తనిష్క్ దోపిడీ.. అరెస్టు తర్వాత పెరిగిన యూట్యూబర్ మీనాక్షి ఫాలోవర్స్
ABN , Publish Date - Nov 16 , 2026 | 08:07 AM
మదురై తనిష్క్ నగల దుకాణం దోపిడీ కేసులో యూట్యూబర్ మీనాక్షి పోలీసులకు కీలక వాంగ్మూలం ఇచ్చింది. అప్పులు తీర్చుకునేందుకే ప్రియుడు నిషాంత్‌కు సహకరించినట్లు వెల్లడించింది.
అప్పులు తీర్చేందుకే తన ప్రేమికుడైన నిషాంత్ కృష్ణ (Nishanth Krishna) మదురై (Madurai) లో తనిష్క్ నగల దుకాణం (Tanishq jewellery) లో దోపిడీ చేయడానికి తాను అన్ని విధాలా సహకరించానని యూట్యూబర్ మీనాక్షి (YouTuber Meenakshi Natchiyar) తెలిపింది. ఈ మేరకు పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో తాను ఇల్లు నిర్మించేందుకు విపరీతంగా అప్పులు చేశానని, అసంపూర్తిగా ఉన్న ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి వచ్చిందని, అ నేపథ్యంలోనే తనిష్ షోరూమ్‌లో దోపిడీ చేయడానికి నిషాంత్‌కు సహకరించానని వివరించింది.
ఇంటి నిర్మాణం కోసం తాను పడుతున్న కష్టాలు చూసి తన కోసమే నగల దుకాణంలో దోపిడీ చేయబోతున్నానని, తరువాత ఇద్దరం లైఫ్‌లో సెటిల్ అవుదామన్నాడని మీనాక్షి తెలిపారు. నగల దుకాణంలో దోపిడీ చేయడానికి నిషాంత్‌కు తన స్కూటీ ఇచ్చి పంపానని, దోపిడీ పూర్తయ్యాక మొదట తనకే ఫోన్ చేసి చెప్పాడని, ఆ తర్వాత అతడిచ్చిన నగల సంచిని భద్రపరచి మరుసటి రోజు మాడకుళం వద్ద భూమిలో పాతిపెట్టానని తెలిపింది. ఇక ఈ దోపిడీ కేసులో అరెస్టయిన నిషాంత్ తండ్రి సురేష్, మీనాక్షిలను పోలీసులు జిల్లా మేజిస్ట్రేట్ సంగీత ఎదుట హాజరు పరచగా, వారిద్దరికి ఈ నెల 29 వరకు రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు ఇద్దరినీ మదురై సెంట్రల్ జైలుకు తరలించారు.

నిషాంత్ కోసం గాలింపు...
ఇదిలా ఉండగా ఈ దోపిడీ కేసులో పరారీలో ఉన్న నిషాంత్ కృష్ణ ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ కేసులో సురేష్ మీనాక్షిలను అరెస్టు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నప్పుడు తిరుప్పూరు నుంచి నిషాంత్ పోన్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిషాంత్ ఫోన్ సిగ్నల్స్ ప్రకారం అతడిని పట్టుకునేందుకు హుటా హుటిన వెళ్ళారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు పోలీసులు తిరుప్పూరు అంతటా గాలించినా అతడి ఆచూకీ తెలియలేదు. దీంతో అతడి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మరికొన్ని ప్రాంతాల్లో గాలింపు చర్యలు ప్రారంభించారు.
మీనాక్షికి పెరిగిన ఫాలోవర్స్
తనిష్ నగల దుకాణంలో జరిగిన దోపిడీ కేసులో అరెస్టయిన ప్రముఖ తమిళ యూట్యూబర్ మీనాక్షి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య పెరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మీనాక్షి ఆరెస్ట్‌కు ముందు ఆమె ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ సంఖ్య 152,052 (152K) 1.52 లక్షలు ఉన్న నేపథ్యంలో, అరెస్టయిన తర్వాత కొత్తగా 12 వేల మంది పాలోవర్స్తో 1.64 లక్షలకు (164K) చేరింది. మీనాక్షి పాత వీడియోలు, ప్రస్తుత కేసు వివరాలను ఫాలోవర్స్ ఆసక్తిగా వీక్షిస్తున్నారు. యువత ఆలోచనాశైలి ఈ విధంగా మారడంపై సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.