పురాణగాథలతో బాక్సాఫీస్‌పై దండయాత్ర.. రాబోతున్న భారీ భక్తి చిత్రాలివే!

ABN , Publish Date - Oct 18 , 2026 | 06:06 PM

పురాణగాథల ద్వారా భక్తి భావం పెంచే ప్రయత్నంలో సాగుతున్నారు కొందరు సినీజనం. వారిని విజయాలూ వరిస్తున్నాయి. ఈ ఊపులో మరిన్ని పురాణగాథలు మనల్ని పలకరించనున్నాయి. రాబోయే ఆ చిత్రాలేవో చూద్దాం.

Mythological Movies

ఈ యేడాది యావద్భారతంలోని సినిమా అభిమానులను ఆశ్చర్యపరచిన చిత్రం హనుమాన్ అంశ్ (Hanuman Ansh) అనే చెప్పాలి. కేవలం రెండు కోట్ల రూపాయలతో తెరకెక్కిన 'హనుమాన్ అంశ్' దాదాపు 400 కోట్లు పోగేసింది. ఇంతటి ఘనవిజయం సాధించిన చిత్రంపై ప్రేక్షకులు చర్చోపచర్చలు సాగించారు. హిందీలోనే ఈ సినిమాను విశేషంగా చూడడం వల్ల తరువాత ప్రాంతీయ భాషల్లోకి 'హనుమాన్ అంశ్'ను అనువదించినా, మ్యాజిక్ సాగలేదు.

అయినప్పటికీ 'హనుమాన్ అంశ్' సాధించిన విజయాన్ని ఎవరూ కాదనలేని విషయం. ఈ సినిమా ఇంతటి విజయాన్ని అందుకోవడానికి కారణం భారతీయుల్లో నిక్షిప్తమైన భక్తిభావమే అని చెప్పక తప్పదు. వాస్తవానికి ఈ సినిమాను 'నీమ్ కరోలీ బాబా' బయోపిక్‌గా విశాల్ చతుర్వేది తెరకెక్కించారు. కానీ, 'హనుమాన్ అంశ్' కమర్షియల్ సినిమాలను తలదన్నేలా సక్సెస్ సాధించడమే విశేషం. దీంతో రాబోయే భక్తిభావం నింపే పురాణగాథలు, భక్తి రసచిత్రాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

శ్రీరామా.. శ్రీకృష్ణా

'హనుమాన్ అంశ్' గ్రాండ్ సక్సెస్ సాధించక ముందే కొన్ని సినిమాలు భక్తి రసం (Devotional Movies) నింపుకొని ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ కోవకు చెందిన చిత్రాల్లో కాంతారా (Kantara), మహావతార్ నరసింహ (Mahavatar Narasimha) చిత్రాలనూ గుర్తు చేసుకోవలసిందే. అతి త్వరలో రాబోయే 'రామాయణ' కోసం జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నవంబర్ 5న రామాయణ (Ramayana) రానుంది. ఈ సినిమాలో రామునిపై అయోధ్య ప్రజల భక్తిభావం, హనుమాన్ భక్తి ప్రపత్తులు కనిపిస్తాయని తెలుస్తోంది. రాబోయేది 'రామాయణ' మొదటి భాగమే- 2027 దీపావళికి 'రామాయణ' రెండో భాగం రానుంది. ఇక కృష్ణావతారంలోని పరమార్థాన్ని వివరిస్తూ 'కృష్ణావతారం' ట్రైయాలజీ రూపొందుతోంది. ఇందులోని మొదటి భాగం ఇప్పటికే వెలుగు చూసింది. మరో రెండు భాగాలు తెరకెక్కుతున్నాయి.

సంక్రాంతికి.. ఉగాదికి

దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారి అనుగ్రహం కోసం భక్తకోటి తపిస్తోంది. వారందరి మదిలో అమ్మవారి గాథతో తెరకెక్కిన 'మహాకాళి'ని చూడాలన్న ఆసక్తి నెలకొంది. తెలుగులో హనుమాన్ (Hanuman) లాంటి చిత్రాన్ని రూపొందించిన ప్రశాంత్ వర్మ రచనతో 'మహాకాళి' తెరకెక్కుతోంది. ఈ సినిమాకు పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తుండగా, ఇందులో శ్రియా రెడ్డి అమ్మవారి పాత్రలో కనిపించనున్నారు. శుక్రాచార్యునిగా అక్షయ్ ఖన్నా నటించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల కానుంది. ఆ పై ఉగాది కానుకగా రానున్న రాజమౌళి వారణాసి (Varanasi) లోనూ విష్ణుతత్వం, శివతత్వం విశేషంగా కనిపిస్తాయని సమాచారం.

భక్తిమార్గంలో భారతీయ సినిమా..

ఇప్పటికే సినీ ఫ్యాన్స్ ను అలరించిన భక్తి చిత్రాలు, పురాణగాథలకు సీక్వెల్స్ కూడా సిద్ధమవుతున్నాయి. ఆ సినిమాలు కూడా రాబోయే యేడాది జనం ముందుకు వస్తాయని తెలుస్తోంది. వాటిలో 'కాంతారా' సీక్వెల్, 'కృష్ణావతారం' సీక్వెల్స్ ఉన్నాయి.. వీటితో పాటు 'హనుమాన్ అంశ్'కు కూడా రెండో భాగం ఉంటుందని వినికిడి. 'జై హనుమాన్', 'శ్రీమద్ భాగవతం', తులసీదాస్ గాథతో 'రామ్ బోలా', 'మహావతార్- పరశురామ్', పరశురాముని గాథతోనే విక్కీ కౌశల్ తో 'మహావతార్', సాయిబాబా జీవితగాథతో 'తేరా సాయి' చిత్రాలు కూడా రూపొందుతున్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే చిత్రీకరణ జరుపుకుంటూ ఉండగా, మరికొన్ని పట్టాలెక్కవలసి ఉంది. ఇంకొన్ని ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో 'భక్తి'ని కూడా ఓ ప్రధానాంశంగా జోడించడానికి మన మూవీ మేకర్స్ తపనతో ఉన్నారు. ఈ సినిమాల స్ఫూర్తితో ఇంకెన్ని చిత్రాల్లో భక్తిరసం కురుస్తుందో చూడాలి.

Updated Date - Oct 18 , 2026 | 06:59 PM