గద్దర్, వంగపండుకు దక్కని గౌరవం... గరివిడి లక్ష్మికి!

ABN , Publish Date - Oct 08 , 2026 | 01:01 PM

ప్రజాయుద్థ నౌక గద్దర్ కు, ఉత్తరాంధ్ర జానపద కళాకారుడు, విప్లవ కవి వంగపండు ప్రసాదరావుకు దక్కని గౌరవం జానపద, బుఱ్ఱకథ కళాకారిణి గరివిడి లక్ష్మికి దక్కుతోంది. ఆమె జీవితం వెండితెరపై ఆవిష్కృతం అవుతోంది.

Garividi Lakshmi Movie

ఆనంది నాయికగా గౌరి నాయుడు జమ్ము తెరకెక్కిస్తున్న బయోపిక్ 'గరివిడి లక్ష్మీ'. పీపుల్స్ మీడియా పతాకంపై టి.జి. విశ్వప్రసాద్‌, ఆయన కుమార్తె కృతి ప్రసాద్ నిర్మిస్తున్న 'గరివిడి లక్ష్మీ' బయోపిక్ ఈ నెల 17న జనం ముందుకు రాబోతోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ చూసిన వారికి గరివిడి లక్ష్మీ ఉత్తరాంధ్రకు చెందిన జానపద కళాకారిణి అని, ముఖ్యంగా బుఱ్ఱకథలను తనదైన బాణీలో స్టేజ్ మీద ప్రదర్శించి, ప్రజల మన్ననలు పొందిందని తెలిసింది. అయితే ఆ తర్వాత ఆడియో, సినిమా రంగాలలో ఆమె మోసానికి గురైందనే భావన కూడా ఈ ట్రైలర్ చూసిన వారికి కలుగుతుంది. గరివిడి లక్ష్మీగా ఆనంది నటించగా, ఆమె తల్లి పాత్రను రాశి పోషించారు. ఇతర కీలక పాత్రలను నరేశ్, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్, కంచరపాలెం కిషోర్, కుశాలిని తదితరులు పోషించారు. చరణ్ అర్జున్ ఈ సినిమాకు సంగీతం అందించారు.


గరివిడి లక్ష్మీ ఉత్తరాంధ్ర జానపద కళకు ప్రత్యేక బాణీని అందించిన కళాకారిణి. ఆమె అసలు పేరు రెడ్డి విజయలక్ష్మీ. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం, గరివిడి మండలంలోని గెడ్డపు వలస ఆమె స్వస్థలం. 1994లో స్టేజీ ఎక్కి జానపద పాటలు, బుర్రకథలు చెప్పడం మొదలు పెట్టింది. దాదాపు పది వేలకు పైగా ఆమె ప్రదర్శనలు ఇచ్చిందని చెబుతారు. అలానే 1996లో శ్రీమాతా కంపెనీ ద్వారా ఆమె బుర్రకథలు, పాటలు ఆడియో, వీడియోలలో విడుదల అయ్యాయి.

ఒకానొక దశలో 'గరివిడి లక్ష్మీ' అనేది ఒక బ్రాండ్‌ గా మారిపోయింది. ఆమెను అనుకరిస్తూ, ఆమె పేరును అడ్డం పెట్టుకుని ఎన్నో ట్రూప్స్ బయలు దేరాయి. ఆమెకు చెందిన వారిగా చెప్పకుని, అనేకానేక ప్రోగ్రామ్స్ ఇచ్చి పొట్టపోసుకున్న వారూ లేకపోలేదు. గరివిడి లక్ష్మీ పాటలో, పాటలో ద్వంద్వార్థాలు ధ్వనించేవన్నది కూడా నిజం. 'చందమామా, ఓ అత్తరు సాయిబో రారా, రాతిరి నల్లోడా…, రానిపోని బుల్లోడా…, నాను శ్రీకాకుళం జిల్లండి…, పాలకొండ ఎళ్లిపోతా…పాక కాలిపోతోంది…, నలజిలకర్ర మొగ్గ.. ' వంటి జానపద గీతాలతో యువతను అప్పట్లో గరివిడి లక్ష్మీ ఓ ఊపు ఊపేసింది.


గరివిడి లక్ష్మీ జానపద గీతాలు విన్న ఆర్. నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన 'పీపుల్స్ వార్' సినిమాలో 'సోదోయమ్మ సోది' పాట పాడించడంతో పాటు, ఓ చిన్న పాత్రలో నటింపచేశారు. అలానే 'గంగమ్మ జాతర' సినిమాలో 'మాలావారి గంగమ్మో వెలమల సత్యారావండీ' పాటను కూడా గరివిడి లక్ష్మీతో పాడించారు. ఇప్పుడీ జానపద కళాకారిణి జీవితం వెండితెరపై ఆవిష్కృతం అవుతోందంటే చాలామందికి ఆశ్చర్యం ఆనందం కలుగుతోంది. ఎందుకంటే ఉత్తరాంధ్రకే చెందిన జానపద కళాకారుడు, విప్లవకవి వంగపండును తెరకెక్కించిన వారు లేదు. అలానే ప్రజా యుద్థ నౌకగా ప్రజలు కొనియాడే తెలంగాణ వాసి గద్దర్ జీవిత కథ ఇంతవరకూ సినిమాగా రాలేదు. కానీ వీరెవ్వరికీ దక్కని గౌరవం గరివిడి లక్ష్మీకి కలగడం నిజంగా అదృష్టమే.


'మహానటి' తర్వాత తెలుగులో వస్తున్న మహిళ జీవిత గాథ 'గరివిడి లక్ష్మీ' అని చెప్పుకుంటున్నారు. నిజానికి ఈ మధ్య కాలంలో 'చాకలి ఐలమ్మ' వంటి చారిత్రక మహిళ బయోపిక్ సైతం వచ్చింది. అలానే డొక్కా సీతమ్మ జీవిత గాథను ఇద్దరు నిర్మాతలు వేర్వేరుగా తెరకెక్కిస్తున్నారు. మొత్తం మీద సమాజంలో తమదైన ముద్రను వేసిన మహిళామణుల జీవిత గాథలు తెరకెక్కడం అనేది మంచి పరిణామమే. అయితే... గరివిడి లక్ష్మీ జీవితంలోని ఏ యే అంశాలను దర్శకుడు గౌరి నాయుడు సినిమాటిక్‌ ఫ్రీడమ్‌తో తెరకెక్కించారన్నది చూడాలి. ఈ సినిమాకు సంబంధించి ఓ వెసులుబాటు ఉంది. అదేమిటంటే... సావిత్రి జీవితం అందరికీ తెలిసింది. ఆమె జీవిత కథను అటూ ఇటూ మార్చితే విమర్శలకు గురయ్యే ఆస్కారం ఉండేది. కానీ గరివిడి లక్ష్మీ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. కాబట్టి దర్శకుడు గౌరి నాయుడు క్రియేటివ్‌ ఫ్రీడమ్‌ పేరుతో కాస్తంత సినిమాటిక్‌గా ఆమె జీవిత కథను మార్చినా పెద్దంత అభ్యంతరాలు వ్యక్తం కావు!

ఇవి కూడా చదవండి:

మంచి పాత్రలు రాకే.. మానేసి ఆ పని చేస్తున్నా: ఎల్.బి. శ్రీరామ్

Fauzi: ప్రభాస్ బర్త్‌‌డే ట్రీట్.. మూడు నిమిషాల అరాచకం

మోక్షజ్ఞ మూవీ ఓపెనింగ్ అప్పుడేనా?.. అయితే ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా

Updated Date - Oct 08 , 2026 | 02:35 PM

యాంకర్ ఫొటోలు మార్ఫింగ్.. అసభ్యకర పోస్టులు

భారతీయుడు.. ముచ్చటగా మూడోసారి వస్తున్నాడు

Fauzi: ప్రభాస్ బర్త్‌‌డే ట్రీట్.. మూడు నిమిషాల అరాచకం

నా వైఫ్ మిస్సింగ్ అంటున్న వరుణ్ సందేశ్..

మోక్షజ్ఞ మూవీ ఓపెనింగ్ అప్పుడేనా?.. అయితే ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా