ది పారడైజ్.. సోషల్ మీడియా టాక్! చూస్తే.. ఏమైపోతారో
ABN , Publish Date - Sep 24 , 2026 | 11:37 AM
నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన ప్రెస్టీజియస్ చిత్రం ది పారడైజ్ బుధవారం రాత్రి ప్రత్యేక ప్రీమియర్స్‌తో ప్రేక్షకుల ఎదుటకు వచ్చేసింది.
నాచురల్ స్టార్ నాని (nani) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన ప్రెస్టీజియస్ చిత్రం ది పారడైజ్ (the paradise). దసరా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీకాంత్ ఒదెల ( srikanth odela)తో కలిసి చేసిన సినిమా కావడంతో రిలీజ్ ముందు నుంచే అంచనాలు ఆకాశన్నంటాయి. ఈ నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్స్ సైతం అదే రేంజులో ఉండి నాని కెరీర్ బెస్ట్ ఒపెనింగ్స్ దక్కించుకుని కొత్త రికార్డులు సైతం నమోదు చేసింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి ప్రత్యేక ప్రీమియర్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల ఎదుటకు రాగా రెండు తెలుగు రాష్ట్రాలలో సినీ లవర్స్ తిలకించేశారు. మరి ఈ సినిమా గురించి సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి స్పందన వస్తుందో.. వచ్చిందో మీరూ ఓ లుక్ వేయండి.
సినిమా ఆరంభంలోనే టైటిల్ కార్ట్స్‌తో రెండు రాష్ట్రాల ప్రముఖులు, గద్దర్ వంటి వారి ఫొటోలను వాడడం, లెజండరీ యాకట్ర్ మోహన్ బాబు టైటిల్ కార్ట్ వేయడం మాత్రం ఎక్ట్రార్డనరీగా అనిపించిందని చూసిన ప్రేక్షకులు అంటున్నారు. ఆపై వెంటనే కథ నేపథ్యాన్ని తెలిపి అదే పాయింట్‌లో విలన్ మోహన్ బాబు సికంజా మాలిక్ పాత్రను పరిచయం చేయడం, ఆయన పైశాచికత్వాన్ని చూపించిన విధానం గూస్‌బంప్స్ తెప్పించే విధంగా ఉందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఆపై జడల్ ఇంటర్‌డక్షన్, బ్యాక్ స్టోరి బావున్నాయని కానీ తర్వాత నుంచే కథ గతి తప్పిందని అంటున్నారు. ఛత్రపతి, పెద్ది, బాహుబలి, పుష్ప వంటి చాలా సినిమాలను గుర్తు చేస్తుందని ట్వీట్లు చేస్తున్నారు.
ముఖ్యంగా ప్రధాన పాత్రలైన ప్రతినాయకులు మోహన్ బాబు, రాఘవ్ జుయల్ పాత్రలను అసంపూర్తిగా చిత్రీకరించారని వారి స్టామినాను సరిగ్గా వాడుకోలేక పోయారని తేల్చేస్తున్నారు. అంతేగాక సంపూర్ణేశ్ పాత్ర అర్థం పర్థం లేదని ఇక హీరోయిన్ కయాదు పాత్ర అసహాజంగానే ఉందని పెద్ది తర్వాత అదే స్థాయిలో మరలా ఇందులో కథానాయిక పాత్రను తీర్చిదిద్దడం ఎబ్బెట్టుగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. అన్నింటికంటే ప్రధానంగా అవసరం ఉన్నా లేకున్నా యాక్షన్ సన్నివేశాలు అందులో చూపించిన రక్తపాతం భరించ లేకుండా ఉన్నాయని పోస్టులు పెడుతున్నారు.
ఇక ఫ్రీ క్లైమాక్స్ సమయంలో రెండు క్యామియో సర్‌ఫ్రైజ్‌లు ఇచ్చినా అసలెందుకు ఆ పాత్రలు ఉన్నాయని అనుకుంటున్నారు. అంతేగాక స్క్రీన్ ప్లే అస్తవ్యస్తంగా ఉండి ఏ పాత్ర ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది అని తెలియకుండా వాటికి ఓ జస్ట్‌ఫికేషన్ అనేదే ఇవ్వలేదని అంటున్నారు. మదర్ , సన్ సెంటిమెంట్ బాగానే ఉన్నప్పటికీ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవలేదని చెబుతున్నారు. అనిరుధ్ సంగీతం పాటల వరకు మాత్రమే బావుందని మిగతా టైంలో సహానానికి పరీక్ష పెట్టేలా ఉందని, కొన్ని సందర్భాల్లో డైలాగ్స్ అసలు వినిపించలేదని చెబుతున్నారు. మొత్తంగా చెప్పాలంటే మొదటి సగం ఓ మోస్తరుగా నడిచినా రెండో సగం మాత్రం టాక్సిక్ అనేలా ఉందని అంటున్నారు.