‘మా భూమి’ దర్శకుడు.. బి. నర్సింగరావుకు గౌరవ డాక్టరేట్! గవర్నర్ చేతుల మీదుగా సత్కారం

ABN , Publish Date - Oct 08 , 2026 | 08:35 AM

‘మా భూమి’ దర్శకుడు, నటుడు, కవి బి. నర్సింగరావుకు గౌరవ డాక్టరేట్ లభించింది.

B Narsing Rao

తెలంగాణ సినిమాకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన దర్శకుడు, నటుడు, కవి బి.నర్సింగ‌రావు (B Narsing Rao) కు గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా గౌరవ డాక్టరేట్ (Honorary Doctorate) ప్రదానం చేసి సత్కరించారు. బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఓపెన్ వర్సిటీ) (Ambedkar Open University) 27వ స్నాతకోత్సవం బుధవారం జూబ్లీహిల్స్ లోని వర్సిటీ ప్రధాన కార్యాలయంలో జరిగింది.

తెలంగాణ గవర్నర్ (Telangana Governor) శివ్ ప్రతాప శుక్లా (Shiv Pratap Shukla) ముఖ్య అతిథిగా హాజరై.. విద్యార్థులకు డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్ఎ పట్టాలు, బంగారు పతకాలు, బుక్‌లెట్స్‌ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గౌరవ డాక్టరేట్ అందుకున్న మా భూమి (Maa Bhoomi) దర్శకుడు బి.నర్సింగ‌రావును గవర్నర్ అభినందించారు. నర్సింగ్ రావు ఒక విశిష్ఠ చలనచిత్ర దర్శకుడని కొనియాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సామాజిక వాస్తవాలను జాతీయ, అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లడానికి కృషి చేశారని ప్రశంసించారు.

విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడంతోపాటు, డిజిటల్ విద్యపై ఉన్నత విద్యాసంస్థలు ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా గవర్నర్ పిలుపునిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ యుగంలో కొత్త సాంకేతికత మానవ వినాశనానికి కాకుండా సరికొత్త సమాజ నిర్మాణానికి ఉపయోగపడేలా శాస్త్రవేత్తలు కృషి చేయాలని సూచించారు. స్నాతకోత్సవంలో భాగంగా 23 మంది పరిశోధక విద్యార్థులకు పీహెచ్, ఒకరికి ఎంఫిల్ డిగ్రీ ప్రదానం చేశారు. యూజీ, పీజీలో 38 బంగారు పతకాలను విద్యార్థులకు అందజేశారు.

Updated Date - Oct 08 , 2026 | 08:40 AM