సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tollywood: టాలీవుడ్‌కు.. కొత్త కళ

ABN, Publish Date - Sep 15 , 2025 | 02:46 PM

సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వచ్చిన 'లిటిల్ హార్ట్స్' ఇంతవరకూ 30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. 'మిరాయ్' సినిమా వీకెండ్ కు రూ. 80 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. 'కిష్కింధపురి' సినిమా సైతం రోజు రోజుకూ కలెక్షన్స్ పెంచుకుంటూ సక్సెస్ ట్రాక్ ఎక్కే ప్రయత్నం చేస్తోంది. దాంతో టాలీవుడ్ లో పండుగ వాతావరణం నెలకొంది.

Tollywood movies

తెలుగు సినిమా రంగానికి ఈ యేడాది సంక్రాంతి సీజన్ తర్వాత సరైన హిట్ ఒక్కటీ పడలేదు. 'తండేల్ (Thandel), కోర్ట్ (Court), మ్యాడ్ స్క్వేర్ (Mad Square)' వంటివి మధ్యలో మూడు, నాలుగు సినిమాలు విడుదలై బాగానే ఆడినా... ట్రేడ్ వర్గాల దాహార్తి పూర్తి స్థాయిలో ఈ విజయాలతో తీరలేదని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో అనువాద చిత్రం 'మహావతార నరసింహా' (Mahaavatar Narasimha) మంచి విజయాన్ని సాధించగా, 'కొత్త లోక' ఫర్వాలేదనిపించింది.


ఇక సెప్టెంబర్ నెలలో స్ట్రయిట్ తెలుగు సినిమాలకు దక్కిన విజయంతో టాలీవుడ్ ఓ రకంగా ఊపిరిపోసుకుందనే చెప్పాలి. ఈటీవీ విన్ తో కలిసి దర్శకుడు ఆదిత్య హాసన్ నిర్మించిన 'లిటిల్ హార్ట్స్' (Little Hearts) సినిమా సెప్టెంబర్ 5న విడుదలైంది. ఈ సినిమా ఇప్పటి వరకూ వరల్డ్ వైడ్ రూ. 32.15 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందని మేకర్స్ చెబుతున్నారు. మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన ఈ సినిమాను సాయి మార్తాండ్ డైరెక్ట్ చేశాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ సాధించిన విజయం చిన్న చిత్రాల నిర్మాతలకు పెద్ద ఊరటను ఇచ్చింది. ఆ తర్వాత వారమే వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'కిష్కింధపురి' (Kishkindha Puri) సినిమాకు పెద్దంత పాజిటివ్ టాక్ రాలేదు. కానీ ఆ సినిమా కలెక్షన్స్ సైతం నిదానంగా పుంజుకుంటున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే ఆదరణ మరికొన్ని రోజులు కొనసాగితే ఆ 'కిష్కింధపురి' బ్రేక్ ఈవెన్ కు రావచ్చని అంటున్నారు. ఇక తేజ సజ్జా, మంచు మనోజ్ కీలక పాత్రలు పోషించిన 'మిరాయ్' (Mirai) సినిమా బాక్సాఫీస్ బరిలో వండర్స్ సృష్టిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే 80 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసింది. ఫస్ట్ షో నుండే 'మిరాయ్'కు పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా ఇదే కావడం విశేషం. 'మిరాయ్'కు ప్రధాన బలం ఫ్యామిలీ ఆడియెన్స్. పిల్లలతో కలిసి హాయిగా చూసేలా 'మిరాయ్' ఉందని అందరూ ఏకగ్రీవంగా చెబుతున్నారు. ఆ రకంగా వరుస విజయాలతో టాలీవుడ్ కు కొత్త ఊపు వచ్చింది.


ఈ శుక్రవారం వస్తున్న చిత్రాలలో 'బ్యూటీ' (Beauty) కి కూడా పాజిటివ్ బజ్ ఉంది. అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటించిన ఈ సినిమాను జె.ఎస్.ఎస్. వర్థన్ డైరెక్ట్ చేశాడు. దీనికి కథ, స్క్రీన్ ప్లే ఆర్. వి. సుబ్రహ్మణ్యం అందించాడు. బేసికల్ గా ఇది లవ్ స్టోరీనే అయినా తల్లిదండ్రులతో కలిసి చూసేలా దీన్ని తెరకెక్కించామని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కూ మంచి స్పందన లభించింది. ఈ మూవీతో పాటే తమిళ అనువాద చిత్రం 'భద్రకాళి' (Bhadrakaali) కూడా 19న రాబోతోంది. ఇది విజయ్ ఆంటోనికి 25వ సినిమా. ఈ మూవీ మీద అతను భారీ ఆశలు పెట్టుకున్నాడు.

ఈ నెలాఖరులో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' (OG) పాన్ ఇండియా మూవీగా విడుదలకు సిద్థమౌతోంది. ఈ నెల 25న రాబోతున్న ఈ సినిమాకు విదేశాలలో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. కొన్ని ఏరియాల్లో పాత రికార్డులను ఇప్పటికే ఈ సినిమా తిరగరాసింది. 'హరిహర వీరమల్లు' ఆశించిన స్థాయిలో ఆకట్టుకోని నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ అంతా 'ఓజీ' మీదనే హోప్స్ పెట్టుకున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ వారి నమ్మకాన్ని నిలబెట్టే విధంగానే ఉంది. సో... 'ఓజీ' కూడా మంచి విజయాన్ని నమోదు చేసుకుంటే... సెప్టెంబర్ మాసం ఈ యేడాది టాలీవుడ్ ను కష్టాల నుండి గట్టెక్కించిన నెలగా మిగిలిపోతుంది.

Also Read: BRAT: రంగి రంగి.. నువ్వు లాగ‌మాకు లుంగీ! పాట.. దుమ్ము దులుపుతుందిగా...

Also Read: Bigg Boss Season 9: ఇలా అయితే.. 100 రోజులు న‌డిపేదెలా...

Updated Date - Sep 15 , 2025 | 03:01 PM