ఇళయదళపతి విజయ్ బయోపిక్.. హీరో, దర్శకుడు ఫిక్స్ అయినట్టేనా?
ABN , Publish Date - Nov 16 , 2026 | 04:26 PM
కోలీవుడ్ బాక్సాఫీస్‌ను దశాబ్దాల పాటు శాసించిన ఇళయదళపతి విజయ్, తన సినీ కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే సంచలన నిర్ణయం తీసుకుని రాజకీయ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే.
కోలీవుడ్ బాక్సాఫీస్‌ను దశాబ్దాల పాటు శాసించిన ఇళయదళపతి విజయ్ (Ilayathalapathy Vijay), తన సినీ కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే సంచలన నిర్ణయం తీసుకుని రాజకీయ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టిన తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి చరిత్ర సృష్టించడంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే, రాజకీయ బాధ్యతల వల్ల విజయ్ ఇకపై వెండితెరపై నటించరనే వెలితి మాత్రం ఫ్యాన్స్‌ను నిరంతరం వేధిస్తూనే ఉంది. ఈ క్రమంలో విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ (Jason Sanjay) దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేయడం అభిమానులకు కొంత ఊరటనిచ్చినప్పటికీ, ఆయన్ను వెండితెరపై హీరోగా చూడాలన్నదే ఫ్యాన్స్ బలమైన కోరిక. ఇప్పుడు ఆ కోరిక నెరవేరేలా కోలీవుడ్ వర్గాల్లో ఓ అదిరిపోయే వార్త చక్కర్లు కొడుతోంది.
త్వరలోనే దళపతి విజయ్ (Vijay) జీవిత కథ ఆధారంగా ప్రతిష్టాత్మక బయోపిక్ తెరకెక్కనుందనే ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అంతేకాదు, ఈ బయోపిక్‌లో విజయ్ పాత్రను స్వయంగా ఆయన తనయుడు జేసన్ సంజయ్ పోషించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. రూపురేఖల్లోనూ, స్టైల్లోనూ తండ్రికి తగ్గ తనయుడిగా ఉండే జేసన్ అయితేనే విజయ్ పాత్రకు వంద శాతం న్యాయం చేయగలరని అభిమానులు, సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ఈ బయోపిక్ పట్టాలెక్కి విజయం సాధిస్తే, జేసన్ సంజయ్ పూర్తిస్థాయి హీరోగా ఇండస్ట్రీలో ప్రయాణం మొదలుపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తద్వారా తమ అభిమాన హీరో సినిమాలు చేయకపోయినా, ఆయన వారసుడు తెరపై చిచ్చరపిడుగులా చెలరేగుతాడని వారెంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు, ఈ బయోపిక్కు దర్శకుడు కూడా దాదాపు ఖరారైనట్లు కోలీవుడ్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. ‘అమరన్’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత, ప్రస్తుతం ధనుష్ హీరోగా ‘ఓం’ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రతిభావంతుడైన దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) ఈ బయోపిక్కు మెగాఫోన్ పట్టనున్నారని సమాచారం. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఇటీవల జరిగిన ‘ఓం’ సినిమా ప్రమోషన్లలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. విజయ్ చివరి చిత్రం ‘జననాయగన్’ ప్రమోషన్లలో భాగంగా విడుదలైన ‘వన్ లాస్ట్ డ్యాన్స్’ వీడియో చూసి రాజ్‌కుమార్ పెరియసామి భావోద్వేగానికి గురయ్యారని సాయి పల్లవి వెల్లడించారు. గతంలో ఆయనతో కలిసి పనిచేసినప్పుడు ఎప్పుడూ అంత ఎమోషనల్‌గా చూడలేదని, రాజ్‌కుమార్‌కు విజయ్ అంటే అంతటి అమితమైన అభిమానమని ఆమె పేర్కొన్నారు. విజయ్‌పై అంతటి గౌరవం, అభిమానం ఉన్న దర్శకుడు కాబట్టే, ఈ బయోపిక్ బాధ్యతలకు ఆయనే అత్యంత అర్హులని సినీ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. చూద్దాం మరి.. ఏం జరుగుతుందో?
ఇవి కూడా చదవండి:
తనిష్క్ దోపిడీ.. అరెస్టు తర్వాత పెరిగిన యూట్యూబర్ మీనాక్షి ఫాలోవర్స్
Ashika Ranganath: అల్లు అర్జున్ తో పని చేయడం చాలా బావుంది