రూ.200 కోట్ల దోపిడీ కేసులో ట్విస్ట్.. నోరా ఫతేహీకి ఢిల్లీ హైకోర్టు సమన్లు
ABN , Publish Date - Oct 31 , 2026 | 02:20 PM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుకేష్ చంద్రశేఖర్ రూ.200 కోట్ల మనీలాండరింగ్, దోపిడీ కేసు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నోరా ఫతేహీకి ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుకేష్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) రూ.200 కోట్ల మనీలాండరింగ్, దోపిడీ కేసు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాలీవుడ్ గ్లామర్ క్వీన్, డ్యాన్సింగ్ సెన్సేషన్ నోరా ఫతేహీ (Nora Fatehi)కి ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. ఈ భారీ ఆర్థిక మోసం కేసులో ఆమెను ప్రత్యక్ష సాక్షిగా కోర్టు ముందు హాజరుకావాల్సిందిగా ఆదేశిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 2న విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టం చేసింది.
ఈ కేసుకు సంబంధించి దాఖలైన మూడో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌లో నోరా ఫతేహీని ప్రాసిక్యూషన్ సాక్షిగా (LW-3) పేర్కొన్నారు. 2020-21 కాలంలో సుకేష్ చంద్రశేఖర్ ఢిల్లీలోని రోహిణి జైల్లో ఉంటూనే ఉన్నతాధికారుల పేర్లతో నకిలీ అవతారమెత్తాడు. ర్యాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్‌ను బెదిరించి, ఆమె భర్తను జైలు నుంచి విడిపిస్తానని నమ్మబలికి దాదాపు రూ.200 కోట్లను దోచుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ దందాపై ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం సమగ్ర దర్యాప్తు చేపట్టి, మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) కింద అభియోగాలు నమోదు చేసింది.
దర్యాప్తులో భాగంగా సుకేష్ చంద్రశేఖర్, అతని భార్య లీనా మరియా పాల్‌తో ఉన్న సంబంధాలపై ఈఓడబ్ల్యూ గతంలోనే నోరా ఫతేహీని సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఆ సమయంలో సీఆర్పీసీ సెక్షన్ 164 కింద ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. సుకేష్‌తో తనకు ఎలాంటి ప్రత్యక్ష పరిచయం లేదని, కేవలం అతని భార్య ద్వారానే మాట్లాడానని, డిసెంబర్ 2020లో చెన్నైలో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొనడానికి మాత్రమే వెళ్లానని నోరా అధికారులకు వివరణ ఇచ్చారు. అయితే, ఇప్పుడు ఈ కేసు విచారణ కీలక దశకు చేరుకోవడంతో ఆమె వాంగ్మూలం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. నవంబర్ 2న కోర్టు ముందు నోరా ఫతేహీ ఇచ్చే సాక్ష్యం ఈ కేసులో ఎలాంటి మలుపులు తిప్పుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి:
‘జిమ్ జిమ్ తార’ సాంగ్.. కాంట్రవర్సీలో ‘ఆదర్శ కుటుంబం’
సమంతకు కవల పిల్లలా.. ఆ హీరోయిన్ అలా కామెంట్ చేశారేంటి?
బాలయ్య, కొరటాల సినిమా... ఆ రూమర్స్ నమ్మొద్దంటోన్న టీమ్