TVK Vijay Assets: అకౌంటెంట్ పొరపాటుకు.. విజయ్ ఎన్నిక రద్దు చేయాలా?
ABN , Publish Date - Oct 08 , 2026 | 10:09 AM
ఎన్నికల అఫిడవిట్‌లో సుమారు రూ.30 కోట్ల ఆస్తుల వివరాలు వెల్లడించలేదన్న పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు కీలక ప్రశ్నలు సంధించింది.
తమిళ నాడు సీఎం విజయ్ (TVK Vijay) ఎన్నికల అఫిడవిట్‌లో సుమారు రూ.30 కోట్ల ఆస్తుల వివరాలు (Vijay Assets Case) వెల్లడించలేదంటూ దాఖలైన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు (Madras High Court) కీలక ప్రశ్నలు సంధించింది. ఇప్పటికే విజయ్ రూ.600 కోట్ల ఆస్తులను ప్రకటించిన నేపథ్యంలో రూ.30 కోట్ల ఆస్తుల వివరాలు వెల్లడించకపోవడం అవినీతి చర్యగా పరిగణించవచ్చా? అని ప్రశ్నించింది. ఎన్నికల అఫిడవిట్‌ను సిద్ధం చేసిన చార్టర్డ్ అకౌంటెంట్ కొన్ని ఆస్తుల వివరాలను పొరపాటున నమోదు చేయకపోతే అందుకు ఎన్నికను రద్దు చేయాలా? అని అడిగింది.
రూ.30 కోట్ల ఆస్తుల వివరాలు వెళ్లడించకపోవడం వల్ల పెరంబూరు ఓటర్లు ప్రభావితమయ్యారా? అని కూడా న్యాయమూర్తి ప్రశ్నించారు. విజయ్ 50 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఒక ఓటరు విజయ్‌కు ఓటు వేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయనకు అదనంగా రూ.30 కోట్ల ఆస్తులు ఉన్నాయా లేదా అన్నది ఓటు నిర్ణయంపై ఎంతవరకు ప్రభావం చూపుతుందని ప్రశ్నించారు. ఈ కేసు తదుపరి విచారణను న్యాయమూర్తి గురువారానికి వాయిదా వేశారు.