‘జార్జ్ క్రిష్’ బిగ్ అప్‌డేట్.. హీరోయిన్‌గా మిస్ ఇండియా ఫిక్స్
ABN , Publish Date - Sep 24 , 2026 | 12:40 PM
చార్మింగ్ హీరో శర్వానంద్ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వస్తున్న జార్జ్ క్రిష్ సినిమాలో హీరోయిన్‌గా మానస వారణాసిని ఎంపిక చేశారు.
చార్మింగ్ హీరో శర్వానంద్ (Sharwanand), దర్శకుడు శ్రీను వైట్ల (Sreenu Vaitla) కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ జార్జ్ క్రిష్ (George Krish). తొలిసారి వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ఇందులో శర్వానంద్ సరసన హీరోయిన్‌గా మిస్ ఇండియా మానస వారణాసి (Manasa Varanasi)ని ఎంపిక చేశారు. వెండితెరపై వీరిద్దరి జోడీ చాలా కొత్తగా, చూడముచ్చటగా ఉంటుందని టీమ్ చెబుతోంది.
మిస్ ఇండియా 2020 విజేత మానస వారణాసి.. అశోక్ గల్లా హీరోగా నటించిన 'దేవకీ నందన వాసుదేవ' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ, తన సహజ నటనతో పాటు సాంప్రదాయ లుక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది.
ఆ తర్వాత వచ్చిన యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామా 'కపుల్ ఫ్రెండ్లీ' కూడా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితానికే పరిమితమైంది. దీంతో సరైన కమర్షియల్ బ్రేక్ కోసం చూస్తున్న మానసకు, ఇప్పుడు శర్వానంద్ - శ్రీను వైట్ల సినిమాలో అవకాశం రావడం నిజంగానే బంపర్ ఆఫర్. వెండితెరపై శర్వానంద్, మానస వారణాసి జోడీ చూడముచ్చటగా, సరికొత్త ఫ్రెష్ ఫీల్‌ను ఇస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇక ఈ సినిమాతో దర్శకుడు శ్రీను వైట్ల సాలిడ్ కమ్‌బ్యాక్ ఇవ్వడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో కామెడీ టైమింగ్‌తో హిస్టరీ క్రియేట్ చేసిన దర్శకుల్లో ఆయన స్థానం ప్రత్యేకం. 'ఆనందం', 'సొంతం', 'వెంకీ', 'ఢీ', 'రెడీ', 'దుబాయ్ శీను', 'దూకుడు', 'బాద్‌షా' లాంటి బ్లాక్‌బస్టర్లతో థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించిన ఘనత ఆయనది. కొంతకాలంగా సరైన సక్సెస్ లేకపోయినా, ఈసారి తనదైన మార్క్ కామెడీ పంచ్‌లు, పక్కా కమర్షియల్ హంగులతో 'జార్జ్ క్రిష్' చిత్రాన్ని పకడ్బందీగా రెడీ చేస్తున్నారు.
శర్వానంద్‌లో ఉన్న నేచురల్ కామెడీ టైమింగ్, క్లాస్-మాస్ అప్పీల్‌కు.. శ్రీను వైట్ల మార్క్ స్క్రీన్‌ప్లే తోడైతే వెండితెరపై నవ్వుల విందు ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సంక్రాంతి రేసులో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు సరైన వినోదం అందించే సినిమాకి ఆడియన్స్ ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. మరి ఈ చిత్రంతో మానస వారణాసి తన కెరీర్‌లో ఫస్ట్ కమర్షియల్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంటుందా? శర్వానంద్ - శ్రీను వైట్ల కాంబో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతోంది? అనేది వేచి చూడాలి.