ఆ దర్శకుడితో ఫహాద్ ఫాజిల్ క్రేజీ ప్రాజెక్ట్.. బిగ్ సర్ప్రైజ్ ఎప్పుడంటే
ABN, Publish Date - Nov 22 , 2026 | 11:52 PM
విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రస్, పాన్-ఇండియా స్థాయిలో తనదైన ముద్ర వేసిన మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్, ఇప్పుడో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ నుంచి ఓ సర్ప్రైజ్ రాబోతోంది.
విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రస్, పాన్-ఇండియా స్థాయిలో తనదైన ముద్ర వేసిన మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil), హృదయాన్ని హత్తుకునే ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ (C. Prem Kumar) కాంబినేషన్లో ఓ క్రేజీ సినిమా తెరకెక్కబోతోంది. ‘96’, ‘జాను’, ‘సత్యం సుందరం’ వంటి క్లాసిక్ చిత్రాలతో తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సి. ప్రేమ్ కుమార్ రచన, దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ‘పుష్ప’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువైన ఫహాద్ ఫాజిల్, ప్రేమ్ కుమార్ మార్క్ ఎమోషనల్ కథతో రాబోతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు.
వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ‘ప్రొడక్షన్ నెం. 32’ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి సోమవారం (నవంబర్ 23) సాయంత్రం 6 గంటలకు ఒక ఎగ్జైటింగ్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్లు చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్ ద్వారా ప్రకటించింది. డాక్టర్ ఇషారి కె. గణేష్ సమర్పణలో, వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ (Vels Film International) మరియు మాన్సూన్ మూవీస్ (Monsoon Movies) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో ఫహాద్ ఫాజిల్ సరసన మలయాళ బ్యూటీ శివద (Sshivada) కథానాయికగా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ సంగీత దర్శకుడు గోవింద్ వసంత (Govind Vasantha). గతంలో ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన ‘96’, ‘సత్యం సుందరం’ చిత్రాలకు తన అద్భుతమైన సంగీతంతో ప్రాణం పోసిన గోవింద్ వసంత, మరోసారి ఈ కాంబినేషన్లో మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇక తెలుగు ప్రేక్షకులకు గుడ్ న్యూస్ ఏమిటంటే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమాను దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ తన ‘షోయింగ్ బిజినెస్’ బ్యానర్‌పై విడుదల చేయనున్నారు. గతంలో ‘ప్రేమలు’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసి ఘనవిజయం అందుకున్న కార్తికేయ, ఇటీవల ఫహాద్ ఫాజిల్ హీరోగా ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఫహాద్ ఫాజిల్ నటిస్తోన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఆయన సిద్ధమయ్యారు. మరి, సోమవారం సాయంత్రం 6 గంటలకు మేకర్స్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ప్రకటిస్తారా లేక రిలీజ్ డేట్ అప్డేట్ ఇస్తారా అనేది చూడాలి!
ఇవి కూడా చదవండి:
సంక్రాంతి పరీక్ష.. కృతి కెరీర్ మలుపు తిరుగుతుందా..
నాకు లైఫ్ ఇచ్చింది తెలుగు సినిమా ఇండస్ట్రీనే..: రకుల్
‘భోగి’ ట్రైలర్.. ఘడియలు దగ్గర పడ్డాయ్.. గంగా గాడి కోత మొదలు