‘రామాయణం’ చూసి ఫిదా అయిన అమల!
ABN , Publish Date - Nov 16 , 2026 | 03:31 PM
నితీశ్ తివారీ తెరకెక్కించిన ‘రామాయణం’ సినిమాపై నటి అమల ప్రశంసలు కురిపించారు. ప్రతి పాత్రకు, సన్నివేశానికి మేకర్స్ న్యాయం చేశారని, భారతీయ సినిమా గర్వపడేలా చిత్రాన్ని రూపొందించారని కొనియాడారు. ముఖ్యంగా రావణ, సీత పాత్రలు తనను ఆకట్టుకున్నాయని, రెండో భాగం కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు.
నితీశ్ తివారీ తెరకెక్కించిన 'రామాయణం' చిత్రం విడుదలై దాదాపు రెండు వారాలు కావస్తున్నా, దీనిపై వాదోపవాదాలు, చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు ఈ సినిమాను ఆకాశానికి ఎత్తితే, మరికొందరు దీనిని తీవ్రంగా విమర్శించారు. తాజాగా నటి అమల రామాయణం సినిమా చూసి, తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కళాక్షేత్రలో చదువుకుంటున్న రోజుల్లో తాను రామాయణంను అనేక సార్లు రంగస్థలంపై ప్రదర్శించానని, ఈ సినిమా ట్రైలర్ ను చూసినప్పుడు అదే భావన తనకు మరోసారి కలిగిందని, అందుకే ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలో విడుదల అవుతుందా అని ఎదురుచూశానని అమల తెలిపారు. ఈ ఇతిహాసాన్ని దర్శకుడు నితీశ్ తివారీ వెండితెరపై ఎలా చూపించి ఉంటారనే ఆసక్తి కూడా తనకు కలిగిందని, అందుకే ఓపెన్ మైండ్‌తో దానిని ఇటీవల చూశానని అమల చెప్పారు.
రామాయణం సినిమాను చూసిన తర్వాత తానెంతో సంతృప్తి చెందానని అమల అన్నారు. సినిమాలోని ప్రతి పాత్రకు, ప్రతి సన్నివేశానికి మేకర్స్ న్యాయం చేకూర్చారని కితాబిచ్చారు. దర్శక నిర్మాతలు భారతీయ సినిమా గర్వపడేలా దీనిని తీర్చిదిద్దారని ఆమె అన్నారు. రామాయణ గాథను అద్భుతంగా చూపడమే కాకుండా, ఈ తరం ప్రేక్షకులు మెచ్చేలా, వారు సినిమాతో కనెక్ట్ అయ్యేలా చేశారని తెలిపారు. ఊహించడానికి కూడా కష్టమైన భావోద్వేగాలను నటీనటులు ఎంతో చక్కగా పోషించారని, ఆ ఇతిహాసాన్ని, యుగాన్ని కళ్ళముందు సాక్షాత్కరింప చేశారని ఆమె పేర్కొన్నారు. ఇది అందరికీ సుపరిచితమైన కథే అయినా... ఆసక్తికరంగా దానిని తెర మీద చూపించారని, కొన్ని సన్నివేశాలు తనను ఆశ్చర్యానికి లోను చేయగా, మరికొన్ని సన్నివేశాలు అద్భుత అనుభూతికి గురిచేశాయని, పార్ట్ 2 కోసం ఆత్రుతతో ఎదురుచూస్తున్నానని అమల అన్నారు. ఇందులో ప్రతి ఒక్కరూ చాలా చక్కగా తమ పాత్రలను పోషించారని, మరీ ముఖ్యంగా ప్రధాన పాత్రధారులు ముగ్గురు ఎంతో బాగా చేశారని తెలిపారు. రావణ, సీత పాత్రల తీరు తెన్నులు తనకెంతో నచ్చాయని, రాముడు యుద్థానికి సిద్థమౌతున్నాడు కాబట్టి అది చూడాల్సి ఉందని అమల తెలిపారు. ఈ ఇతిహాసాన్ని ప్రతి ఒక్కరూ తమ దగ్గరలో ఉన్న థియేటర్లలో చూడాలని కోరుతూ చిత్ర దర్శకుడు నితీశ్ తివారీకి ఆమె శుభాకాంక్షలు తెలియచేశారు.
ఇవి కూడా చదవండి:
తనిష్క్ దోపిడీ.. అరెస్టు తర్వాత పెరిగిన యూట్యూబర్ మీనాక్షి ఫాలోవర్స్
Ashika Ranganath: అల్లు అర్జున్ తో పని చేయడం చాలా బావుంది
కాకా.. వెంకటేష్ హీరోయిన్ తో చిరు స్టెప్పులు