Bipasha Basu: ఎనిమిదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత వస్తోన్న బ్లాక్ బ్యూటీ 

ABN , Publish Date - Sep 07 , 2026 | 10:10 AM

బాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి బిపాసా బసు(Bipasha basu).. ఇప్పుడు మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.

బాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి బిపాసా బసు(Bipasha basu).. ఇప్పుడు మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. సినిమాలకు దాదాపు ఎనిమిదేళ్ల పాటు దూరంగా ఉన్న ఆమె.. తాజాగా ఓ విభిన్నమైన కథతో రీ-ఎంట్రీకి రెడీ అయ్యారు. ప్రముఖ దర్శకుడు హన్సల్ మెహతా (Hansal Mehtha) తెరకెక్కిస్తున్న పీరియాడికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘బారాబంకి’లో బిపాసా బసు కీలక పాత్రలో కనిపించనున్నారు.

1984లో చోటుచేసుకున్న యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. క్రైమ్, డ్రామా అంశాలను మేళవిస్తూ ఆ కాలం నాటి పరిస్థితులను తెరపై ఆవిష్కరించేలా దర్శకుడు హన్సల్ మెహతా కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ప్రధాన తారాగణంతో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది.

ఈ సినిమాలో బిపాసా బసుతో పాటు యువ నటులు సన్నీ కౌశల్, విశాల్ జేత్వా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. సీనియర్ నటి అనుభవం, యువ నటుల ఎనర్జీ, హన్సల్ మెహతా విభిన్నమైన మేకింగ్ కలిసి ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిని పెంచుతున్నాయి.

మాతృత్వం కోసం సినిమాలకు దూరం

బిపాసా బసు చివరిసారిగా 2015లో విడుదలైన ‘అలోన్’ చిత్రంలో హీరోయిన్‌గా కనిపించారు. ఆ తర్వాత సినిమాల్లో ఆమె కనిపించలేదు. 2016లో నటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌ను వివాహం చేసుకున్న బిపాసా.. అనంతరం వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించారు.

2022లో ఈ దంపతులకు కుమార్తె జన్మించింది. మాతృత్వాన్ని పూర్తిగా ఆస్వాదించేందుకు బిపాసా సినిమాలకు మరింత దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమె ఫ్యాన్స్ కూడా బిపాసా రీ-ఎంట్రీ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆమె మరోసారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Updated Date - Sep 07 , 2026 | 10:34 AM