పరభాషా నాయకులు.. ప్రతిభకు పట్టం కట్టడంలో తెలుగువారే టాప్

ABN , Publish Date - Nov 29 , 2026 | 08:11 PM

తెలుగు సినిమాల్లోనే సక్సెస్ సాధిస్తూ సాగుతోన్న దుల్కర్ సల్మాన్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ రాసేస్తున్నారు మనవాళ్ళు.. ఆ మాటకొస్తే ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ప్రతిభకు పట్టం కట్టడంలో ముందున్నారు మన తెలుగు సినీజనం.

Non Telugu Heroes in Tollywood

తెలుగు సినిమాల్లోనే సక్సెస్ సాధిస్తూ సాగుతోన్న దుల్కర్ సల్మాన్‌ (Dulquer Salmaan)ను ఆకాశానికి ఎత్తేస్తూ రాసేస్తున్నారు మనవాళ్ళు.. ఆ మాటకొస్తే ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ప్రతిభకు పట్టం కట్టడంలో ముందున్నారు మన తెలుగు సినీజనం. ఆ తీరున ఎందరు పరభాషా నాయకులు తెలుగు చిత్రసీమలో రాణించారో చూద్దాం.

‘ఆకాశంలో ఒక తార’ (Aakasamlo Oka Tara) సినిమా సక్సెస్ రూటులో ముందుకు సాగుతోంది. ఈ సినిమాతో దుల్కర్ సల్మాన్ జాబితాలో మరో హిట్ చేరింది. కొన్నేళ్ళుగా దుల్కర్ తన మాతృభాష మళయాళంలో సక్సెస్ సాధించలేక పోతున్నారు. అయితే తెలుగులో మాత్రం దుల్కర్ నటించిన ‘మహానటి, సీతా రామం, లక్కీ భాస్కర్’ చిత్రాలు, ఇప్పుడు ‘ఆకాశంలో ఒక తార’ సక్సెస్ సాధించాయి. దీంతో దుల్కర్‌కు తెలుగునాట విశేషమైన క్రేజ్ ఉందని, అందువల్లే అతనికోసం ప్రత్యేకంగా కథలు రూపొందిస్తున్నారని సినీజనం అంటున్నారు. ఇక తెలుగు మీడియా దుల్కర్‌ను ఆకాశానికి ఎత్తేస్తోంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి పరభాషా నటుడు లేనే లేడనీ కొందరి మాట.


కమల్ తీరే వేరు...

దుల్కర్‌కు తెలుగులో వరుస విజయాలు లభిస్తున్నాయి కాబట్టి, ఈ అభినందనలకు అతను అర్హుడే..! అయితే దుల్కర్ కంటే ముందే ఎంతోమంది పరభాషా కథానాయకులు తెలుగు చిత్రాల్లోనూ నటించి సక్సెస్ సాధించారు. తెలుగు సినిమా స్వర్ణయుగం చవిచూస్తున్న రోజుల్లోనే నాటి మేటి తమిళ నటుడు శివాజీగణేశన్ (Sivaji Ganesan) మన చిత్రాల్లో నటించి మురిపించారు. ఇక కమల్ హాసన్ తెలుగువారిని విశేషంగా ఆకట్టుకున్నారు. నిజం చెప్పాలంటే ఆ స్థాయిలో తెలుగు చిత్రాల ద్వారా సక్సెస్ చూసిన మరో తెలుగేతర కథానాయకుడు కనిపించరు. ఆయన హీరోగా రూపొందిన తెలుగు చిత్రాలు ‘మరోచరిత్ర, సాగరసంగమం’ రెండూ 500 రోజులకు పైగా ప్రదర్శితమై రికార్డ్ సృష్టించాయి. కమల్ హాసన్ (Kamal Haasan) తమిళ చిత్రాలు సైతం ఈ తీరున ఆడిన దాఖలాలు లేవు. ఇక కమల్ డైరెక్ట్‌గా నటించిన అనేక తెలుగు చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఆ మాటకొస్తే తమిళంలో హిట్టయిన కమల్ సినిమాలను కొన్ని మార్పులూ చేర్పులతో తెలుగులో రీమేక్ చేసిన సందర్భాలూ ఉన్నాయి.

రజనీకాంత్ సైతం...

రజనీకాంత్ (Rajinikanth) సైతం తెలుగు చిత్రాల్లో హీరోగా నటించి అలరించాకే, తమిళనాట స్టార్‌గా వెలిగారు. అందువల్లే సూపర్ స్టార్ అయిన తరువాత కూడా తనకు వీలైనపుడు రజనీకాంత్ తెలుగు చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్ డబ్బింగ్ సినిమాలకు సైతం తెలుగునేలపై విశేషాదరణ లభించడానికి కారణం - వారికి తెలుగు చిత్రసీమతో ఉన్న అనుబంధమే అని చెప్పక తప్పదు.


సుమన్ అపూర్వ విజయాలు

ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టం కట్టడంలో ముందుంటారు తెలుగువారు అని ఏ నాటి నుంచో రుజువవుతూ వస్తోంది. 1980ల మధ్య కాలంలో తెలుగేతరుడైన సుమన్ (Suman) తెలుగు చిత్రాల్లో హీరోగా సాధించిన విజయాలు అపురూపమైనవి. సుమన్ తెలుగులో నటించిన తొలి చిత్రం ‘తరంగిణి’ స్వర్ణోత్సవం చూసింది. ఆ తరువాత ఆయన హీరోగా రూపొందిన ‘నేటి భారతం’ సైతం గోల్డెన్ జూబ్లీ జరుపుకుంది. సుమన్ సినిమాల రన్నింగ్ చూసి తెలుగు స్టార్స్ సైతం ఆశ్చర్యపోయారు. తనను ఆదరించిన తెలుగు చిత్రసీమనే నమ్ముకొని సుమన్ ఇక్కడే స్థిరపడ్డారు. ఇప్పటికీ తెలుగు చిత్రాలతోనే ఆయన సాగుతున్న తీరు అందరికీ తెలిసిందే.

Rajasekhar.jpg

‘యాంగ్రీ మేన్’ రాజశేఖర్..

సుమన్ లాగే అలరించిన మరో పరభాషా కథానాయకుడు రాజశేఖర్ (Rajasekhar). తెలుగు చిత్రాలతోనే రాజశేఖర్ స్టార్ హీరోగా జేజేలు అందుకున్నారు. ‘యాంగ్రీ యంగ్ మేన్’ ఇమేజ్‌తో ప్రేక్షకులను విశేషంగా అలరించారు రాజశేఖర్. తన హిట్ పెయిర్ - తెలుగమ్మాయి జీవితను అర్ధాంగిగా చేసుకొని తెలుగునాటనే స్థిరపడిపోయారు రాజశేఖర్. ఆయన హీరోగా నటించిన అనేక చిత్రాలు తెలుగువారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం రాజశేఖర్ విలక్షణమైన పాత్రలతో అలరిస్తోన్నారు.


Prakash-raj.jpg

ఆదరించడమే తెలుసు..

యాక్షన్ కింగ్ అర్జున్ (Action King Arjun), వినోద్ కుమార్ (Vinod Kumar) వీళ్లంతా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందినవారే. ఇంకా కన్నడనాట కన్నుతెరచిన ప్రకాశ్ రాజ్ తమిళ చిత్రాలలో ఎంతగా రాణించినా, ఆయనను విలక్షణ నటునిగా తీర్చిదిద్దింది తెలుగు సినిమాలే. ఇక్కడ కేరెక్టర్ యాక్టర్‌గా స్టార్ డమ్ చూశారు ప్రకాశ్ రాజ్ (Prakash Raj). ఆయన కూడా కొన్ని తెలుగు చిత్రాల్లో హీరోగానూ నటించి ఆకట్టుకున్నారు. ఇక విలన్స్‌గా, కమెడియన్స్‌గా, కేరెక్టర్ యాక్టర్స్‌గా ఎందరో తెలుగేతరులు టాలీవుడ్‌లో సక్సెస్ రూటులో సాగారు. ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో సదా ముందుండే తెలుగువారు ఇప్పుడు దుల్కర్‌ను అక్కున చేర్చుకున్నారు. మునుముందు ఇంకా ఎందరు పరభాషా కథానాయకులు తెలుగు చిత్రసీమలో వెలుగులు పంచుతారో చూడాలి.

ఇవి కూడా చదవండి:

‘ఆకాశంలో ఒక తార’ టీమ్‌కు చిరు, చరణ్ అభినందనలు

నటుడిగా సుధాకర్ తనయుడు బన్నీ ఎంట్రీ.. చిరు ఇచ్చిన సలహా ఇదే

‘అలియాస్ రుక్మిణీ’లో నితిన్‌ని చూసి నేనే ఆశ్చర్యపోయా: నాని

Updated Date - Nov 29 , 2026 | 08:11 PM

Rajinikanth in Hyderabad: హైదరాబాదులో రజనీకాంత్ సందడి, దేనికోసమంటే...

Kamal Haasan : తమ్ముడూ... నిన్ను చూసి గర్విస్తున్నా

Dulquer Salmaan: గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా బ్యానర్స్‌లో దుల్కర్ సినిమా.. టైటిల్ ఏంటంటే?

Aakasamlo Oka Tara: దుల్కర్ సినిమాలో బిజిలీగా..

Suman: అదే నాకు భారతరత్న..