Dhoomakethu: ఫస్ట్ నైట్ రోజే వరుడు చనిపోయి తిరిగి లేస్తే.. ఇదేం సినిమరా బాబు
ABN , Publish Date - Oct 26 , 2026 | 05:39 PM
సౌత్ ఇండస్ట్రీలో టైమ్ లూప్ కథలు చాలా తక్కువ. కానీ, వచ్చిన ప్రతిసారీ హిట్ అవ్వడం పక్కా. ఇప్పటికే మానాడు, మార్క్ ఆంటోనీ లాంటి సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా ఆ లిస్ట్ లో చేరింది మలయాళం ఫాంటసీ కామెడీ చిత్రం ధూమకేతు (Dhoomakethu).
సౌత్ ఇండస్ట్రీలో టైమ్ లూప్ కథలు చాలా తక్కువ. కానీ, వచ్చిన ప్రతిసారీ హిట్ అవ్వడం పక్కా. ఇప్పటికే మానాడు, మార్క్ ఆంటోనీ లాంటి సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా ఆ లిస్ట్ లో చేరింది మలయాళం ఫాంటసీ కామెడీ చిత్రం ధూమకేతు (Dhoomakethu). నైమర్ వంటి వినోదాత్మక చిత్రం తర్వాత దర్శకుడు సుధి మాడిసన్ తెరకెక్కించిన ఈ సినిమాలో సజిన్ గోపు, నిఖిలా విమల్ జంటగా నటించగా, షైన్ టామ్ చాకో విలన్ గా కనిపించాడు. నెట్ ఫ్లిక్స్ లో అక్టోబర్ 23 న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పించిందో చూద్దాం.
కథ విషయానికి వస్తే.. 36 ఏళ్ల లతిన్ కుమార్ అలియాస్ కుట్టన్ (సజిన్ గోపు)కి ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కాదు. చివరికి అందమైన షర్మిల (నిఖిలా విమల్)తో పెళ్లి జరుగుతుంది. అందరూ అతని భార్య అందం చూసి ఫిదా అవుతారు. అయితే, 3,000 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అరుదైన ధూమకేతు తోకచుక్క రాక జరిగిన ఆ పెళ్లి రోజు, వరుస దుశ్శకునాలతో మొదలవుతుంది. ఎలాగోలా పెళ్లి ముగిసినప్పటికీ, కుట్టన్ ఫస్ట్ నైట్ రోజున కొందరు మాస్క్ పెట్టుకొని అతడిని చంపేస్తారు. అలా చనిపోయిన ప్రతిసారి కూడా కుట్టన్ తన పెళ్లి రోజుకే వచ్చి నిద్ర లేస్తాడు. మొదటిరాత్రిలో అతడిని చంపడానికి వచ్చిన వారు ఎవరో కనుక్కోవడం కోసం కుట్టన్ ఏం చేశాడు.. ? కుట్టన్ అందమైన భార్య షర్మిల గతం ఏంటి.. ? వారి ఊళ్ళో ఆమె గురించి ఎందుకు అందరూ తప్పుగా చెప్తారు.. ? వీరిద్దరి మధ్యలోకి వచ్చిన శేఖర్ కుట్టి( షైన్ టామ్ చాకో) ఎవరు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
టైమ్ లూప్ కాన్సెప్ట్ వినూత్నంగా ఉండడంతో మొదటి భాగం అంతా చాలా ఆసక్తిగా ఉంటుంది. మొదటిసారి లూప్ రాగానే తోకచుక్క ప్రభావం అని ప్రేక్షకుడికి హింట్ ఇచ్చేస్తాడు డైరెక్టర్. ఇక ప్రతిసారి లూప్ రావడం, కుట్టన్ కన్ఫ్యూజ్ అవ్వడంతో కామెడీ బాగా పడుతుంది. ముందుసారి జరిగినట్లు తరువాత జరగకుండా కుట్టన్ ప్లాన్ చేయడం, ఆ లూప్ కి అతను అలవాటు పడడం, ఈ లూప్ ని ఆపాలి అనుకోవడంతో మొదటి భాగం ముగుస్తుంది. అయితే కుట్టన్‌ను ఆయన రూపురేఖలు, వయస్సు విషయంలో అవమానించే వారిని ఎదుర్కొనేందుకు టైమ్ లూప్ పరిస్థితిని వాడుకుంటే ఇంకా ఎంగేజింగ్ గా ఉండేది.
ఇక ప్రథమార్థంలో ఉన్న ఆసక్తి, సెకండ్ హాఫ్‌లో కొనసాగకపోవడం కాస్త మైనస్. కుట్టన్.. షర్మిల ఎవరు అని కనుక్కోవడం, ఆమె గతం తెలుసుకొని ఆమెకు అండగా ఉండడం, శేఖర్ కుట్టి పగ అంతా ఏదో అలా వెళ్లిపోతూ ఉంటుంది. అంతా స్ట్రాంగ్ గా ఉండవు. ఇక క్లైమాక్స్ లో కుట్టన్- శేఖర్ కుట్టి మధ్య ఫైట్ చాలా సిల్లీగా ఉన్నా.. ఎలివేషన్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. నటీనటుల విషయానికొస్తే సజిన్ గోపు ఎప్పటిలాగే ఉత్సాహంగా నటిస్తూ, ఉద్రిక్త పరిస్థితులలోనూ చక్కటి హాస్యాన్ని పండించాడు. కుట్టన్ స్నేహితుడి పాత్రలో గణపతి ఆశ్చర్యపరచగా, నిఖిలా విమల్‌కు పరిధి తక్కువగా ఉన్న పాత్ర లభించింది. ఇంకా ఆమె సీన్స్ పెంచి ఉంటే బావుండేది. ఓవరాల్‌గా ఒక కొత్త కథాంశం, నటీనటుల మార్క్ కామెడీతో ధూమకేతు మూవీ కొన్ని భాగాల్లో నవ్విస్తూ, పర్వాలేదనిపిస్తుంది. వీకెండ్ లో ఒకసారి చూసి నవ్వుకోవచ్చు. ఏంట్రా ఈ లూప్.. చూసిందే చూడడం చిరాకొస్తుంది అనుకున్నవారు.. ఏం సినిమారా బాబు అనుకుంటే స్కిప్ చేసేయొచ్చు.