సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘ఆద‌ర్శ కుటుంబం’లో ఆ పాటని పక్కన పెట్టేయడానికి కారణమిదేనా?

ABN, Publish Date - Oct 31 , 2026 | 07:50 PM

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’. ఈ సినిమాలో ‘మాలా’ పాటను పక్కన పెట్టేయడంపై అనేక కారణాలు వినిపిస్తున్నాయి.

AK 47 Movie Maala Song Stills

విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) ప్రధాన పాత్రలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ (Aadarsha Kutumbam House No: 47) థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత ఓ ఆసక్తికరమైన అంశం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసం మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ (S Thaman) ఏకంగా ఎనిమిది పాటలను సమకూర్చారు. అధికారికంగా విడుదలైన జ్యూక్‌బాక్స్‌లోనూ ఆ ఎనిమిది పాటలు ఉన్నాయి. కానీ తీరా వెండితెరపై చూస్తే మాత్రం కేవలం మూడు పాటలు మాత్రమే కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అందులోనూ ముందే భారీగా ప్రచారం చేసిన ఓ ప్రత్యేక పాటను ఏకంగా సినిమా నుంచే లేపేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.


ప్రధానంగా ‘మాలా’ (Maala Song) అంటూ సాగే మాస్ సాంగ్‌ను భారీ సెట్ వేసి, కోట్ల రూపాయల బడ్జెట్‌తో చిత్రీకరించారు. లిరికల్ వీడియో రూపంలో ముందుగానే విడుదల చేసి ప్రమోషన్లు కూడా గట్టిగానే నిర్వహించారు. కానీ థియేటర్ ప్రింట్‌లో మాత్రం ఆ పాటకు చోటు దక్కలేదు. చిత్రీకరణ కోసం అంత బడ్జెట్ పెట్టినా, చివరి నిమిషంలో ఎడిటింగ్‌లో ఆ పాటను ఎందుకు కత్తిరించాల్సి వచ్చిందనే దానికి బలమైన కారణాలే వినిపిస్తున్నాయి. ఈ పాట లిరికల్ వీడియో విడుదలైన సమయంలోనే నెట్టింట భారీ ట్రోలింగ్ నడిచింది. వెంకటేష్ ఇమేజ్‌కు, ఆయన స్థాయికి ఏమాత్రం సరిపోని విధంగా సాహిత్యం ఉందని, ట్యూన్ కూడా రొటీన్‌గా ఉందంటూ స్వయంగా అభిమానులే అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి తోడు ‘ఆదర్శ కుటుంబం’ అనేది కంటెంట్ బేస్డ్ ఫ్యామిలీ డ్రామా. హీరో-హీరోయిన్ల మధ్య అనవసరమైన డ్యూయెట్లకు ఇందులో పెద్దగా స్కోప్ లేదు. ఇప్పటికే ఉన్న ‘నారాయణమ్మ’ పాట కూడా కథలో కాస్త ఇరికించినట్లుగానే ఉంటుందనే టాక్ వచ్చింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో స్క్రీన్‌ప్లే కాస్త నెమ్మదించిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్న తరుణంలో.. ట్రోలింగ్‌కు గురైన ‘మాలా’ పాటను కూడా ఉంచితే సినిమా మరింత ల్యాగ్ అయ్యి ఫలితం తారుమారయ్యే ప్రమాదం ఉందని మేకర్స్ గ్రహించి ఉండొచ్చు.


సినిమా నిడివి, కథా గమనం, ప్రేక్షకుల ఎంగేజ్‌మెంట్‌ను దృష్టిలో ఉంచుకునే చిత్ర బృందం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున ఖర్చు చేసి తెరకెక్కించిన పాటను ఇలా పక్కన పెట్టేయడం నిర్మాతలకు ఆర్థికంగా నష్టమే అయినప్పటికీ.. సినిమా సమగ్రతను కాపాడటానికి ఇలాంటి త్యాగాలు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా థమన్ ఇచ్చిన 8 పాటలు కూడా అంతగా జనాలకు ఎక్కకపోవడం విడ్డూరం. అదేమంటే.. ఇది పాటల సినిమా కాదు, మాటల సినిమా అని వివరణ ఇస్తున్నారు థమన్. చూద్దాం మరి.. ‘మాలా’ సాంగ్‌పై మేకర్స్ ఎలాంటి వివరణ ఇస్తారో..

ఇవి కూడా చదవండి:

ఎన్టీఆర్ ‘డ్రాగన్’.. రంగంలోకి మరో మ్యూజిక్ డైరెక్టర్?

‘జంగా’లో శివగా త్రిగుణ్.. రా అండ్ రస్టిక్ పోస్టర్ వైరల్

జాన్వీ కపూర్‌ పై తెలుగు ఫ్యాన్స్ ఫైర్.. టాలీవుడ్‌లో ఇక కష్టమేనా?

Updated Date - Oct 31 , 2026 | 07:50 PM