‘దాయరా’ రివ్యూ: న్యాయం, ప్రతీకారం మధ్య నైతిక సంఘర్షణ
ABN , Publish Date - Nov 29 , 2026 | 10:20 PM
రెండు నైతికతల మధ్య జరిగే యుద్ధంలో ఏది ఓడినా ఏది గెలిచినా మిగిలేది విషాదమే. న్యాయానికీ ప్రతీకారానికీ మధ్య సన్నని విభజనరేఖ అస్పష్టంగా ఉంటుంది. అదే ‘దాయరా’. అంటే.. హద్దు అని అర్థం.
దాయరా (హిందీ)
నటీనటులు: పృథ్వీరాజ్ సుకుమారన్, కరీనా కపూర్, రాగిణి పుజారి తదితరులు
దర్శకత్వం: మేఘనా గుల్జార్
నిడివి: 143 నిమిషాలు
విడుదల: నెట్‌ఫ్లిక్స్
రెండు నైతికతల మధ్య జరిగే యుద్ధంలో ఏది ఓడినా ఏది గెలిచినా మిగిలేది విషాదమే. న్యాయానికీ ప్రతీకారానికీ మధ్య సన్నని విభజనరేఖ అస్పష్టంగా ఉంటుంది. అదే ‘దాయరా’ (Daayra). అంటే.. హద్దు అని అర్థం. ఒక అత్యాచారానికీ ఒక సీన్ రీకన్స్ట్రక్షన్ తీర్పుకీ మధ్య జరిగే ఘర్షణలో చట్టం ఓడిపోతే న్యాయం గెలిచినట్టేనా? నేరస్తులను చంపడం న్యాయమా? నేరస్తులను చంపినవాళ్లను ప్రశ్నించడం అన్యాయమా? ఈ రెండు ప్రశ్నల మధ్య ఒక దేశపు న్యాయవ్యవస్థ, ప్రజల ఆవేశం, పోలీసుల బాధ్యతా రాహిత్యం, బాధితుల వేదన, రాజ్యాంగ నైతికత అన్నీ ఒకదానితో ఒకటి పడే ఘర్షణే ‘దాయరా’.
ఒక నేరం జరుగుతుంది. సమాజం ఉలిక్కి పడుతుంది. ప్రజలు ఆగ్రహిస్తారు. పోలీసులు నిందితులను పట్టుకుంటారు. ఒకరోజు తెల్లవారేసరికి ఆ నిందితులంతా ఎన్‌కౌంటర్లో చనిపోతారు. దేశం సంబరాలు చేసుకుంటుంది. మనిషికి హద్దులుంటాయి. అధికారానికి హద్దులుంటాయి. చట్టానికి పరిధులుంటాయి. కానీ ఆగ్రహానికి హద్దులుంటాయా? అసలు న్యాయానికి హద్దులుండాలా? ఈ ప్రశ్నలను సినిమా ప్రేక్షకుడి ముందుంచుతుంది.
ఒక యువతిపై సామూహిక అత్యాచారం జరుగుతుంది. ఆమెను హత్య చేస్తారు. ఈ దారుణం దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రగిలిస్తుంది. డీసీపీ రమణ్ కుమార్ నేతృత్వంలోని పోలీసు బృందం నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌లో చంపేస్తుంది. ప్రజలు రమణ్‌ను హీరోగా కీర్తిస్తారు. అతని మీద పూలవర్షం కురుస్తుంది. అయితే ఆ ఎన్‌కౌంటర్ నిజమైన ఆత్మరక్షణ చర్యా? ముందస్తు ప్రణాళికతో జరిగిన హత్యా? ఈ అనుమానాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పడుతుంది. దానికి డీసీపీ అజూనీ నాయకత్వం వహిస్తుంది. రమణ్ దృష్టిలో తాను చేసింది న్యాయం. అజూనీ దృష్టిలో న్యాయం పేరుతో చట్టాన్ని అతిక్రమించడం మరో నేరం. ఇద్దరూ పోలీసులే. ఇద్దరికీ న్యాయంపై నమ్మకముంది. కానీ న్యాయాన్ని అర్థం చేసుకునే పద్ధతులు వేరు. ఒకరు నేరానికి తక్షణ శిక్ష కావాలనుకుంటారు. మరొకరు శిక్షకు ముందు చట్టబద్ధమైన విచారణ జరగాలంటారు. ఈ రెండు దృక్పథాల మధ్య జరిగే సంఘర్షణే సినిమా. ఈ కథకు 2019లో హైదరాబాద్లో జరిగిన అత్యాచారం, హత్య, అనంతర పోలీసు ఎన్‌కౌంటర్ ఘటన నేపథ్యం.
నేరం జరిగిన వెంటనే మనిషికి కోపం వస్తుంది. ఆ తర్వాత పగతీర్చుకోవాలనిపిస్తుంది. ఆ రెండింటినీ నియంత్రించడానికి ఏర్పడిన నాగరిక వ్యవస్థే న్యాయవ్యవస్థ, అంటే న్యాయమంటే ఆగ్రహం లేకపోవడం కాదు. ఆగ్రహాన్ని వివేచనతో నియంత్రించడం. రమణ్ పాత్రను ఆవేశపరుడైన పోలీసుగా మాత్రమే కాకుండా.. స్త్రీలపై జరుగుతున్న నేరాలను సహించలేని వ్యక్తిగా చిత్రించడం వల్ల ప్రేక్షకుడికి అతడి పట్ల సానుభూతి కలుగుతుంది. న్యాయవ్యవస్థ వైఫల్యాన్ని విమర్శించడం వేరు. ఆ వైఫల్యానికి ప్రత్యామ్నాయంగా చట్టవిరుద్ధ హత్యలను పరోక్షంగా సమర్థించడం వేరు. ఈ రెండింటి మధ్య స్పష్టమైన నైతిక దూరాన్ని ఈ సినిమా ఉత్కంఠగా చర్చించింది.
మన సమాజానిది ఒక విచిత్రమైన నైజం. న్యాయస్థానాలు తీర్పులు చెప్పడానికి సంవత్సరాలు పడుతుంది. పోలీసులు నిమిషాల్లో తీర్పులు అమలు చేస్తున్నారు. ప్రజలు న్యాయస్థానాలకన్నా పోలీసులనే ఎక్కువగా అభినందిస్తున్నారు. ఇది కేవలం పోలీసుల మీద నమ్మకం పెరగడం కాదు. న్యాయవ్యవస్థ జాప్యతకు కూడా సంకేతం. ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు ప్రజలు చేసుకునే సంబరాలు వారి క్రూరత్వం కాదు. ఆ సంబరాల వెనుక భయం ఉంది. అభద్రత ఉంది. న్యాయం జరగదన్న నిరాశ ఉంది.
అయితే ప్రజల ఆవేశాన్ని రాజ్యాంగ న్యాయంగా మార్చడం ప్రమాదకరం. ఒకసారి చట్టానికి అతీతంగా చంపే అధికారాన్ని సమర్థిస్తే, రేపు ఆ అధికారం ఎవరిని లక్ష్యంగా చేసుకుంటుందో చెప్పలేం. ఇవాళ అత్యాచార నిందితుడు. రేపు రాజకీయ ప్రత్యర్థి. ఎల్లుండి నిరసనకారుడు. ఎవరైనాకావచ్చు. న్యాయ వ్యవస్థలోని జాప్యం, లోపాలు, అసమర్థతలను సరిదిద్దడానికి ప్రయత్నించకుండా ఎన్‌కౌంటర్‌ను పరిష్కారంగా చూడడం అంటే వ్యాధికి చికిత్స చేయకుండా రోగిని చంపేయడమే. రమణ్, అజూనీ ఇవి రెండు పాత్రలు కాదు, రెండు నైతిక ప్రపంచాలు. పృథ్వీరాజ్ వ్యవస్థలో పనిచేస్తాడు. కానీ వ్యవస్థ మీద పూర్తి విశ్వాసం ఉండదు. చట్టాన్ని కాపాడే బాధ్యత అతనిది. కానీ చట్టం న్యాయాన్ని అందించలేక పోతున్నదనే కోపానికి అతను ప్రతిరూపం.
అజూనీ మరో నైతిక ప్రపంచానికి ప్రతినిధి. ఆమెకు నేరస్తుల మీద సానుభూతి లేదు. కానీ నిందితుల హక్కులకూ న్యాయప్రక్రియకూ మధ్య సంబంధాన్ని గుర్తిస్తుంది. న్యాయాన్ని అందించడానికి న్యాయవ్యవస్థనే ధ్వంసం చేయకూడదన్నది ఆమె విశ్వాసం. ఈ రెండు పాత్రల మధ్య సంఘర్షణ సినిమాకు కీలకం. ఇద్దరి వాదనలూ సమతూకంతో వినిపించినప్పుడే ప్రేక్షకుడిలో నిజమైన నైతిక సంక్షోభం ఏర్పడుతుంది. కానీ రమణ్ పాత్రకు ఇచ్చిన భావోద్వేగ బలాన్ని అజూనీ పాత్రకు ఇవ్వలేదు దర్శకురాలు మేఘనా గుల్జార్. న్యాయం ఆలస్యమైతే అది అన్యాయం కావచ్చు. కానీ న్యాయప్రక్రియ లేకుండా విధించే శిక్షను న్యాయమని పిలవడం అంత కన్నా పెద్ద అన్యాయం. ‘దాయరా’ మనకు గుర్తుచేసే ముఖ్యమైన విషయం ఇదే.
-ప్రసేన్
70133 58154
ఇవి కూడా చదవండి:
‘సెక్యూరిటీ’.. లక్షలు, కోట్లు వెచ్చిస్తోన్న స్టార్స్
పరభాషా నాయకులు.. ప్రతిభకు పట్టం కట్టడంలో తెలుగువారే టాప్
‘ఆకాశంలో ఒక తార’ టీమ్‌కు చిరు, చరణ్ అభినందనలు