయికలకు స్టార్ డమ్ ఇట్టే లభిస్తుందనే టాక్ ఉంది. అందుకు నిదర్శనంగానే కీర్తి సురేశ్ (Keerthy Suresh) ‘మహానటి’లో దుల్కర్‌తో నటించాకే స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. అలాగే ఉత్తమనటిగా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. ‘సీతారామం’లో దుల్కర్‌తో నటించాకే మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)కు హీరోయిన్‌గా క్రేజ్ దక్కింది. ‘లక్కీభాస్కర్’లో దుల్కర్‌తో జోడీ కట్టిన మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)కి తర్వాత మంచి అవకాశాలు లభించాయి. ఇలా దుల్కర్ సరసన హీరోయిన్‌గా నటిస్తే చాలు వారి తీరు మారుతుందని అంటున్నారు. ఒకప్పుడు చంద్రమోహన్ (Chandra Mohan), రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad)ను కూడా ఇలాగే అనేవారు.
చంద్రమోహన్‌తో జోడీ కట్టిన నాయికలందరూ తర్వాత ఆయనకు అందనంత ఎత్తుకు ఎదిగారు.. స్టార్ హీరోయిన్స్‌గా రాణించారు. ‘లక్ష్మణరేఖ’లో ఆయనతో నటించాకే జయసుధ కెరీర్ పెద్ద మలుపు తిరిగింది. ఇక అప్పటి వరకు మంచినటి అనిపించుకున్న జయప్రద ఆయనతో ‘సిరిసిరిమువ్వ’తో హిట్ సాధించాకే స్టార్ హీరోయిన్ అయ్యారు. ‘సంసారానికి సరిగమలు’లో ఆయనతో నటించాకే ప్రభ కెరీర్ కూడా మారింది. రాధిక, చిరంజీవితో కలసి నటించి అలరించిన మాట వాస్తవమే అయినా.. చంద్రమోహన్‌తో ఆమె నటించిన ‘రాధాకళ్యాణం, మూడుముళ్ళు’ తర్వాత స్టార్ హీరోయిన్ అనిపించుకున్నారు. ఇక ఆల్ ఇండియాలో సూపర్ హీరోయిన్‌గా రాణించిన శ్రీదేవి కూడా ‘పదహారేళ్ళ వయసు’లో చంద్రమోహన్ సరసన నటించాకే స్టార్‌డమ్ అందుకున్నారు. అందువల్ల అప్పట్లో చంద్రమోహన్‌తో జోడీ కట్టాలని పలువురు వర్ధమాన నాయికలు ఆశిస్తూండేవారు.
చంద్రమోహన్ తర్వాత హీరోయిన్స్ రాత మార్చిన హీరోగా పేరొందారు రాజేంద్రప్రసాద్. నటి రోజా తొలి చిత్రం ‘ప్రేమతపస్సు’లో రాజేంద్రప్రసాద్ హీరో. అలా కొన్నాళ్ళకే రోజాకు స్టార్‌డమ్ లభించింది. అంతకు ముందు ఎన్ని చిత్రాల్లో నటించినా, ఐరన్ లెగ్ అనే పేరు సంపాదించిన రమ్యకృష్ణ, రాజేంద్రప్రసాద్ సరసన ‘ఆస్తులు- అంతస్తులు’ అనే చిత్రంలో నటించారు. ఈ మూవీ ఆట్టే ఆకట్టుకోకపోయినా, ఇందులో నటించాకే రమ్యకృష్ణ తీరు మారిందన్నది వాస్తవం. పడచుభామగా మీనా తెరపై కనిపిస్తున్న రోజుల్లోనే ‘నవయుగం’ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌తో కలసి నటించారు. ఆ తర్వాత మీనా కూడా స్టార్ హీరోయిన్ అయిపోయారు. రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన ‘రాజేంద్రుడు-గజేంద్రుడు’తోనే సౌందర్యకు నాయికగా మంచి గుర్తింపు లభించింది. ఆ పై ఆయనతో కలసి నటించిన ‘మాయలోడు’ సౌందర్యను స్టార్ హీరోయిన్‌గా చేసింది. ఇలా అప్పట్లో హీరోయిన్స్‌కు అచ్చివచ్చే హీరోలుగా చంద్రమోహన్, రాజేంద్రప్రసాద్ సాగితే, ఇప్పుడు ఆ క్రెడిట్‌ను దుల్కర్ సల్మాన్ సొంతం చేసుకున్నారు. రాబోయే రోజుల్లో ఇంకెందరు దుల్కర్ హీరోయిన్స్ స్టార్స్ అవుతారో చూడాలి.
ఇవి కూడా చదవండి:
13 ఏళ్ల నిరీక్షణకు తెర.. ‘ఆకాశంలో ఒక తార’పై పవన్ సాధినేని ఎమోషనల్ లెటర్
మనవళ్లతో సూపర్ స్టార్.. ఇలా ఎప్పుడూ చూడలేదు కదా
అనిల్ రావిపూడి మొదలెట్టేశాడు.. ఇక జాతరే