సయామీ ఖేర్ ఇంటర్నేషనల్ ఎంట్రీ.. ఇండో-రష్యన్ ప్రాజెక్ట్‌లో క్రేజీ రోల్
ABN , Publish Date - Oct 28 , 2026 | 04:55 PM
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సయామీ ఖేర్. ఇప్పుడీ భామ ఓ అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లో క్రేజీ రోల్ చేస్తున్నారు.
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సయామీ ఖేర్ (Saiyami Kher). ‘రేయ్’ చిత్రంతో వెండితెరకు పరిచయమై, ‘ఘూమర్’లో దివ్యాంగురాలైన క్రికెటర్‌గా అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆమె.. ఇటీవల అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘హైవాన్’ చిత్రంలోనూ మెప్పించారు. తాజాగా ఈ టాలెంటెడ్ బ్యూటీ తన కెరీర్‌లో మరో సరికొత్త మైలురాయిని అందుకోనున్నారు. అంతర్జాతీయ చలనచిత్ర రంగంలోకి అడుగుపెడుతూ.. ఓ ప్రతిష్టాత్మక ఇండో-రష్యన్ చిత్రం (Indo-Russian drama)లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
రష్యన్ దర్శకుడు మాగ్జిమ్ కుజ్నెత్సోవ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పూర్తిగా ఎమోషనల్ డ్రామా నేపథ్యంలో సాగనుంది. కార్తీనా ఎంటర్‌టైన్‌మెంట్, వైట్ నైట్ ఫిల్మ్స్, విష్ మీడియా సంస్థలు సంయుక్తంగా ఈ క్రాస్-కల్చరల్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం కోసం సయామీ మొదటిసారి రష్యాలో అడుగుపెట్టారు. మాస్కో పరిసరాల్లోని అందమైన లొకేషన్లలో కీలక సన్నివేశాల చిత్రీకరణను ఇప్పటికే పూర్తి చేశారు. సినిమా కథాంశానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం బయటకు రాకుండా చాలా రహస్యంగా ఉంచుతున్నారు. అయినప్పటికీ విభిన్న సంస్కృతుల కలయికతో.. ప్రపంచవ్యాప్తంగా సినిమా భాషను ఆవిష్కరించే అద్భుతమైన కథనంతో ఇది రూపొందుతోందని మాత్రం తెలుస్తోంది.
ఈ అంతర్జాతీయ అనుభవంపై సయామీ ఖేర్ స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ‘‘పూర్తిగా విదేశీ సాంకేతిక నిపుణులతో పనిచేయడం నాకు సరికొత్త, అద్భుతమైన అనుభూతినిచ్చింది. మాస్కో చాలా అందంగా ఉంది, అక్కడ షూటింగ్ అనుభవం మర్చిపోలేను. భారతీయ సినీ పరిశ్రమకు, అక్కడి వర్కింగ్ కల్చర్‌కు చాలా తేడా కనిపించింది. వివిధ సంస్కృతులకు చెందిన వ్యక్తులతో కలిసి పనిచేసినప్పుడు కథలు చెప్పే విధానంపై సరికొత్త దృక్పథం ఏర్పడుతుంది. సినిమాను వాళ్లు చూసే కోణం నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం దక్కింది. అంతర్జాతీయ స్థాయిలో నాకు ఇదే మొదటి ప్రాజెక్ట్ అయినప్పటికీ, భవిష్యత్‌లో మరిన్ని గ్లోబల్ ప్రాజెక్టులు చేసేందుకు ఇది మంచి శ్రీకారమవుతుందని ఆశిస్తున్నాను’’ అని ఆమె పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
ఇంకొన్ని గంటల్లో ఓటీటీకి ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’.. వివరాలివే
‘ఫౌజీ’ గ్లింప్స్‌పై నేతాజీ మనవడి ఆగ్రహం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్
సౌందర్య అంత అందంగా ఉండేది కాబట్టే.. దేవుడు తీసుకెళ్లిపోయాడు: ఆమని