సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘ఆదర్శ కుటుంబం’ మూవీ రివ్యూ.. వెంకీ, త్రివిక్రమ్ మ్యాజిక్ వర్కౌట్ అయ్యిందా?

ABN, Publish Date - Oct 30 , 2026 | 01:26 PM

వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలిసారి దర్శకుడిగా కలిసి చేసిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన ఈ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో వెంకీ నటన, త్రివిక్రమ్ సంభాషణలు ఎలా ఉన్నాయి? సినిమా కథ, నటీనటుల పెర్ఫార్మెన్స్, ప్లస్ అండ్ మైనస్‌లతో పూర్తి మూవీ రివ్యూ.

Aadarsa Kutumbam Movie

వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబినేషన్ లో గతంలో వచ్చిన 'నువ్వు నాకు నచ్చావ్‌, మల్లీశ్వరి' చిత్రాలు ఘన విజయం సాధించాయి. అయితే వాటికి త్రివిక్రమ్ కేవలం రచయిత మాత్రమే. ఆయన దర్శకత్వంలో వెంకటేశ్‌ నటించిన మొదటి సినిమా 'ఆదర్శ కుటుంబం'. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద ఎస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం జనం ముందుకొచ్చింది. మరి 'ఆదర్శ కుటుంబం' ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించిందో లేదో తెలుసుకుందాం..

చిట్టి బాబు (వెంకటేశ్‌) మధ్యతరగతి మనిషి. భార్య స్వర్ణ (శ్రీనిధి శెట్టి) చేసిన తప్పులకు, కూతురు సంపూర్ణ (యువినా) చదువుకు, కొడుకు సర్వ (రాజ్‌ ప్రజ్వల్‌) ఆరోగ్యానికి అప్పులు చేసి తీర్చలేక సతమతమౌతుంటాడు. అప్పుడే అతని ఉద్యోగమూ పోతుంది. ఈ కష్టకాలం నుంచి గట్టెక్కడం ఎలా అని ఆలోచిస్తుంటే.. అతను కొన్న లాటరీ టిక్కెట్‌కు వంద కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అనౌన్స్ అవుతుంది. దాంతో ఒక్కసారిగా వాళ్ళ లైఫ్ స్టైల్‌ మారిపోతుంది. నెల రోజుల్లో చిట్టిబాబుకు వంద కోట్లు వస్తాయనే నమ్మకంతో రియల్ ఎస్టేట్‌ కు చెందిన బుజ్జిబాబు (రఘుబాబు) అతనికి ఓ గేటెడ్‌ కమ్యూనిటీలో ఉండటానికి విల్లా ఇచ్చేస్తాడు. కొత్త జీవితానికి వీళ్ళు అలవాటు పడుతున్న సమయంలోనే చిట్టిబాబుకు వందకోట్లు లాటరీలో వచ్చిందని తెలిసి, బీహార్ కు చెందిన ఓ దోపిడీ ముఠా వీళ్ళ మీ కన్నేస్తుంది. లాటరీ డబ్బులు చిట్టిబాబు ఇంటికి తీసుకొచ్చిన రాత్రే ఆ ముఠా సభ్యులు చిట్టిబాబు ఇంటిపై దాడి చేస్తారు. కానీ ఊహించని విధంగా చిట్టిబాబు ఫ్యామిలీ చేతిలో దోపిడీకి వచ్చిన ఆరుగురు చనిపోతారు. అసలు చిట్టిబాబు ఎవరు? అతని ఫ్యామిలీ మెంబర్స్ బ్యాక్‌ గ్రౌండ్‌ ఏమిటీ? దోపిడీ దొంగల ముఠాని వీళ్ళు ఎలా మట్టుపెట్టగలిగారు? వాళ్ళ శవాల ఆచూకీ కోసం వచ్చిన పోలీస్ ఆఫీసర్‌ దామోదర్‌ నాయుడు (నారా రోహిత్‌)కు ఎలాంటి అనుభవం ఎదురైంది? ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిన బృహస్పతి (రావు రమేశ్‌) అసలు స్కెచ్‌ ఏమిటీ? అనేదే ఈ సినిమా కథ.


'ఆదర్శ కుటుంబం' అనే టైటిల్‌పై రక్తం చిమ్మించడం, ట్యాగ్‌లైన్ గా ఏ.కె. 47 అని పెట్టడంతోనే ఇది ఆదర్శ కుటుంబం కథ మాత్రమే కాదు... అంతకు మించిన యాక్షన్ మూవీ అనేది అర్థమౌతుంది. అయితే ఏ రకంగానూ ఏజ్‌ కాంబినేషన్స్‌ సెట్‌ కానీ వీళ్ళు ఆదర్శ కుటుంబం ఏమిటనే సందేహం ప్రతి ఒక్కరికీ వస్తుంది. దానికి సమాధానం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం అన్నింటికీ తెగించి, దోపీడీ దొంగల ముఠాను అంతమొందించిందంటే దానికి బలమైన కారణం ఉండాలి. ఇందులో ఆ కారణం అంత బలంగా మాత్రం లేదు. కాకపోతే... ఆ దోపిడీ ముఠా గతంలో చేసిన ఓ హత్య తాలూకూ కర్మ వాళ్ళను వెంటాడి, చిట్టిబాబు కుటుంబం రూపంలో పగ తీర్చుకుందని చెప్పుకోవచ్చు. 'కర్మ రిటర్న్స్' అనే పాయింట్‌ ను బేస్‌ చేసుకుని త్రివిక్రమ్ ఈ కథను రాశారు.

'ఆదర్శ కుటుంబం' ప్రథమార్ధం సరదాగా సాగిపోయింది. ఏజ్ గ్యాప్ ఉన్న భార్యాభర్తలు, వాళ్ళ అప్పుల బాధలు, ఆరోగ్య సమస్యలు, ప్రేమ వ్యవహారాలు... ఇవన్నీ ప్రేక్షకులను బాగానే ఎంగేజ్ చేస్తాయి. ఇంటర్వెల్‌ లో క్రైమ్‌ జానర్ లోకి మూవీ ఎంటర్ అవుతుంది. ఇక అక్కడ నుంచి పోలీస్ ఇన్వెగేషన్‌, విలన్ గ్యాంగ్‌ నుంచి హీరో ఫ్యామిలీ తప్పించుకునే ప్రయత్నం... చివరిలో ఇటు పోలీసులకు, అటు విలన్ గ్యాంగ్‌కు మధ్య అడకత్తెరలో పోకచెక్క మాదిరి ఇరుక్కుపోవడం... ఆ పైన ఆ కుటుంబం ఈ వ్యవహారం నుంచి బయటపడటంతో సినిమాకు శుభం కార్డు పడుతుంది. నిడివి తగ్గించే క్రమంలో చేసిన ఎడిటింగ్‌ కారణంగా అక్కడక్కడా లింగ్స్ తెగిపోవడమే కాదు... కొన్ని క్యారెక్టర్స్ ఎగిపోయినట్టు అర్థమౌతోంది. కాకపోతే ఇంటర్వెట్‌ బ్యాంగ్‌ అదిరింది. కానీ అక్కడ నుంచే కథ వేరే టర్న్ తీసుకుంది. వినోదం కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు దర్శకుడు త్రివిక్రమ్ యాక్షన్‌ డిష్ వడ్డించారు. పైగా పోలీసు వర్గాల్లోని లుక లుకలు పెద్దంత ఎంగేజ్‌ చేయలేకపోయాయి. మొత్తం మీద హీరో కుటుంబం పగ తీర్చుకోవడానికో నోబుల్‌ రీజన్‌ చూపించి, కొంతలో కొంత శాటిస్ ఫై చేశారు.


చిట్టిబాబు పాత్ర పోషణ వెంకటేశ్‌కు కేక్ వాక్ లాంటిది. అవలీలగా దానిని పోషించారు. యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. శ్రీనిధి శెట్టి తన పాత్రకు న్యాయం చేకూర్చింది. డబ్బింగ్‌ కూ పాస్ మార్కులు పడతాయి. వాళ్ళ పిల్లలుగా యువిని, రాజ్ ప్రజ్వల్‌ బాగా చేశారు. ప్రథమార్ధంలో రఘుబాబు, ద్వితీయార్ధంలో సత్య కామెడీతో ప్రేక్షకులకు బోలెడంత రిలీఫ్ లభిస్తుంది. కాకపోతే 'అల వైకుంఠపురములో' తర్వాత మరోసారి నివేదా పేతురాజ్‌కు చేదు అనుభవమే ఎదురైంది. ఆమె పాత్రకు పెద్దంత ప్రాధాన్యం దక్కలేదు. డింపుల్‌ హయతీ ఐటమ్‌ సాంగ్‌ బలవంతంగా పెట్టినట్టే ఉంది. ఇతర ప్రధాన పాత్రలను నారా రోహిత్‌, సచిన్ ఖేడేకర్‌, రావు రమేశ్‌, బ్రహ్మాజీ, కేదార్ శంకర్, ఉదయ్‌ బీర్‌ సంధు, దేవయాని శర్మ, ఆకాశ్‌ శంకర్, షఫీ, నాజర్‌, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు పోషించారు. త్రివిక్రమ్ సినిమాలో అనంత్‌, పమ్మి సాయి ఆస్థాన విద్వాంసులు. ఇందులో వాళ్లూ ఉన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమన్ చెప్పినట్టు ఇది పాటల సినిమా కాదు. మాటల సినిమా. అందువల్ల తమన్ పాటల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. నేపథ్య సంగీతం బాగుంది. రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. కెవిన్ కుమార్ యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. సూర్యదేవర రాధాకృష్ణ ప్రొడక్షన్ కు వంక పెట్టలేం. అయితే భారీ అంచనాలు పెట్టుకోకుండా... త్రివిక్రమ్ మార్క్ సంభాషణలు, వెంకీ మార్క్ ఎంటర్ టైన్ మెంట్ కోసం ఓసారి సినిమాను చూడొచ్చు.

ట్యాగ్‌ లైన్‌: వయొలెంట్‌ ఫ్యామిలీ!

రేటింగ్‌: 2.75/5

ఇవి కూడా చదవండి:

నాగబాబు విడుదల చేసిన ‘మైలురాయి’ టైటిల్ లుక్

కథలు వినడం మానేసిన అనుపమ.. కారణం ఏంటి?

‘వారణాసి’ వాయిదా వార్తలకు విజయేంద్ర ప్రసాద్ చెక్

Updated Date - Oct 30 , 2026 | 02:00 PM