War-2: యన్టీఆర్ వల్లే ఆ మాత్రం కలెక్షన్స్ అని టాక్

ABN , Publish Date - Aug 19 , 2025 | 05:17 PM

ప్రత్యర్థి హీరోల సినిమాలు పరాజయం పాలయితే పరమానందం చెందుతారు ఫ్యాన్స్. అయితే తమ ఫేవరెట్ స్టార్స్ మూవీస్ ఫ్లాప్ అనగానే ఏవేవో కారణాలు వెదుకుతూ ఉంటారు. 'వార్ 2' రిజల్ట్ తో కొందరు ఫ్యాన్స్ ఆ బాటలోనే పయనిస్తున్నారు.

War -2 Movie

'వార్ 2' (War 2) రిలీజ్ కు ముందు యన్టీఆర్ (NTR) తొలి హిందీ చిత్రం అంటూ అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. గతంలో తెలుగు స్టార్స్ నటించిన మొదటి హిందీ సినిమాలనూ బేరీజు వేసుకున్నారు. 'దేవర' (Devara) హిట్టు తరువాత వస్తోన్న చిత్రం కాబట్టి 'వార్ 2'కు ఢోకా లేదనీ భావించారు. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ 'వార్ 2' ఆశించిన స్థాయిలో అలరించలేక పోయింది. ముఖ్యంగా యన్టీఆర్ కు ఎంతో పట్టున్న తెలుగునేలపైనా 'వార్ 2' సత్తా చాటుకోలేక పోవడం గమనార్హం! దాంతో యన్టీఆర్ ను గతంలో హిందీ మూవీస్ లో నటించిన ప్రభాస్, రామ్ చరణ్ తో పోలుస్తూ జనం ట్రోల్ చేశారు. అయితే తమ హీరోను, ఆ హీరోలను ఒకే గాటన కట్టడం సరికాదని యంగ్ టైగర్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పటి దాకా టాలీవుడ్ స్టార్స్ నటించిన మొదటి హిందీ సినిమాలన్నిటా ఆ హీరోలు పాజిటివ్ రోల్స్ లోనే మురిపించారు. కానీ, అందరికీ భిన్నంగా యన్టీఆర్ 'వార్ 2'లో నెగటివ్ రోల్ లో అలరించారని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. ఫలితం ఎలా ఉన్న 'వార్ 2'లో యన్టీఆర్ నటన బాగుందనీ వాదిస్తున్నారు.


ఆ లెక్కే వేరుగా ఉండేదా !?

ఆ నాటి నుంచి ఈ నాటి వరకు హిందీ సినిమాల్లో మన స్టార్ హీరోస్ వివరాలు చూస్తే - యంగ్ టైగర్ ఫ్యాన్స్ చెబుతున్నది నిజమే అనిపిస్తోంది. యన్టీఆర్, ఏయన్నార్, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, రామ్ చరణ్, ప్రభాస్ - ఇలా అందరూ తమ తొలి హిందీ చిత్రాల్లో హీరోలుగానే నటించారు. పైగా వారందరూ హీరోయిన్స్ తో ఆడిపాడారు. కానీ, జూనియర్ యన్టీఆర్ మాత్రం 'వార్ 2'లో వీరందరికంటే భిన్నంగా ప్రతినాయక పాత్రలో కనిపించారు. 'వార్ 2' ఫలితం ఎలా ఉన్నా అందులో యన్టీఆర్ కు హీరోయిన్ లేకపోవడం పెద్ద మైనస్ అని ఫ్యాన్స్ అంటున్నారు. అందువల్లే తెలుగునాట 'వార్ 2' ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయిందనీ గుర్తు చేస్తున్నారు. యన్టీఆర్ లాంటి యంగ్ హీరోకి పెయిర్ లేకుండా సినిమా తీయడమే పెద్ద సాహసమని, ఆ అడ్వంచర్ చేసిన యశ్ రాజ్ ఫిలిమ్స్ ను అభినందించాల్సిందే అంటున్నారు అభిమానులు. ఈ విషయాన్ని హృతిక్ రోషన్ ఫ్యాన్స్ కూడా అంగీకరించడం ఇక్కడి విశేషం. యన్టీఆర్ లాంటి డాన్సర్ తో ఓ హీరోయిన్ ఉండి ఉంటే లెక్కలు వేరేగా ఉండేవనీ హృతిక్ ఫ్యాన్స్ అంటున్నారు.


హాలీవుడ్ పై గురి పెట్టాలట!

తమ హీరో యన్టీఆర్ కు ప్రస్తుతం ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. అందువల్లే 'వార్ 2'లో కథ, కథనం ఏ మాత్రం బాగోలేకపోయినా, ఆ మాత్రం వసూళ్ళు వచ్చాయనీ చెబుతున్నారు. ఇక మేకింగ్ జనాన్ని ఆకట్టుకొనేలా ఉంటే పోటీ చిత్రాలనే కాదు, అంతకు ముందు రికార్డ్స్ నెలకొల్పిన సినిమాలను సైతం క్రాస్ చేసేదని అభిమానుల మాట! యన్టీఆర్ తనకున్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని హాలీవుడ్ మూవీస్ లో నటిస్తే బాగుంటుందనీ ఫ్యాన్స్ కోరిక. ఇప్పటి నుంచే హాలీవుడ్ ఏజెంట్స్ ద్వారా ఆ ప్రయత్నాలు మొదలు పెడితే ఎంతో మేలనీ అభిమానులు అంటున్నారు. మరి ఫ్యాన్స్ అభిలాషను నెరవేర్చేందుకు యంగ్ టైగర్ ఇప్పటి నుంచే హాలీవుడ్ ట్రయల్స్ మొదలెడతారేమో చూద్దాం.

Also Read: Shruti Haasan: ఆ పోలిక నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు...

Also Read: Aishwarya Rai Bachchan: ఆత్మగౌరవాన్ని సోషల్‌ మీడియాలో వెతకొద్దు.. దొరకదు..

Updated Date - Aug 19 , 2025 | 05:17 PM

WAR 2 Song Promo: హృతిక్‌ వర్సెస్‌ తారక్‌.. 'దునియా సలాం అనాలి'

War 2 - Coolie: వార్-2, కూలీ టిక్కెట్ రేట్ల‌ పెంపు.. జనం మండిపాటు

War 2 Trailer: ఇద్దరు వీరుల యుద్ధం

WAR 2: వార్‌-2.. తెలుగు కోసం కొత్త టైటిల్‌.. నిజమేనా?

War -2 : పాట చిత్రీకరణలో...