‘జైలర్ 2’ సెట్లో మోహన్ బాబు.. ‘జైలర్ 3’లో ఏమైనా?
ABN , Publish Date - Oct 19 , 2026 | 12:43 PM
బాక్సాఫీస్ వద్ద సూపర్ స్టార్ రజనీకాంత్ మాస్ ర్యాంపేజ్ కొనసాగుతోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ‘జైలర్ 2’ ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది.
బాక్సాఫీస్ వద్ద సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) మాస్ ర్యాంపేజ్ కొనసాగుతోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilip Kumuar) దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ‘జైలర్ 2’ (Jailer 2) ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. తొలి నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 425 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డులను తిరగరాసింది. ఈ సీక్వెల్లో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, హృతిక్ రోషన్, జాకీ ష్రాఫ్‌ల క్యామియో రోల్స్ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఈ క్రమంలో ‘జైలర్ 2’ షూటింగ్ సెట్ నుంచి బయటకు వచ్చిన ఒక అరుదైన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘జైలర్ 2’ క్లైమాక్స్ షూటింగ్ జరుగుతున్న సమయంలో రజనీకాంత్ ప్రాణస్నేహితుడు, కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు (Manchu Mohan Babu) సెట్‌ను సందర్శించారు. షూటింగ్ విరామ సమయంలో రజనీకాంత్‌తో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, కన్నడ హ్యాట్రిక్ హీరో శివ రాజ్‌కుమార్, వర్సటైల్ యాక్టర్ ఎస్జే సూర్య, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్‌లతో కలిసి మోహన్ బాబు ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు. కుర్చీల్లో కూర్చుని ఉన్న ఈ స్టార్స్ మధ్యలో మోహన్ బాబు వైట్ అండ్ వైట్ డ్రెస్సులో దర్జాగా కూర్చుని కనిపించారు. దక్షిణాది చిత్రసీమలోని అగ్ర నటులంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఈ పిక్ నెట్టింట సెన్సేషన్‌గా మారింది.
‘జైలర్ 3’లో మోహన్ బాబుకు ఛాన్స్ ఉందా?
ఈ పిక్ వైరల్ అవ్వడంతో సినీ ప్రియుల్లో, సోషల్ మీడియాలో సరికొత్త చర్చ మొదలైంది. ‘జైలర్’ ఫ్రాంచైజీలో మల్టీస్టారర్ క్యామియోలే ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. తమిళం నుంచి రజనీకాంత్, మలయాళం నుంచి మోహన్‌లాల్, కన్నడ నుంచి శివ రాజ్‌కుమార్, హిందీ నుంచి హృతిక్ రోషన్, జాకీ ష్రాఫ్ నటించి ఆయా భాషల ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు. అయితే, తొలి భాగం నుంచే తెలుగు నుంచి ఒక స్టార్ హీరో ఇందులో ఉంటే బాగుంటుందనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో ‘జైలర్ 2’ కోసం తొలుత నందమూరి బాలకృష్ణ, ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేర్లు గట్టిగా ప్రచారంలోకి వచ్చాయి. తెలుగు నాట వీరిద్దరిలో ఎవరో ఒకరు ‘ముత్తువేల్ పాండియన్’ ఫ్రెండ్‌గా నటిస్తే థియేటర్లు తగలబడిపోతాయని అభిమానులు ఆశించారు. కానీ వివిధ కారణాల వల్ల అది కుదరలేదు. చివరి నిమిషంలో బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్ వచ్చి చేరడంతో నార్త్ బెల్ట్‌ను టార్గెట్ చేశారు.
ఇప్పుడు తాజాగా మోహన్ బాబు సెట్‌కు వెళ్లి అందరితో కలిసి దిగిన ఈ ఫొటో చూశాక.. రాబోయే ‘జైలర్ 3’లో ఆయన ఏమైనా భాగం కాబోతున్నారా? అనే ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. మోహన్ బాబు, రజనీకాంత్ మధ్య ఉన్నది నాలుగు దశాబ్దాల నాటి స్నేహం. గతంలో ‘పెదరాయుడు’లో మోహన్ బాబు కోసం రజనీకాంత్ గెస్ట్ రోల్ చేసి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు రజనీ కోసం మోహన్ బాబు ‘జైలర్ 3’లో ఓ పవర్ఫుల్ క్యామియో ఇస్తే ఎలా ఉంటుంది? లేదా కనీసం ‘జైలర్ 3’లోనైనా తెలుగు నుంచి మరో స్టార్ హీరోకు నెల్సన్ స్థానం కల్పిస్తారా? అనేది చూడాలి. ఏదేమైనా.. ఈ స్టార్స్ అందరూ ఒక్కచోట చేరిన ఫొటో మాత్రం ప్రస్తుతం సినీ అభిమానులకు కన్నుల పండువగా మారిందని చెప్పుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
లాస్ ఏంజెల్స్‌లో ‘రామాయణ’ హిస్టారికల్ వరల్డ్ ప్రీమియర్.. ఎప్పుడంటే?
మనం ఎప్పుడూ భయపడకూడదు.. ఇచ్చిపడేయాలి: విశ్వక్సేన్
యంగ్ హీరోతో ‘ఓ పిట్టకథ’ దర్శకుడి చిత్రం ప్రారంభం