సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘ఈఎన్ఈ రిపీట్’ రివ్యూ.. ఫన్ ఉంది.. సోల్ మిస్సింగ్!

ABN, Publish Date - Nov 19 , 2026 | 10:23 AM

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి నటించిన ‘ఈఎన్ఈ రిపీట్’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫన్నీ డైలాగ్స్‌తో నవ్వించిన ఈ చిత్రం కథ, సెకండాఫ్‌లో తడబడింది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకోండి.

ENE Repeat Movie

డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తన తొలి చిత్రం 'పెళ్ళిచూపులు' సాధించిన విజయం పట్ల ఎప్పుడూ ఓ సందేశం వ్యక్తం చేస్తుంటారు. ఆ సినిమా... ఆ స్థాయి విజయాన్ని ఎందుకు సాధించిందో తనకు అర్థమే కాదంటారు. కానీ విషయం ఏమంటే తరుణ్‌ భాస్కర్‌ డైరెక్ట్ చేసిన సెకండ్‌ మూవీ 'ఈ నగరానికి ఏమైంది?' కి ఎందుకంత క్రేజ్‌వచ్చిందో చాలామందికి అర్థం కాదు. ఈ సినిమా ఫస్ట్ టైమ్‌ రిలీజ్‌ అయినప్పుడు కమర్షియల్‌ సక్సెస్ ను కూడా అందుకోలేకపోయింది. అయితే... ఇటీవల రీ-రిలీజ్‌ అయినప్పుడు దాన్నో ట్రెండ్ సెట్టర్‌లా జనాలు భావించారు, ఆదరించారు. దాంతో ఎనిమిదేళ్ళ తర్వాత తరుణ్‌ భాస్కర్‌ 'ఈ నగరానికి ఏమైంది?' సీక్వెల్‌ ను 'ఈ.ఎన్.ఈ. రిపీట్‌' పేరుతో రూపొందించారు. గురువారం జనం ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.

బేకరీ ఓనర్ రాబిన్‌ (మహేశ్‌ భాస్కర్)ను నిర్మాతగా పెట్టి వివేక్‌ (విశ్వక్ సేన్‌) అతని స్నేహితులు ఉప్పి (వెంకటేశ్‌ కాకమాను), కార్తీక్‌ (శ్రీనాథ్‌ మాగంటి), కౌశిక్ (అభినవ్ గోమఠం) ఓ సినిమా తీస్తారు. అది కాస్తా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. దాంతో రాబిన్ ను ఫైనాన్షియర్స్ వేధించి, చంపేంత పనిచేస్తారు. బాకీని విడతల వారి తీరుస్తానని ఫైనాన్షియర్స్ కు మాట ఇచ్చి, జరిగిన లాస్ ను భరించమని ఈ నలుగురు ఫ్రెండ్స్ కూ రాబిన్ చెబుతాడు. ఆ బాకీ తీర్చడానికి కార్తీక్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తే, కౌశిక్‌ సినిమాల్లో గెస్ట్ అప్పీయరెన్స్ ఇస్తుంటాడు. ఉప్పి ఫిల్మ్ ఎడిటర్ గా స్థిరపడి బాకీ తీరుస్తుంటారు. రాబిన్ దగ్గరే వివేక్ వెడ్డింగ్‌ ప్లానర్ గా పని చేస్తుంటాడు.


ఉప్పి పెదనాన్న కూతురు కీర్తన (శివాత్మిక)కు సినిమాటోగ్రఫీ అంటే ఇష్టం. దాంతో ఉప్పీ... ఆమెను కార్తిక్‌కు పరిచయం చేస్తాడు. ఇంతలో కీర్తన తండ్రి డాక్టర్ మురళీధర్‌ (ప్రియదర్శిని రామ్‌) డాక్టర్ అంకిత్‌ (శ్రీరామచంద్ర)తో ఆమె పెళ్ళి నిశ్చయం చేస్తాడు. ఈ సందర్భంగా జరిగిన బ్యాచిలర్‌ పార్టీలో వివేక్, కార్తీక్, కౌశిక్, ఉప్పి అతిగా తాగి కాబోయే పెళ్ళికొడుకు అంకిత్‌ పై మ్యాన్ హ్యాండిలింగ్‌ చేస్తారు. దాంతో అతను పెళ్ళి కాన్సిల్‌ చేయడంతో పాటు వీళ్ళ మీద క్రిమినల్‌ కేసు పెడతాడు. సినిమా వాళ్ళంటే అస్సలు గిట్టని కీర్తన తండ్రి మురళీధర్ వీళ్ళను దారుణంగా అవమానిస్తాడు. దాంతో పౌరుషం పొడుచుకొచ్చిన వివేక్‌ ఓ మంచి సినిమా తీసి, తానేమిటో నిరూపిస్తానని సవాల్ విసురుతాడు. అక్కడ నుంచి అందరూ కలిసి డెస్టినేషన్ వెడ్డింగ్‌ జరగాల్సిన థాయ్‌ లాండ్‌ కు సినిమా తీయడానికి బయలు దేరతారు. వివేక్‌ తన మిత్రుల సహకారంతో సినిమా తీశాడా? అది సక్సెస్ అయ్యిందా? తమ కారణంగా నష్టపోయిన రాబిన్, మురళీధర్‌లకు తిరిగి డబ్బులు ఇచ్చేశారా? అనేది మిగతా కథ.

డబ్బుకంటే స్నేహానికి ప్రాధాన్యం ఇవ్వాలనే కాన్సెప్ట్ తో 'ఈ నగరానికి ఏమైంది' సినిమా తెరకెక్కింది. నలుగురు స్నేహితుల మధ్య ఉండే కోపాలు తాపాలు, ఇగో క్లాషెస్, ఫ్రస్టేషన్ అన్నీ అందులో చూపించారు. అయితే ఇప్పుడు ఆ నలుగురు స్నేహితులు జీవితంలో ఓ స్థాయికి ఎదిగి ఉంటారు. సినిమా చేయాలనే పేషన్ ను మాత్రం వదులుకోరు. ముఖ్యంగా వివేక్‌ తనకు సరైన టైమ్‌ వచ్చిందనే భావనతో తిరిగి సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టినప్పుడు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయన్నదే ఈ సినిమా బేసిక్‌ లైన్. మొదటి భాగంలానే ఇందులోనూ పెద్దంత కథేమీ లేదు. తాను అనుకున్న లైన్ కు తగ్గట్టుగా కొన్ని సీన్స్ రాసుకుని, ఆ సిట్యుయేషన్ కు సరిపోయే కామెడీని జనరేట్‌ చేసి రెండున్నర గంటల సినిమాను తరుణ్‌ భాస్కర్‌ తీశాడు. ఫస్ట్ హాఫ్‌ సరదాగా సాగిపోయినా... సెకండ్ హాఫ్ థాయ్‌లాండ్‌లో సినిమా మేకింగ్‌ కు వచ్చే సరికీ గ్రాఫ్ పడిపోయింది. లక్ష్యాన్ని పక్కన పెట్టి స్నేహితులు వాళ్ళలో వాళ్ళు గొడవలు పడటం, క్లయిమాక్స్ కు చేరుకున్నా... తాడు బొంగరం లేకుండా దాన్నే సాగదీయడంతో ప్రేక్షకులు సైతం సహనాన్ని కోల్పోతారు. చివరిలో డాక్టర్ల మీద ఏదో కసి ఉన్నట్టుగా... వాళ్ళంతా చేతకాని వాళ్ళు... సినిమావాళ్ళే గొప్పవాళ్ళు అంటూ వివేక్ తో క్లాస్ పీకించేయడం అతిగా అనిపిస్తుంది. ఎలాంటి క్రూ లేకుండా పిచ్చిపిచ్చిగా తీసిన మూవీ హిట్‌ అయినట్టుగా చూపించడం మరో దారుణం. చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి ఉన్న నలుగురు కుర్రాళ్ళు తమ గోల్‌ను ఎలా అఛీవ్‌ చేశారనే పాయింట్‌ను కూడా అంత బలంగా చూపించలేకపోయారు. మొత్తం మీద కన్వీనియెంట్‌గా కొన్ని సీన్స్ రాసుకుని, ప్రేక్షకులని కన్వెన్స్ చేయగలనని తరుణ్‌ భాస్కర్ అనుకుని తీసిన సినిమా ఇది. అయితే సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ బ్యాక్ టూ బ్యాక్‌ వచ్చే ఫన్నీ డైలాగ్స్ యూత్‌ను ఓ మేరకు ఎంగేజ్ చేస్తాయి.


నటీనటుల విషయానికి వస్తే... విశ్వక్ సేన్ మళ్ళీ తన యాటిట్యూడ్‌తో ఆకట్టుకున్నాడు. అలానే వెంకటేశ్‌ కాకుమాను, శ్రీనాధ్‌ మాగంటి ఆ పాత్రలను నేచురల్ గా ప్లే చేశారు. స్లాపింగ్‌ స్టార్ గా అభినవ్ గోమఠం ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నాడు. ఇతర ప్రధాన పాత్రలను శివాత్మిక రాజశేఖర్, అనీషా ఆంబ్రోస్, శ్రీరామచంద్ర, ప్రియదర్శిని రామ్, కరుణ కుమార్‌, మహేశ్‌ భాస్కర్, మధురిమ, గీతా భాస్కర్, జీవన్ రెడ్డి, రాజీవ్‌ కనకాల, తాళ్ళూరి రామేశ్వరి తదితరులు పోషించారు. చిత్రం ఏమంటే... ఇందులో ప్రధాన పాత్రధారులు కంటే గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చిన దర్శకుల జాబితానే పెద్దది. తరుణ్‌ భాస్కర్ అండ్ టీమ్‌ మీద ఉన్న అభిమానంతో నో చెప్పలేక వీళ్ళంతా స్క్రీన్ మీద కనిపించారనిపిస్తుంది. బలమైన కథ లేకుండా ఇలా షో పుటమ్ చేస్తే... థియేటర్లలో ఆ కాసేపు జనాలు ఎంజాయ్‌ చేయొచ్చేమో కానీ... రిపీట్‌ ఆడియెన్స్ రావడం కష్టమే. ఇంత సెటప్ చేసుకున్న తరుణ్‌ భాస్కర్ కాస్తంత కథ మీద కూడా కూర్చుని ఉంటే బాగుండేది. వివేక్ సాగర్ స్వరపర్చిన పాటలు గొప్పగా లేకపోయినా... బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగుంది. సౌండ్‌ ఎఫెక్ట్స్ అదిరిపోయాయి. ఏజే ఆరోన్ సినిమాటోగ్రఫీ మూవీకి హైలైట్‌. నిర్మాతలు సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి మేకింగ్‌ విషయంలో రాజీ పడలేదు. 'ఈఎన్ఈ రిపీట్‌' సినిమా థియేటర్లో చూస్తున్నంత సేపు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ చివరకు వచ్చే సరికీ సోల్ మిస్ అయిన భావన కలుగుతుంది.

రేటింగ్‌: 2.5/5

ట్యాగ్‌ లైన్: మిస్సింగ్‌ సోల్‌... ఓన్లీ ఫన్!

ఇవి కూడా చదవండి:


అనిల్ రావిపూడి మొదలెట్టేశాడు.. ఇక జాతరే

సీఎం విజయ్‌కు థ్యాంక్స్ చెప్పిన ధనుష్.. విషయమిదే

‘వారణాసి’.. జక్కన్నా, ఈ వార్తలు నిజమేనా?

Updated Date - Nov 19 , 2026 | 10:32 AM