రిసార్ట్ సీజ‌న్‌2.. ముస్తాబ‌వుతోంది

ABN , Publish Date - Sep 07 , 2026 | 04:59 PM

రిసార్ట్ వెబ్ సీరిస్‌ తొలి సీజన్‌ పూర్తయ్యింది. వారానికి నాలుగు ఎపిసోడ్స్ చొప్పున సీజన్ 1లో వంద ఎపిసోడ్స్ ను ప్రసారం చేశారు. అతి త్వరలోనే సీజన్ 2 షూటింగ్‌ కూడా మొదలు కానుంది.

Resort Web Series

ఈ మధ్య కాలంలో వీక్షకులు బాగా కనెక్ట్ అయి, ఆదరించిన వెబ్ సీరిస్‌ 'రిసార్ట్'. బేసికల్‌గా ఇది తమిళ వెబ్ సీరిస్‌ అయినా... జియో హాట్ స్టార్ పలు భాషల్లో దీనిని అనువదించి, ఒకేసారి ప్రసారం చేస్తూ వచ్చింది. ఈ యేడాది మార్చి 13న మొదలైన 'రిసార్ట్స్' వెబ్ సీరిస్‌ ప్రతి శుక్రవారం నాలుగు ఎపిసోడ్స్ చొప్పున స్ట్రీమింగ్‌ అయ్యేది. అలా మొదటి సీజన్ కు సంబంధించిన వంద ఎపిసోడ్స్ ఆగస్ట్ చివరి వారంతో పూర్తయ్యాయి.

తమిళనాడులోని ఓ పల్లెటూరి నుంచి చెఫ్‌ అవుదామని మహాబలిపురం వచ్చిన వెట్రీ అనే కుర్రాడి కథ ఇది. తండ్రి అప్పులు చేసి కుటుంబాన్ని నడి రోడ్డు మీద వదిలి పెట్టి మాయం అయిపోతే... తల్లిని, చెల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ తన జీవితాశయం వైపు వెట్రీ ఎలా సాగాడన్నదే ఈ వెబ్ సీరిస్ కథాంశం. ఈ కథంతా మహాబలిపురంలోని ఓ లగ్జరీ బీచ్ రిసార్ట్ లో జరుగుతుంటుంది. అక్కడ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌ నెడుమారన్ నుంచి వెట్రీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? గతంలో తన తండ్రితో పరిచయం ఉన్నా... నెడుమారన్ దానిని ఎందుకు కప్పిపుచ్చాడనేది ఇందులోని అసలు మిస్టరీ!


'రిసార్ట్‌'లో ప్రధాన పాత్రలు పోషించిన వారిలో తలైవాసల్ విజయ్‌ ఒక్కడే కాస్తంత పరిచయం ఉన్న నటుడు. అలానే తొలి సీజన్ చివరిలో నటుడు ఎలంగో కుమరవేల్‌ ఎంట్రీతో వెబ్ సీరిస్‌ మరింత ఊపందుకుంది. అయితే అందరూ ఊహించినట్టుగానే వెట్రీ స్టార్ చెఫ్‌ అవడంతో తొలి సీజన్‌ ముగిసింది. కానీ వీక్షకులు ఊహించని అసలు ట్విస్ట్ ను దర్శకుడు ప్రవీణ్‌ బెన్నెత్‌... నెడుమారన్ పాత్ర ద్వారా ఇచ్చాడు. నెడుమారన్‌ ఆర్.ఆర్. రిసార్ట్స్ నుంచి వెళ్ళిపోవడంతో అది కాస్త డోల్డ్రమ్స్ లో పడుతుంది. దానిని ఎలా నిలబెట్టుకోవాలా? అని దాని ఓనర్ రఘుపతి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు. ఇదే సమయంలో నెడుమారన్‌ తనకు తెలిసిన వ్యక్తి ద్వారా ఆర్.ఆర్. రిసార్ట్స్ షేర్స్ ను అత్యధిక శాతంలో కొనిపించి, అదే రిసార్ట్స్ కు సీఈవోగా వస్తాడు. మొదటి సీజన్‌ ముగింపులో దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్ ఇది. నెడమారన్‌ రీ-ఎంట్రీతో ఆర్.ఆర్. రిసార్ట్స్ లోని ఎంప్లాయిస్‌ మాత్రమే కాదు... ఈ వెబ్ సీరిస్ ను ఫాలో అవుతున్న వీక్షకులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. దాంతో అసలు కథంతా రెండో సీజన్‌లోనే ఉండబోతోందనే విషయం వారికి అర్థమైంది. వెట్రీ తండ్రి ఆచూకీని ఇంకా తెలుసుకోకపోవడం, స్టార్ చెఫ్‌ అయినా ఇంకా రూమ్ సర్వీస్ బాయ్ గానే రిసార్ట్ లో పనిచేస్తుండటం, ఐశ్వర్యతో అతని ప్రేమ ఇంకా ఫలప్రదం కాకపోవడం... ఇవన్నీ కూడా సీజన్ 2 కోసం దాచిపెట్టిన అంశాలు.


తొలి సీజన్ వంద ఎపిసోడ్స్ పూర్తి కాగానే అందులోని నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ అనుభవాలను మనసు విప్పి చెప్పారు. తాత్కాలికంగా వీడ్కోలు పలుకుతున్నందుకు బాధ పడ్డారు. అయితే అతి త్వరలోనే 'రిసార్ట్' సీజన్ 2 షూటింగ్‌ మొదలు కాబోతోంది. కొన్ని ఎపిసోడ్స్ ను సిద్థం చేసుకుని, వచ్చే యేడాది ఏప్రిల్ నుంచి 'రిసార్ట్' సీజన్ 2 ప్రసారం ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు ప్రవీణ్‌ బెన్నెత్‌ తెలియచేశారు.

రచన, దర్శకత్వ శాఖల్లో పనిచేసిన నటుడు విజయ్‌ కుమార్ రాజేంద్రన్ ఈ వెబ్ సీరిస్ లో హీరోగా నటించగా, అభినయ నేత్రన్ కథానాయికగా నటించింది. ఇతర ప్రధాన పాత్రలను తలైవాసల్ విజయ్‌, గంజా కరుప్పు, బడవ గోపి, ఎలంగో కుమరన్, సాయిధన్య, కవిప్రియ జయవేల్‌, ప్రియాకృష్ణన్, దర్శన శ్రీపాల్‌, విష్ణుబాలా, లల్లు, అమర్ కీర్తి, సౌందర్య శరవణన్ తదితరులు పోషించారు. వెబ్ సీరిస్‌ మొత్తం ఓ రిసార్ట్స్ లోనే జరిగినా, కెమెరా పనితనం, నేపథ్య సంగీతం, ఎడిటింగ్ కారణంగా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోయింది. మరి సీజన్‌ 2తో ఈ వెబ్ సీరిస్ ఇంకెంత క్రేజ్ ను సంపాదించుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

Bipasha Basu: ఎనిమిదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత వస్తోన్న బ్లాక్ బ్యూటీ 

Varanasi: రాజమౌళి ఎక్క‌డా.. త‌గ్గ‌డం లేదుగా

January 12 Vidudala: అనిల్ రావిపూడికి.. కొత్త టెన్ష‌న్‌!

ఇక‌.. ఒక్క‌రైనా సీట్లో కూర్చుంటే ఒట్టు

Updated Date - Sep 07 , 2026 | 06:41 PM