Ambika: నేను నోరు తెరిస్తే.. రాధ జైలుకే
ABN, Publish Date - Sep 24 , 2026 | 07:20 AM
ఇపుడు నేను నిజాలను వెల్లడిస్తే ఆమె జైలుకు వెళ్ళాల్సి వస్తుంది’ అంటూ నటి అంబిక హెచ్చరించారు.
‘ఆస్తి వివాదం పరిష్కారం కోసం చెక్కులు ఇచ్చింది నా సోదరి రాధే. తర్వాత ఆ చెక్కులను నిలిపివేసిందీ ఆమే! ఇపుడు నేను నిజాలను వెల్లడిస్తే ఆమె జైలుకు వెళ్ళాల్సి వస్తుంది’ అంటూ నటి అంబిక (Ambika)హెచ్చరించారు. అంబిక రూ.46 కోట్లకు మోసం చేసినట్టు నటి రాధ చెన్నై నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు ఇచ్చిన విషయం తెల్సిందే.
దీనిపై అంబిక బుధవారం నగరంలో మీడియాకు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఆస్తి వివాదం పరిష్కారంలో భాగంగానే రాధ (Radha) నాకు చెక్కులు ఇచ్చారు. వీటిని బ్యాంకులో డిపాజిట్ చేయగా వాటిని రాధ వెనక్కి (బౌన్స్) పంపించారు. ఏఆర్‌ఎస్ గార్డెన్స్ ఆస్తిలో 50 సెంట్ల భూమి మోసం జరిగింది.
ఈ గార్డెన్స్ ఆస్తిలో మూడో వంతు వాటా నాకుంది. ఆస్తి, బంగారు నగల మోసం, పెండింగ్‌లో ఉన్న కేసులను దాచిపెట్టేందుకు రాధా కొత్త నాటకానికి తెరలేపారు. ఆమె ఆరోపణలు పూర్తిగా అసత్యం. ఏఆర్‌ఎస్ గార్డెన్స్ ఏర్పాటుకు ప్రధాన కారణం నేను. ఎంజీఆర్ ఇచ్చారంటూ సాగుతున్న ప్రచారంలో నిజం లేదు. ఇది నా కష్టార్జితంలో ఏర్పాటైంది. కానీ, ఇటీవల ఏఆర్‌ఎస్ గార్డెన్స్ నుంచి నా పేరును తొలగించారు. కనీసం ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు.
బంగారు ఆభరణాలంటే రాధకు అమితమైన మోజు. నా పేరుమీద ఉండే బంగారాన్ని కూడా ఆమె వద్దే ఉంచుకుంది. ఆస్తి వివాదం పరిష్కరించుకునేందుకు చెక్కులు ఇచ్చింది. ఆ తర్వాత చెక్కులు బౌన్స్ అయ్యాయి. డబ్బులు పోయాయి కనుక రాధపై నేను కేసు పెట్టి వుండాలి. ఇపుడు నేను నిజం చెప్పానంటే రాధ జైలుకు వెళ్ళే పరిస్థితి వస్తుంది. హ్యాండ్ బ్యాగ్‌కు కూడా తాళం వేసే రాధ.. సంతకం చేసిన బ్లాంక్ చెక్కులను ఇంట్లో పెట్టి వెళ్తుందా?’ అని అంబిక ప్రశ్నించారు.