BRAT: రంగి రంగి.. నువ్వు లాగమాకు లుంగీ! పాట.. దుమ్ము దులుపుతుందిగా
ABN , Publish Date - Sep 15 , 2025 | 02:03 PM
డార్లింగ్ కృష్ణ, మనీషా జంటగా శశాంక్ దర్శకత్వంలో రూపొందుతున్న కన్నడ, తెలుగు ద్వి భాషా చిత్రం ‘బ్రాట్’.
డార్లింగ్ కృష్ణ (Darling Krishna), మనీషా (Manishakandkur) జంటగా శశాంక్ (Shashank) దర్శకత్వంలో రూపొందిన కన్నడ చిత్రం ‘బ్రాట్’(BRAT). తెలుగులోనూ అదే పేరుతో విడుద చేస్తున్నారు. డాల్ఫిన్ ఎంటర్‌టైన్‌మెంట్ (Dolphin Entertainment) బేనర్‌పై మంజునాథ్ కంద్కూర్ (Manjunath V. Kandkur) నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, యుద్దమే రానీ అనే పాట సినిమాపై మంచి బజ్ తీసుకు వచ్చాయి. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ఎదుటకు రానుంది.
ఈనేపథ్యంలో తాజాగా.. రంగి రంగి (RANGI RANGI) అంటూ సాగే ఓ అదిరిపోయే మాస్ మసాలా ఐటం సాంగ్ తెలుగు వర్షన్ రిలీజ్ చేశారు. అర్జున్ జన్యా ( Arjun Janya) సంగీతంలో సాయిచరణ్ భాస్కరుని (Sai Charan Bhaskaruni), ఇందు నాగరాజ్ ( Indu Nagaraj) ఆలపించగా యశ్వంత్ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. శ్రావణ్ భానుపురి (Shrawan Bhaanupuri) సాహిత్యం అందించాడు. ఇదిలాఉంటే ఈ సాంగ్‌ను కన్నడలో గంగి గంగి పేరుతో రిలీజై అక్కడ మారుమ్రోగుతోంది.
అయితే.. ‘అట్టా ఎట్టా పుట్టేశావే రంగి ఓ రంగి ఎడా పెడా పెంచేశావే ఒంటినిండా సొగసిరి రంగి హే రంగి... రంగి రంగి నువ్వు లాగమాకు లుంగీ’ అంటూ సాగిన ఈ పాట మాస్ ఆడియన్స్ కు వెంటనే కనెక్ట్ అయ్యేలా ఫర్ఫెక్ట్‌గా ఉంది. నాలుగు నిమిషాల 25సెకన్ల నిడివి ఉన్న ఈ పాట సాహిత్యంతో పాటు ట్యూన్ సైతం ఫుల్ క్యాచీగా ఉండి అదిరిపోయే బీట్స్ తో ఇట్టే ఆకర్షించి, హమ్ చేసేదిగా ఉంది. ఈ పాట ఇంకా పూర్తిగా జనాలకు రీచ్ కాలేదు గానీ అతి త్వరలోనే ఈ పాట ఇన్ స్టా, ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలను తాకి షేక్ చేసేదిగానే కనిపిస్తోంది.
గతంలో ఇలానే కన్నడ నుంచి వచ్చిన ‘హితలక కరిబ్యాద మావ’ అనే పాట బాషాబేదం లేకుండా నెమ్మదిగా స్టార్ట్ అయి కొంతకాలం పాటు దేశాన్ని ఊపేసింది. అన్ని మాధ్యమాల్లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇప్పుడు ఈ రంగి రంగి అనే పాట సైతం ఆ లిస్టులో చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. పాన్ ఇండియాగా వస్తున్న ఈ బ్రాట్’(BRAT) చిత్రం నవంబర్ 14న ప్రేక్షకుల ఎదుటకు రానుంది.