Nana Patekar: తెలుగువారితో ప్రత్యేక అనుబంధం.. కృష్ణవంశీ సినిమాలతో మరింత బంధం
ABN , Publish Date - Oct 08 , 2026 | 04:57 PM
తెలుగు సినిమాలో నేరుగా నటించకపోయినా నానా పటేకర్‌కు తెలుగువారితో ప్రత్యేక అనుబంధం ఉంది. కృష్ణవంశీ సినిమాలు, తెలుగు రీమేక్‌లతో ఆయనకు ఏర్పడిన బంధం ప్రత్యేకమైనది.
విలక్షణ నటన - అంతే విలక్షణమైన వ్యక్తిత్వం నానా పటేకర్ సొంతం. తెరపై విలన్ రోల్స్ లో భయపెట్టిన నానా పటేకర్ నిజజీవితంలో పది మందికి సాయం చేయాలనే తపనతో సాగారు. నానా పటేకర్ ఇక లేరు అన్న చేదు నిజాన్ని అభిమానులు భరించలేక శోకసముద్రంలో మునిగారు. తెలుగు సినిమాలో నటించకపోయినా... నానా పటేకర్ కు తెలుగు సినిమాతో ప్రత్యేక బంధం ఉంది.
నానా పటేకర్ పేరు వినగానే ఆయన ధరించిన అనేక విలక్షణమైన పాత్రలు మన స్మృతిపథంలో మెదలుతాయి. మరాఠీ, హిందీ చిత్రాలతో అలరించిన నానా పటేకర్ తెలుగు సినిమాల్లో నటించలేదు. కానీ, తెలుగువారితో అనుబంధం ఉంది. తెలుగు నిర్మాత రామోజీరావు నిర్మించిన 'ప్రతిఘటన' రీమేక్ 'ప్రతిఘాత్'లో రిటైర్డ్ పోలీస్ కానిస్టేబుల్ గా నానా పటేకర్ నటించారు. 'ప్రతిఘటన'లో సుత్తివేలు ధరించిన పాత్రను హిందీలో నానా పటేకర్ పోషించారు. 'ప్రతిఘాత్' నటునిగా నానా పటేకర్ కు ఎంతో పేరు సంపాదించి పెట్టింది. అలాగే తెలుగు దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన 'శక్తి- ద పవర్'లోనూ నానా పటేకర్ విలక్షణమైన పాత్ర ధరించారు. ఈ చిత్రానికి కృష్ణవంశీ 'అంతఃపురం' మాతృక. తెలుగులో ప్రకాశ్ రాజ్ ధరించిన పాత్రను 'శక్తి'లో నానా పోషించారు. విశేషం ఏమంటే నానా పటేకర్ కెరీర్ ప్రారంభంలో ఈ సినిమా వచ్చింది. అయితే మళ్ళీ చాలా యేళ్ళ తర్వాత నానా పటేకర్ నటించిన మరాఠీ చిత్రం 'నటస్రమాట్'ను కృష్ణవంశీ తెలుగులో 'రంగమార్తాండ'గా రీమేక్ చేశారు. మరాఠీలో నానా పటేకర్ పోషించిన ప్రధాన నాయకుడి పాత్రను తెలుగులో ప్రకాశ్ రాజ్ చేయడం విశేషం. ఇలా కృష్ణవంశీ సినిమాలతో నానా పటేకర్ కు ప్రత్యేక అనుబంధం ఏర్పడింది.
మహారాష్ట్రలోని మురద్- జంజిరాలో జన్మించిన నానా పటేకర్ అసలు పేరు విశ్వనాథ్ పటేకర్. చిన్నప్పటి నుంచీ చిత్రకళ అంటే నానాకు ప్రాణం. ముంబైలోని ప్రఖ్యాత 'సర్ జె.జె. కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్'లో నానా అప్లైడ్ ఆర్ట్స్ చేశారు. కొన్ని మరాఠీ నాటకాల్లోనూ నటించారు నానా. 1978లో తెరకెక్కిన 'గమన్' చిత్రంతో వెండితెరపై తొలిసారి కనిపించారు. అనేక చిత్రాలలో విలక్షణమైన పాత్రలు పోషిస్తూ సాగారు నానా పటేకర్. 'అగ్నిసాక్షి', 'పరిందా' చిత్రాల ద్వారా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు. 'క్రాంతివీర్' చిత్రం ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా నిలిచారు నానా. "ప్రహార్, తిరంగా, ఖామోషీ, శక్తి, అపహరణ్" వంటి చిత్రాలు నానాకు నటునిగా ఎనలేని పేరు సంపాదించి పెట్టాయి. అర్జున్ 'బొమ్మలాట్టం', రజనీకాంత్ 'కాలా' వంటి సౌత్ మూవీస్ లోనూ నానా నటించారు.
నానా పటేకర్ నటించిన అనేక చిత్రాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. ఆయన హిందీ సినిమా 'క్రాంతివీర్'ను తెలుగులో మోహన్ బాబు 'పుణ్యభూమి నా దేశం' పేరుతో రీమేక్ చేశారు. అలాగే చాలా కాలం తర్వాత నానా పటేకర్ నటించిన 'టాక్సీ నంబర్ 9211' మూవీ మోహన్ బాబే తెలుగులో 'గేమ్' పేరుతో తానే నటించి పునర్ నిర్మించారు. తెరపై ప్రతినాయక పాత్రల్లో జడిపించిన నానా పటేకర్ నిజజీవితంలో దానధర్మాలు ఎన్నో చేశారు. మహారాష్ట్రలోని రైతులను ఆదుకోవడానికి నానా పటేకర్ తన సహ నటుడు మకరంద్ తో కలసి 'నామ్ ఫౌండేషన్' నెలకొల్పారు. ఆపదలో ఉన్నవారికి చేతనైన సాయం అందించడానికి ముందుండేవారు నానా పటేకర్. నటునిగా, వ్యక్తిగా తనదైన బాణీ పలికించిన నానా పటేకర్ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన చిత్రాల ద్వారా జనం మదిలో నిలచే ఉంటారు.
ఇవి కూడా చదవండి:
నమ్మలేకపోతున్నాం.. నానా పటేకర్ మృతిపై సెలబ్రిటీలు
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’.. తమిళ సినిమాగా ప్రచారం అందుకేనా?
తెలుగమ్మాయి.. చెన్నైకి వచ్చేయి