రూ.5 లక్షల మోసం.. బిగ్‌బాస్ వర్షిణి అరెస్టు
ABN , Publish Date - Sep 24 , 2026 | 09:29 AM
సినీ. ఫైనాన్షియర్‌ను బెదిరించిన కేసులో మోడల్, బిగ్‌బాస్ ఫేం వర్షిణి వెంకట్ ను పోలీసులు అరెస్టు చేశారు.
నగదు మోసం, తన స్నేహితుడితో సినీ. ఫైనాన్షియర్‌ను బెదిరించిన కేసులో మోడల్, బిగ్‌బాస్ (Bigg Boss) ఫేం వర్షిణి వెంకట్ (Varshini Venkat) ను పోలీసులు అరెస్టు చేశారు. వరుణ్ అనే సినీ ఫైనాన్షియర్ గిండి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఓ షార్ట్ ఫిలిం నిర్మాణం కోసం వర్షిణి ఓ రోజు వరుణ్‌ను డబ్బులు అడగ్గా ఆయన నిరాకరించారు. ఆ తర్వాత తన స్నేహితులతో వరుణ్ ఉండే హోటల్ గదికి వచ్చి బెదిరించారు. పైగా వరుణ్‌తో కలిసి ఉన్న ఫొటోలను చూపించడంతో ఆ రోజు రూ.50 వేలు ఇచ్చి పంపించారు.
ఆంతటితో ఆగని వర్షిణి తర్వాత వరుణ్‌కు ఫోన్ చేసి తనతో సన్నిహితంగా ఉన్నందుకు రూ.3 లక్షలు, ఈ వ్యవహారంలో పంచాయతీ చేసిన తన స్నేహితుడు సంజయ్‌కు రూ.2 లక్షలు ఇవ్వాలని బెదిరించారు. దీంతో ఈ సమస్య కాస్త పెద్ద గొడవకు దారి తీయడంతో.. ఈ ఇష్యూను పరిష్కరించుకునేందుకు వర్షిణి అడిగిన రూ.5 లక్షలు బ్యాంకు ఖాతాకు బదిలీ చేశారు. కానీ ఆ తర్వాత మరో మారు రూ.27 లక్షలు ఇవ్వాలంటూ రెండు రోజుల క్రితం బెదిరించారు.
ఇంత మొత్తంలో డబ్బు ఇవ్వడానికి నిరాకరించిన ఫైనాన్షియర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో వర్షిణి ఆమె స్నేహితులతో కలిసి చేసిన మోసం నిజమే అని తేలడంతో ఆమెపై కేసు నమోదు చేసి, ఆరెస్టు చేశారు. అలాగే పరారీలో ఉన్న ఆమె స్నేహితులైన వెంకట్, సంజయ్ సహా ముగ్గురి కోసం గాలిస్తున్నారు. కాగా, వర్షిణీ అధికార టీవీకే మహిళా కార్యకర్త కాగా, ఫైనాన్షియర్ ఏపీకి చెందిన వ్యక్తి అని తెలిసింది.