Pawan Kalyan: అచ్చివచ్చిన సెప్టెంబర్ లాస్ట్ వీక్
ABN , Publish Date - Aug 19 , 2025 | 06:13 PM
ఏ నెలలో పుట్టిన స్టార్ కు ఆ మంత్ మస్తుగా కలసి వస్తుందని ఫ్యాన్స్ నమ్మకం. అదే తీరున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సెప్టెంబర్ నెల అచ్చి వస్తుందని అంటున్నారు. ఇంతకూ పవన్ కు సెప్టెంబర్ ప్రతీసారి కలసి వచ్చిందా?
అభిమానులన్నవారి హృదయాలు చాలా విశాలం అని చెప్పవచ్చు. అందునా సినిమా స్టార్స్ ఫ్యాన్స్ మది మరింత విశాలంగా ఉంటుందని ప్రతీతి. ఇక తెలుగు సినీతారల అభిమానగణాల గుండెల విస్తీర్ణం కొలవలేనిది అంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ ను చూస్తోంటే అది నిజమే అనిపిస్తోంది. మొన్నటి దాకా 'హరిహర వీరమల్లు' విడుదల కోసం ఎదురు చూశారు. ఆ సినిమా రాకముందు పలు సెంటిమెంట్స్ గుర్తు చేసుకున్నారు. జూలై మాసంలో పవన్ కళ్యాణ్ కు తొలి బిగ్ హిట్ గా నిలచిన 'తొలిప్రేమ' రోజునే 'హరిహర వీరమల్లు' (Harihara Veeramallu) కూడా రిలీజ్ అవ్వడం వల్ల బంపర్ హిట్ ఖాయమనీ ఆశించారు. కానీ, వారి ఆశల మీద నీళ్ళు చల్లుతూ 'హరిహర వీరమల్లు' విజయాన్ని మూటకట్టుకోలేకపోయింది. దాంతో పవన్ ఫ్యాన్స్ రాబోయే 'ఓజీ' (OG) పై అంచనాలు పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తమ హీరో జన్మించిన సెప్టెంబర్ మాసంలో వస్తోంది కాబట్టి 'ఓజీ' తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు.
'అత్తారింటికి దారేది' బాటలోనే...
పవన్ కళ్యాణ్ బర్త్ డే సెప్టెంబర్ 2వ తేదీన. ఆ రోజున పవన్ నటించిన 'జల్సా, తమ్ముడు' చిత్రాలను రీ-రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. అంటే పవన్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా అని అందరూ భావిస్తున్నారు. నిజానికి రీ-రిలీజ్ మూవీస్ లో మహేశ్ బాబు తరువాత ఆ రేంజ్ సక్సెస్ సాధించింది పవన్ సినిమాలే కావడం విశేషం. తెలుగు రీ-రిలీజ్ మూవీస్ లో పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్, ఖుషి' చిత్రాలు టాప్ 10లో చోటు సంపాదించాయి. ఈ సారి వస్తోన్న 'జల్సా, తమ్ముడు' కూడా ఊపేస్తాయని ఫ్యాన్స్ అభిలాష. అయితే ఈ రీ-రిలీజులకన్నా మిన్నగా సెప్టెంబర్ 25న రాబోయే 'ఓజీ' అలరించాలన్నదే వారి కోరిక. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇప్పటి దాకా సెప్టెంబర్ లో మూడు చిత్రాలే రిలీజ్ అయ్యాయి. 2004 సెప్టెంబర్ 10న 'గుడుంబా శంకర్' రాగా, 2010 సెప్టెంబర్ 10వ తేదీనే 'పులి' జనం ముందు నిలచింది. ఈ రెండు సినిమాలు ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశను కలిగించాయి. అయితే 2013 సెప్టెంబర్ 27న వచ్చిన 'అత్తారింటికి దారేది' సినిమా పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలచింది. ఆ తరువాత నుంచీ పవన్ కు మళ్ళీ ఆ స్థాయి సక్సెస్ లభించక పోవడం గమనార్హం. అందువల్ల సెప్టెంబర్ 25న వచ్చే 'ఓజీ' తప్పకుండా 'అత్తారింటికి దారేది' చూపిన బాటలోనే గ్రాండ్ సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.
కొన్ని అనుమానాలు...
పవన్ కళ్యాణ్ తో సుజీత్ దర్శకత్వంలో డి.వి.వి. దానయ్య 'ఓజీ' చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చారు. ప్రియాంక మోహన్ ఈ సినిమాలో హీరోయిన్. ప్రియాంక తెలుగులో నటించిన మూడు చిత్రాల్లో 'నానీస్ గ్యాంగ్ లీడర్' జనాన్ని ఆకట్టుకుంది. అందువల్ల కొందరిలో ప్రియాంకపై కొన్ని అనుమానాలున్నాయి. అయితే ఇందులోని 'హంగ్రీ చీతా...' అంటూ సాగే పాట ఇంతకు ముందే ఆకట్టుకుంది. ఈ మధ్య విడుదలైన 'ఓజీ'లోని 'ఓజస్ గంభీర...' అంటూ మొదలయ్యే గీతం అభిమానుల్లో ఉత్సాహం ఉరకలు వేసేలా చేస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా డి.వి.వి. దానయ్య నిర్మించిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' అంతగా అలరించలేదు.. ఈ నేపథ్యంలో నిర్మాత, హీరోయిన్ ఎలా ఉన్నా, పవన్ కు కొత్త డైరెక్టర్ అయిన సుజీత్ తో బంపర్ హిట్ ఖాయమనీ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి ఫ్యాన్స్ వేసుకున్న లెక్కలను ఈ సారి 'ఓజీ' ఏం చేస్తుందో? ఏ రేంజ్ లో మురిపిస్తుందో చూడాలి.
Also Read: Theater Movies: ఈ వారం.. దేశవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోన్న సినిమాలివే
Also Read: War-2: యన్టీఆర్ వల్లే ఆ మాత్రం కలెక్షన్స్ అని టాక్